Water scarcity: యుద్ధం కన్నా నీరే పవర్ ఫుల్! కరోనాకు మించి డేంజర్ బెల్స్!

గ్యాలన్ల కొద్దీ నీటిని ఖర్చు చేసేస్తారు. మరి ఒక్క నీటి బొట్టును అయినా సృష్టించగలరా? తయారుచేసే శక్తి లేనప్పుడు వృథాగా ఖర్చు చేసే హక్కు ఎక్కడిది? నీటిని స్టాక్ మార్కెట్ లో పెట్టి ట్రేడింగ్ చేసే పరిస్థితి వస్తుందా? మనిషికి కృత్రిమంగా నీటిని తయారుచేసే శక్తుందా? 2050 నాటికి 10 వేలలో.. 3061 రివర్ బేసిన్లలోని నీరు తాగలేం! నీటి కాలుష్యంతో ఒక్క మనదేశంలోనే ఏడాదికి దాదాపు 2 లక్షల మంది చనిపోతున్నారు. అంటే కరోనా కంటే ఇదే డేంజర్! ఇలాంటి కఠినమైన నిజాలను మీ ముందు ఉంచబోతోంది ఈ ఆర్టికల్.

Water scarcity: యుద్ధం కన్నా నీరే పవర్ ఫుల్! కరోనాకు మించి డేంజర్ బెల్స్!
Water Scarcity
Follow us

| Edited By: Ravi Panangapalli

Updated on: Jun 14, 2024 | 10:43 AM

కాస్త ముఖం కడుక్కుని రా అని అంటే.. కొంతమంది బకెట్ నీళ్లు వాడతారు. చేతులు శుభ్రంగా కడుక్కో అనడమే పాపం.. అర బకెట్ నీళ్లు ఖర్చయిపోతాయి. ఇక స్నానం చెయ్యు అని చెబితే చాలు.. రెండు, మూడు బకెట్లయినా వాడనిదే వారికి నిద్ర పట్టదు. ఇంతటి నీటి వృథాను భరించలేనివారు.. జలాన్ని పొదుపుగా వాడుకోవాలనుకునేవారు.. ఇలాంటి వారిని ఎడారిలో పడేయాలి అని అనుకుంటారు. కానీ వారు అలా అనుకున్నా లేకున్నా.. నీటి లభ్యతకు సంబంధించిన కఠినమైన వాస్తవాలను మీరు చదవబోతున్నారు.

మనకు తెలుసు H2Oను నీరు అంటారని. రెండు హైడ్రోజన్ అణువులు, ఒక ఆక్సిజన్ అణువును కలిపితే చాలు నీరు వచ్చేస్తుంది అని. మరి అలాంటి నీటిని ఎందుకని తయారుచేయలేకపోతున్నాం. మన వాతావరణంలో హైడ్రోజన్ బోలెడు, ఆక్సీజన్ కావాల్సినంత ఉంది. పైగా మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యుగంలో ఉన్నాం. అయినా గానీ నీటిని తయారుచేయలేమా? చేయలేం. పెద్దపెద్ద ప్రయోగశాలలు పెట్టి హైడ్రోజన్, ఆక్సీజన్ అణువులను కలిపినా సరిపడేంత నీటిని తయారుచేయలేం. ఎందుకంటే, ఒక్క చుక్క నీటిని ల్యాబ్‌లో తయారుచేయాలంటే కనీసం 10 గంటలకు పైనే పడుతుందని అంచనా. అది కూడా అత్యంత వేడిని పుట్టిస్తే గానీ జరగని పని. అలా అయినా నీరు పుట్టదు. గ్యాస్ రూపంలో మారుతుంది. దాన్ని ద్రవరూపంలోకి మారిస్తేనే నీటి చుక్క పుడుతుంది. అందుకే, మన ప్రకృతి దానంతట అది ఇస్తే తప్ప మానవాళికి నీరు అందదు. మరి ఆ ప్రకృతినే నాశనం చేసుకుంటుంటే ఇక నీరు ఎక్కడి నుంచి వస్తుంది?

Water 1

ఇవాళున్న బంగారం ధర రేపు ఉండదు. పెట్రోల్ రేటును ప్రతి 15 రోజులకోసారి రివ్యూ చేస్తూనే ఉంటారు. రేప్పొద్దున లీటర్ నీటిని కూడా అలాగే కొలిచి ఇస్తే..? నీటిని స్టాక్ మార్కెట్లో పెట్టి ట్రేడింగ్ చేసే పరిస్థితే వస్తే.! మరీ అంత దారుణ పరిస్థితి రాదని అనొద్దు. నీళ్లని సీసాలో పోసి లీటర్‌కి ఇంత అని అమ్ముతారని కొన్ని సంవత్సరాల క్రితం అనుకున్నామా? కలలోనైనా ఊహించామా? అలాంటిది స్టాక్ మార్కెట్లో నీటిని అమ్మే పరిస్థితి రాదని ధీమాగా చెప్పగలమా?

Water 2

దాహం.. రాజు పేద అనే బేధం చూడదు. నీరు లేకపోతే ఎవరికైనా గొంతు ఎండుతుంది. మనం చిన్నప్పటి నుంచి ఒకే విషయం చదువుతున్నాం. మన భూమిపై 70 శాతం నీరే ఉంది అని. ఆ 70 శాతంలో 97.2 శాతం తాగడానికి పనికి రాని సముద్రపు నీరే. 2.15 శాతం నీరు మంచు రూపంలో, గడ్డకట్టుకుపోయిన హిమానీనదాల రూపంలో ఉండిపోయాయి. సో, అవి కరిగిపోవాలని కోరుకోకూడదు. ఇక మనిషి తాగడానికి మిగిలింది భూగర్భ జలాలు, నదులు మంచి నీటి సర్సులు. భూగర్భ జలాలు, నదుల్లో దొరికే నీరు 0.61 శాతం మాత్రమే. మంచినీటి సరస్సుల ద్వారా 0.009 శాతం నీరు మాత్రమే దొరుకుతోంది. అయినా సరే.. మనిషికి జాగ్రత్త లేదు. డబ్బును విపరీతంగా ఖర్చుచేస్తుంటే ‘నీళ్లలా ఖర్చు చేయకురా’ అంటారు. అంటే, నీటిని అణాపైసాకు కూడా లెక్కగట్టం. అంత చీప్‌గా తీసి పారేస్తాం. ఇప్పుడు ఆ నీరే వెరీ కాస్ట్లీ అయింది. కావాలంటే ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలాంటి నగరాలకు వెళ్లి చూడండి.

Water 3

ఒకప్పుడు నాగరికత మొదలైందే నదీ తీరంలో. ఇప్పటికీ ప్రపంచ జనాభాలో 80 శాతం మంది 10వేలకు పైగా ఉన్న రివర్ బేసిన్ల వద్దే బతుకుతున్నారు. నీటి అవసరం, విలువ తెలుసుకుని నది దగ్గరికి వచ్చి బతకడం అలవాటు చేసుకున్న మనిషి.. ఉచ్చంనీచం మరిచి ఆ నదినే విషతుల్యంగా మారుస్తున్నాడు. హైదరాబాద్ నగరం ఏర్పడింది కూడా మూసీ నది ఒడ్డునే. ఒకప్పుడు స్వచ్ఛమైన తాగునీటిని అందించింది. ఇప్పుడు మూసీ నుంచి ఒక మూతడు నీటిని తీసుకుని తాగగలరా ఎవరైనా! అలాగే హుస్సేన్ సాగర్ కూడా. ఒకప్పుడు ఈ మహానగరానికి నీటి అవసరాలను తీర్చింది. ఇప్పుడు ఎవరూ ఆ సాహసం చేయలేరు. పోనీ ఇప్పటికైనా మారారా అంటే.. అదీ లేదు.  జంట రిజర్వాయర్లను కాపాడడానికి చుట్టుపక్కల ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని ఓ జీవో వస్తే.. చివరికి దాన్ని కూడా రద్దు చేసే ప్రయత్నం జరిగింది. సో, మనిషి మారలేదు అని అర్థం అవుతోంది.

Water 4

తాగునీటికి మనిషి ఇస్తున్న విలువ ఎంతో ఒక్క ఉదాహరణ చూద్దాం. 2050 నాటికి 10వేలకు పైగా రివర్ బేసిన్లలో కేవలం 3061 రివర్ బేసిన్లలోని నీరు.. తాగడానికి పనికిరాకుండా పోతుందని నెదర్లాండ్స్‌లోని వాగెనింగెన్‌ యూనివర్సిటీ రీసెర్చ్ తెలిపింది. నీరు ఒక పరిమితమైన సంపద అనే విషయం మరిచి ప్రవర్తిస్తున్నాడు మనిషి. నీటిని, నదులను పవిత్రంగా భావించే భారతదేశంలోనూ ఇదీ ధోరణి. పండగలు, ప్రత్యేక తిథులు వస్తే స్నానం చేయడానికి నదులకే పరిగెత్తుకెళతాం. సబ్బులు, షాంపులు పట్టుకెళ్లి పవిత్రమైన నదినే అపవిత్రం చేస్తుంటాం. ఇంట్లో స్నానం చేసి నదిలో మూడు మునకలు వేసి రమ్మని పెద్దలు చెబుతుంటే.. ఒంటికున్న చెత్తనంతా నదుల్లో కలిపి వస్తున్నాం. మనిషి పాపం చేస్తూ తన పాపాలన్నీ తొలగిపోయాయనే దరిద్రమైన ఫీలింగుతో బయటకు వస్తున్నాడు. చివరికి ప్రభుత్వాలకు కూడా సోయి లేదనే చెప్పాలి. నదుల్లో, నీటి వనరులలో వ్యర్ధాలను కలపొద్దన్న స్పృహ లేదు. నగరాల్లో ఉండే చెరువులను, సరస్సులను కాపాడుకుందాం అనే బాధ్యత లేదు. ఆ కారణంగానే ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాలకు ఇంతటి దుస్థితి. నీటి కొరతకు అతిపెద్ద కారణం కాలుష్యం. భూతాపం, వాయుకాలుష్యం కారణంగా వాతావరణంలో తేమ తగ్గిపోతోంది. వర్షాలను, రుతుపవనాల రాకను తలకిందులు చేస్తోంది. అభివృద్ధి పేరుతో చెట్లు నరికి వాతావరణాన్ని మరింత నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటికే వాతావరణ కాలుష్యం 300 కోట్ల మంది ప్రజలపై ప్రభావం చూపుతోంది. ఇదే కాలుష్యం నీటి కొరతకూ కారణమవుతోంది.

ఒకసారి ఆఫ్రికా లాంటి దేశాలకు వెళ్తే నీటి విలువ ఏంటో తెలుస్తుంది. కరువు సమయంలో దాహం వేసి గొంతు ఎండుకుపోతున్నప్పుడు ఏదైతే అది అయిందని చెప్పి అత్యంత మురుగునీటిని గొంతులో పోసుకుంటారు. మరికొన్ని దేశాల్లో తప్పక ఉప్పునీటినే తాగుతున్నారు. మామూలుగా కాస్త అటుఇటుగా శుద్ధి చేసిన నీటిని తాగితేనే జబ్బులొచ్చి చనిపోతున్నారు. అలాంటిది మురికినీరు తాగితే బతుకుతారా. ప్రపంచం వరకు అక్కర్లేదు గానీ.. ఒక్క మనదేశంలోనే ఏడాదికి దాదాపు 2 లక్షల మంది చనిపోతున్నారు. ఇది కనిపించని కరోనా మహమ్మారి లాంటిదే. 2023 నాటికి ప్రపంచంలోని ప్రజలందరికీ తాగునీటిని అందించాలని ఓ గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించింది ఐక్యరాజ్య సమితి. 2023 వెళ్లిపోయింది గానీ లక్ష్యం మాత్రం నెరవేరలేదు. ఎందుకంటే, దానికి బోలెడంత డబ్బు కావాలి. ఏడాదికి 600 బిలియన్ డాలర్ల నుంచి ట్రిలియన్ డాలర్ల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. చాలా ఈజీగా యుద్ధాలు చేయగల దేశాలకు నీటి కోసం ఖర్చుపెట్టడానికి మాత్రం డబ్బుల్లేవు. అదీ జల కథ, వ్యథ.

Water 5

వచ్చే ఆరేళ్లలో భారతదేశ నీటి అవసరాలు రెండింతలు పెరగబోతున్నాయి. నీతి ఆయోగ్ ఎప్పుడో ఇచ్చిన నివేదిక ఇది. మరోవైపు దేశంలో నీటి లభ్యత తగ్గిపోతోంది. నీరు అనేది దేశ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. నీటి కొరత దేశ జీడీపీలో 6 శాతం తగ్గుదలకు కారణం అవుతుందని నివేదికలు కూడా చెబుతున్నాయి. ఐక్యరాజ్యసమితి ఇప్పటికే ఒక సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది. 2050 నాటికి, అంటే మరో పాతికేళ్లలో ఇండియాలో నీటి కొరత అత్యంత తీవ్రంగా ఉండబోతోందట. మరీ పాతికేళ్ల వరకు వెళ్లక్కర్లేదు. 2025 నాటికి, అంటే వచ్చే ఏడాదికి 180 కోట్ల మంది తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కోబోతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా జనాలకు నీటి లభ్యతే లేదు. మరో 270 కోట్ల మందికి ఏడాదిలో 11 నెలలు మాత్రమే నీరు దొరుకుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద నగరాల్లోనూ తీవ్రమైన నీటి సమస్య ఉంది. ప్రతి నాలుగు నగరాల్లో ఒకటి తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. ఇక ఒక్క ఆసియా ఖండంలోనే 80 శాతం ప్రజలు నీటి సమస్య ఎదుర్కొంటున్నారు.

Water 6

ఒక్క ఇండియానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కనీసం 80కు పైగా దేశాలు తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. దేశంలో నీటి సమస్యకు రుతుపవనాలు ఆలస్యమవడం అన్నది పెద్ద కారణమే కాదు. వర్షాలు పడినప్పుడు ప్రతి బొట్టును ఒడిసిపట్టుకుని నిల్వ చేసుకునే ముందు చూపు లేకపోవడమే అతి పెద్ద సమస్య. వర్షాలు కురిసినప్పుడు ఎన్ని లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా పోతున్నాయో చూస్తూనే ఉన్నాం. అయినా గానీ, వాటిని నిల్వ చేసే రిజర్వాయర్లు కట్టలేకపోతున్నాం. ఆ పనే చేసుంటే భూగర్భ జలాలు పెరిగేవి. ఒక సీజన్‌లో వర్షాలు కురవకపోయినా.. కరువు తీరేంత నీరు కూడా లభ్యమయ్యేది. కనీసం భూగర్భ జలాలను పెంచుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు మనం. భూమ్మీద పడిన చినుకుల్లో కొన్ని నేలతల్లి గర్భంలోకి వెళ్లాలి. అప్పుడే చల్లగా ఉంటుంది. ఎంత నీరు ఇంకితే అంత భూగర్భ జలం. నీరు ఇంకకుండా కాంక్రీట్ అడవులను సృష్టిస్తున్న మనిషి.. అవసరాల కోసం పాతాళంలో ఉన్న ఆ కాసిన్ని నీళ్లను కూడా తోడేసుకుంటున్నాడు. దీని కారణంగానే గత రెండు దశాబ్దాల్లో దేశంలోని దాదాపు 300లకు పైగా జిల్లాల్లో భూగర్భ జలాల నిల్వలు నాలుగు మీటర్లు తగ్గాయని నివేదికలు చెబుతున్నాయి.

భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్ధం వస్తుందో రాదో గానీ.. నీటి యుద్ధాలు మాత్రం తప్పక జరుగుతాయనే చెప్పాలి. ఆమాటకొస్తే రాష్ట్రాల మధ్యే కొట్లాటలు జరుగుతున్నాయి. నాగార్జున సాగర్, శ్రీశైలం దగ్గర ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బలగాలు మోహరించడం చూస్తే యుద్ధ వాతావరణమే కనిపిస్తుంది. తమిళనాడు, కర్నాటక మధ్య కావేరీ నదీ జలాల వివాదం, తెలంగాణ, మహారాష్ట్ర మధ్య గోదావరి జలాల వివాదాలు ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. భారతదేశం కూడా పాకిస్తాన్‌పై నేరుగా యుద్ధానికి దిగడం లేదు. ఆ దేశానికి నీటిని అందించే సింధూ నదికి అడ్డుకట్ట వేసింది. అంటే. దాయాదిని దెబ్బతీయడానికి యుద్ధమే చేయక్కర్లేదు.. ఇలా నీటిని ఆపేసినా చాలు అని చెప్పకనే చెప్పింది. సో, వాటర్ ఈజ్ మోర్ పవర్‌ఫుల్ దేన్ వార్.