MUNUGODU BY-ELECTION: ప్రతిష్టాత్మకం కాకపోయినా మునుగోడు మాదేనంటున్న గులాబీ దళం.. తగ్గేదేలేనంటూ హూంకరిస్తున్న బీజేపీ, కాంగ్రెస్
మూడు పార్టీలు చావో రేవో అన్న చందంగా సమాయత్తమవుతున్నాయి. యాత్రలు, సభలతో మునుగోడులో హీట్ పెంచుతున్నాయి. రాజకీయ పార్టీల హంగామా తీవ్రత తెలియాలంటే మునుగోడు నియోజకవర్గంలోని ఏడు మండలాలు, రెండు మునిసిపాలిటీల పరిధిలో పెరిగిన మద్యం...
MUNUGODU BY-ELECTION SCHDULE ANNOUNCEMENT VERY SOON: మునుగోడు ఉప ఎన్నికల పర్వం త్వరలో ప్రారంభమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తనిఖీలు నిర్వహించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) ఆదేశాలతో గత వారం నల్గొండ (Nalgonda) కలెక్టర్ చర్యలకుపక్రమించారు. ఈ ప్రక్రియ పది, పదిహేను రోజుల్లోగా పూర్తి కానుండడంతో సెప్టెంబర్ నాలుగో వారంలోగా మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూలుపై ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. అదే జరిగితే అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ తొలివారంలో ఉప ఎన్నికల పోలింగ్ జరిగే సంకేతాలున్నాయి. ఉప ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు ఏ స్థాయిలో వున్నా.. రాజకీయ పార్టీలు ప్రధానంగా మూడు పార్టీలు చావో రేవో అన్న చందంగా సమాయత్తమవుతున్నాయి. యాత్రలు, సభలతో మునుగోడులో హీట్ పెంచుతున్నాయి. రాజకీయ పార్టీల హంగామా తీవ్రత తెలియాలంటే మునుగోడు నియోజకవర్గంలోని ఏడు మండలాలు, రెండు మునిసిపాలిటీల పరిధిలో పెరిగిన మద్యం అమ్మకాలను, వాటి గణాంకాలను పరిశీలిస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఓటర్లను మచ్చిక చేసుకునే యత్నాలకు క్యాడర్‌ని, లీడర్లను చేజారిపోకుండా కాపాడుకునే ప్రయత్నాలలో భాగంగా మునుగోడులో లిక్కర్ పార్టీలు జోరందుకున్నట్లు తెలుస్తోంది. అదేసమయంలో ఓటర్లను కులాల వారీగా విభజించి, వారికి పెద్ద ఎత్తున మద్యం సరఫరాలు కూడా కొనసాగుతున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ తరహా వీడియోల జోరు ఏదైనా బహిరంగ సభ, పాదయాత్ర, ర్యాలీ సందర్భంగా మరింత ఎక్కువగా కనిపిస్తోంది. మునుగోడు సెగ్మెంట్‌లో మద్యం అమ్మకాలు జులై నెలలో 25 లక్షల మేరకు జరగ్గా.. ఆగస్టు నాటికి మద్యం అమ్మకాలు దాదాపు రెట్టింపై 45 లక్షలకుపైగా జరిగినట్లు కథనాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి రాజీనామా చేసి బీజేపీ (BJP)లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajgopal Reddy) అక్కడ్నించి కమలం గుర్తుపై పోటీ చేయడం ఖాయం. ఇక కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని గత వారమే ప్రకటించింది. గతంలో రెండుసార్లు పార్టీ టిక్కెట్ ఆశించి భంగపడ్డ పాల్వాయి స్రవంతి (Palwai Sravanti)కి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, అధికార టీఆర్ఎస్ పార్టీ (TRS Party) అభ్యర్థులను ఎదుర్కోవాలంటే అర్ధబలం మెండుగా వున్న చల్లమల్ల కృష్ణారెడ్డి (Challamalla Krishnareddy)కి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ దక్కుతుందని ప్రచారం బాగానే జరిగినా పార్టీ అధిష్టానం అనూహ్య నిర్ణయాన్నే తీసేసుకుంది. జిల్లాలో సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి (Palwai Govardhan Reddy) కూతురిగా స్రవంతి పార్టీ వర్గాలకు సుపరిచితురాలు. దాంతో పాల్వాయి కుటుంబానికి పార్టీ పట్ల వున్న లాయాల్టీకే అధిష్టానం పెద్దపీట వేసినట్లు అర్థమవుతోంది. నిజానికి మునుగోడు నియోజకవర్గంలో బీసీల ఓట్లు అధికంగా వున్న నేపథ్యం, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ (ఇంకా ప్రకటించలేదు)ల తరపున రెడ్డి సామాజిక వర్గానికి టిక్కెట్ దక్కే అవకాశం వుండడం వంటి కారణాలతో మునుగోడు టిక్కెట్ పున్న కైలాస్ నేత (Punna Kailas Neta)కిగానీ, మాజీ జర్నలిస్టు పల్లె రవికుమార్ గౌడ్ (Palle Ravikumar Goud)కిగానీ దక్కుతుందని చాలా మంది భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయంతో పాల్వాయి స్రవంతికి టిక్కెట్ దక్కింది. ఆరకంగా చెప్పాలంటే మునుగోడులో మూడు ప్రధాన పార్టీల్లో తొలి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీనే అధికారికంగా ప్రకటించినట్లయ్యింది. తనను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే నలుగురిని కలుపుకుని పోయే ప్రయత్నాలు ప్రారంభించారు స్రవంతి. టిక్కెట్ ఆశించి భంగపడ్డ చల్లమల్ల కృష్ణారెడ్డితో కలిసి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి (TPCC President Revanth Reddy) ని కలిసి మునుగోడులో కలిసి పని చేద్దామన్న అభ్యర్థనను ముందుంచారు. అదేసమయంలో బీజేపీ అభ్యర్థిగా దాదాపు ఖరారైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నకాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) మద్దతు కోరారు. తన విజయం కోసం చేయూతనివ్వాలని కోరారు. అయితే, రేవంత్ రెడ్డితో ఉప్పునిప్పుగా వున్న వెంకటరెడ్డి.. స్రవంతి విజయం కోసం ఏ మేరకు పనిచేస్తారో వేచి చూడాల్సి వుంది. బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభ్యర్థిత్వం దాదాపు కన్ఫర్మ్ కాగా.. టీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే, అక్కడ మాజీ ఎమ్మెల్యే (2014-18) కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (Kusukuntla Prabhakar Reddy)కే గులాబీ టిక్కెట్ దక్కుతుందని అందరూ అనుకుంటున్నారు. షెడ్యూలు ప్రకటన వచ్చే నాటికి అభ్యర్థులపై స్పష్టత వచ్చే అవకాశం వుంది.
మునుగోడులో విజయం రాజగోపాల్ రెడ్డికి, బీజేపీకి పెద్ద సవాలుగానే భావించాలి. నిజానికి ఈ సీటు విషయంలో టీఆర్ఎస్ పార్టీకి పెద్ద పట్టుదల అవసరం లేదు. ఎందుకంటే అది పార్టీ సిట్టింగ్ సీటుగా కాంగ్రెస్ పార్టీకి, అభ్యర్థి సిట్టింగ్ సీటుగా బీజేపీకి ప్రతిష్టాత్మకం. కానీ రాష్ట్రంలోకి బీజేపీ ఎంట్రీని నిలువరించేందుకు పెద్ద యుద్దమే చేస్తున్న కేసీఆర్ (KCR)కు మునుగోడులో విజయం అత్యంత కీలకం. ఎందుకంటే గత సంవత్సరం ధాన్యం కొనుగోలు అంశంతో ప్రారంభించి, ప్రస్తుతం బీజేపీ ముక్త్ భారత్ (BJP Mukt Bharat) పేరిట నరేంద్ర మోదీ మీద యుద్దాన్ని కొనసాగిస్తున్న కేసీఆర్ గత ఏడాది కాలంలో లేవనెత్తిన లెక్కలేనన్న అంశాలను ప్రజలు విశ్వసిస్తున్నారో లేదో తెలిపేందుకు మునుగోడు ఉప ఎన్నిక లిట్మస్ టెస్టు కాబోతోంది. ఇంకోవైపు తన జాతీయ రాజకీయ ప్రస్థానం ప్రారంభమవుతున్న తరుణంలో జరుగుతున్న ఉప ఎన్నిక కాబట్టి.. అక్కడ విజయం జాతీయ స్థాయిలో పలువురిని ఆకర్షించేందుకు ఉపయుక్తం కానున్నది. అధికార పార్టీ కావడం, అభ్యర్థి (కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అయితే) అర్ధబలం కూడా తోడవడం.. వీటన్నింటికి తోడు మునుగోడులో ట్రెడీషయనల్ ఓటు బ్యాంకు కలిగిన వామపక్షాలు (Left Parties) టీఆర్ఎస్ పార్టీకి అండదండగా నిల్వడం టీఆర్ఎస్ పార్టీకి కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. సుదీర్ఘకాలంగా పాలక పక్షాలకు వ్యతిరేకంగా వుండే వామపక్షాలు ఈసారి అధికారంలో వున్న టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ముందుగా గులాబీ పార్టీకి మద్దతు ప్రకటించిన సీపీఐ (CPI).. .ఏకంగా సీఎం సభలోనే పాల్గొంది.. కేసీఆర్‌తో సీపీఐ లీడర్ పల్లా వెంకటరెడ్డి (Palla Venkat Reddy) డయాస్ పంచుకున్నారు. సో.. సీపీఐ పార్టీ మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలోను టీఆర్ఎస్ పార్టీతో కలిసి నడవనున్నట్లు పల్లా వెంకటరెడ్డి సంకేతాలిచ్చారు. ఇక కాస్త ఆలస్యంగా మద్దతు ప్రకటించిన సీపీఎం (CPM) పార్టీ.. ప్రచారంలో పాలుపంచుకునేది లేనిది ఇంకా స్పష్టత రాలేదు. కానీ రెండు వామపక్షాల లక్ష్యం బీజేపీని నిలువరించడమే కాబట్టి సీపీఎం నేతలు కూడా టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచార పర్వంలో నిల్వవచ్చని భావించాలి. ఇక గత ఎన్నికల్లో కనీస ఓట్లు కూడా పొందలేకపోయినా మునుగోడులో ఈసారి అభ్యర్థి బలం కారణంగా తమదే విజయమనే స్థాయిలో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. మునుగోడు లక్ష్యంగానే బండి సంజయ్ కుమార్ మూడో, నాలుగో విడత ప్రజా సంగ్రామ పాదయాత్రను ప్లాన్ చేశారు. తాజాగా హైదరాబాద్ నగర శివార్ల గుండా కొనసాగుతున్న సంజయ్ పాదయాత్రకు మునుగోడు లక్ష్యంగానే రూటు ఖరారు చేశారు. మునుగోడు నియోజకవర్గానికి దగ్గరలోనే సంజయ్ పాదయాత్ర ముగింపు సభ జరగనున్నది. కాంగ్రెస్ పార్టీ తాను చాలా కాలంపాటు మునుగోడులో విజయం సాధించామని, తమ వెంటనే నియోజకవర్గం ప్రజలున్నారనడానికి 2018లో సాధించిన విజయమే తార్కాణమని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. టీపీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డికి ఇది రెండో ఉప ఎన్నిక. హుజురాబాద్ (Huzurabad) ఉప ఎన్నికలో పార్టీని గెలుపు బాటలో నడిపించలేకపోయారన్నది కాంగ్రెస్ పార్టీలో రేవంత్ వ్యతిరేకవర్గం చెప్పుకుంటోంది. కాకపోతే హుజురాబాద్ ఈటల రాజేందర్, టీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్టాత్మకమయ్యాయి. అప్పట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఈటలకు, సిట్టింగ్ సీటుగా టీఆర్ఎస్ పార్టీకి అప్పట్లో ప్రతిష్టాత్మకమయ్యాయి. ఆ పాయింట్ మీద రేవంత్ రెడ్డి పార్టీలో తన వ్యతిరేకుల నోళ్ళు మూయించగలిగారు. కానీ ప్రస్తుతం ఉప ఎన్నికల జరగనున్న మునుగోడు.. కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ సీటు. సో.. ఇక్కడ పార్టీ అభ్యర్థి స్రవంతిని గెలిపించుకోకపోతే రేవంత్ రెడ్డికి పార్టీలో విమర్శకులను ఎదుర్కోవడం కాస్త కష్టమే అవుతుంది.