MUNUGODU BY-ELECTION: వినసొంపుగా మునుగోడు ముచ్చట్లు.. కోట్ల వ్యయంతో తాత్కాలిక విడిదులు.. పండగ చేస్కుంటున్న లోకల్ లీడర్లు

మునుగోడులో క్యాంపు కార్యాలయాల హంగామా కొనసాగుతోంది. ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని కంకణం కట్టుకున్న బీజేపీ, టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున తమ బలగాలను నియోజకవర్గంలో మోహరించారు. అద్దెకు ఇళ్ళు, ఫంక్షన్ హాళ్ళు తీసుకుని...

MUNUGODU BY-ELECTION: వినసొంపుగా మునుగోడు ముచ్చట్లు.. కోట్ల వ్యయంతో తాత్కాలిక విడిదులు.. పండగ చేస్కుంటున్న లోకల్ లీడర్లు
Munugode Bypoll Candidates
Follow us

|

Updated on: Oct 13, 2022 | 4:38 PM

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం గరం గరంగా సాగుతోంది. ఓవైపు ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ప్రత్యర్థులపై ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. నామినేషన్ల దాఖలును కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో భారీ బలప్రదర్శనలకు తెరలేచింది. అక్టోబర్ 11వ తేదీన నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. సుమారు 40 వేల మందిని గ్యాదర్ చేయించారు. అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. రెండ్రోజుల తర్వాత నామినేషన్ వేసిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. రాజగోపాల్ రెడ్డికి ధీటుగా జనసమీకరణ చేయించారు. ఐటీ, మునిసిపల్ మంత్రి కే.తారక రామారావు, మరో మంత్రి జగదీశ్ రెడ్డి వెంటరాగా ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ప్రభాకర్ రెడ్డి నామినేషన్ పర్వంలో ఉభయ వామపక్షాల రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు కూడా హాజరయ్యారు. ఇదివరకే తన ప్రతినిధి ద్వారా ఓ సెట్ నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ల పర్వం చివరి రోజైన అక్టోబర్ 14న స్వయంగా మరో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.  నామినేషన్ల పర్వం తుది అంకానికి చేరుకుంటున్న తరుణంలో ప్రచార పర్వం వేడెక్కుతోంది. అందులోను ప్రత్యర్థులే లక్ష్యంగా నియోజకవర్గంలో వెలుస్తున్న పోస్టర్లు కాకరేపుతున్నాయి. ముఖ్యంగా 18వేల కోట్ల కాంట్రాక్టులు పొందడం వల్లనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ ఫిరాయించి, ఉప ఎన్నికకు కారణమయ్యారంటూ నియోజకవర్గంలో పోస్టర్లు వెలిశాయి. అదేసమయంలో మంత్రి కేటీఆర్.. కోమటిరెడ్డి బదర్స్‌నుద్దేశించి చేసిన కామెంట్ మరింత కాకరేపింది. కోమటిరెడ్డి సోదరులిద్దరినీ కోవర్టు రెడ్లంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. కేటీఆర్ కామెంట్‌పై కోమటిరెడ్డి బదర్స్ కాస్త ఘాటుగానే స్పందించారు. తన జోలికి వస్తే కల్వకుంట్ల కుటుంబ అవినీతి చిట్టా విప్పుతానని హెచ్చరించారు. ఈ ఆరోపణల పర్వం కొనసాగుతుండగానే నామినేషన్ల ఘట్టం తుది అంకానికి చేరుకుంది.

ఇక మునుగోడులో క్యాంపు కార్యాలయాల హంగామా కొనసాగుతోంది. ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని కంకణం కట్టుకున్న బీజేపీ, టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున తమ బలగాలను నియోజకవర్గంలో మోహరించారు. అద్దెకు ఇళ్ళు, ఫంక్షన్ హాళ్ళు తీసుకుని క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ తరపున పదుల సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గంలో మకాం వేశారు. ఒక్కో ఇంటికి లక్ష దాకా నెల రోజులకు అద్దె చెల్లించి తమ క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఒక్కో ఫంక్షన్ హాల్‌కైతే ఏకంగా నెలరోజుల అద్దె అయిదు లక్షలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతేసి అద్దెలు చెల్లించినా ఇళ్ళు, ఫంక్షన్ హాళ్ళు దొరక్కపోవడంతో అయిదారుగురు ఎమ్మెల్యేలు కలిసి ఒకే ఇంట్లో సర్దుకుంటున్నట్లు సమాచారం. ఇక బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి… ఏకంగా సినిమా సెట్టింగును తలపించేలా భారీ భవంతిని తాత్కాలిక ప్రాతిపదికన నిర్మించుకున్నారు.  రెండెకరాల స్థలంలో కోటి రూపాయల వ్యయంతో తాత్కాలిక క్యాంపు కార్యాలయాన్ని రాజగోపాల్ నిర్మించుకున్నారు. మూడు బెడ్ రూంలు, ప్రతీ రోజు వెయ్యి మందికి వండి వడ్డించే సౌకర్యాలతో కోమటిరెడ్డి ఈ తాత్కాలిక వసతిని ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఓ పూజగదిని కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఇక మునుగోడు ఉప ఎన్నిక కారణంగా కింది స్థాయి ప్రజాప్రతినిధుల పంట పండిందనే చెప్పాలి. వార్డు మెంబర్ మొదలుకొని జడ్పీటీసీ దాకా ఎప్పుడు ఏ పార్టీలో వుంటారో, ఎప్పుడు ఏ కండువా కప్పుకుంటారో తెలియని పరిస్థితి. పొద్దున్నే ఒక పార్టీ లక్ష పంపితే ఆ పార్టీ కండువా.. సాయంత్రానికి ఇంకోపార్టీ రెండు లక్షలు పంపితే ఆ పార్టీ కండువా కప్పుకునే పరిస్థితి మునుగోడు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో, రెండు మునిసిపాలిటీల్లో కనిపిస్తోంది. పదేళ్ళ క్రితం ఫ్లొరైడ్ సహిత తాగునీటితో అల్లల్లాడిన మునుగోడులో ఇవాళ ఖరీదైన వాహనాలు, ఖద్దరు షర్టులు, ఖరీదైన వాచీలు, బంగారు గొలుసులు, బ్రేస్‌లెట్లు, ఉంగరాలు కలిగి వున్న నేతల హంగామా కనిపిస్తోంది. స్థానికంగా వున్న నాయకులే కాకుండా సుమారు 25 వేల మంది బయటి నుంచి వివిధ పార్టీల తరపున నియోజకవర్గంలో మకాం వేసిన వారున్నట్లు అంచనాలు వినిపిస్తున్నాయి. అదేసమయంలో 25 వేలకు పైగా వచ్చిన ఓటరు దరఖాస్తులు కూడా మునుగోడులో కాకరేపుతున్నాయి. ఎన్నికల షెడ్యూలు వెలువడే దాకా నియోజకవర్గంలో కొత్త ఓటరు కార్డుల జారీకి దరఖాస్తులు దాఖలయ్యాయి. నియోజకవర్గానికి చెందని వారు కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు నమోదు చేసినట్లు తెలుస్తుండగా.. ఈ ప్రక్రియలో టీఆర్ఎస్ కుట్ర వుందంటూ బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దాంతో ఈ దరఖాస్తుల పరిశీలనలో అధికారులు కాస్త కటువుగానే వున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు దాదాపు పదివేల దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలుస్తోంది.  మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ల నమోదు జరిగిందని, ఫార్మ్ 6 ప్రకారం కొత్తగా దాదాపు 25 వేల దరఖాస్తు చేసుకున్నారని.. ఇదంతా అక్రమమని పిటిషనర్ వాదిస్తున్నారు. అయితే, ఫైనల్ ఓటర్ లిస్టు ఇంకా వెల్లడించలేదని కేంద్ర ఎన్నికల సంఘం చెబుతోంది. కేసు విచారణ అక్టోబర్ 14న కొనసాగనుండగా.. తుది ఓటర్ల జాబితాను కోర్టుకు సమర్పించాల్సిందిగా ధర్మాసనం ఆదేశించింది.

ఇదిలా వుండగా..  మునుగోడు ఉప ఎన్నికల బరిలో వుంటామని తొలుత ప్రకటించిన తెలంగాణ తెలుగుదేశం నేతలు.. ఉన్నట్లుండి వెనక్కి తగ్గారు. బరిలో నిల్వడం లేదని, ప్రస్తుతానికి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంపైనే దృష్టి సారించామని టీ.టీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు ప్రకటించడంతో ఆ పార్టీ మునుగోడు బరి నుంచి తప్పుకున్నట్లయ్యింది. నిజానికి మునుగోడు బరిలోకి దిగాలన్న ఉద్దేశంతో టీ.టీడీపీ సమీక్షా సమావేశాలు నిర్వహిచింది. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో పలుమార్లు తెలంగాణ టీడీపీ నేతలు సమావేశాలు నిర్వహించారు. మునుగోడులో పోటీ చేద్దామని పోటీ చేయడానికి అక్కడ క్యాడర్ కూడా ఆసక్తి చూపుతుందని బాబుకు చెప్పారు. అభ్యర్థి గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కిలి ఐలయ్య యాదవ్ పేరుని పరిశీలించడమే కాదు నామినేషన్ వేయడానికి పత్రాలు సిద్ధం చేసుకోవాలని కూడా ఎన్టీఆర్ భవన్ నుండి సమాచారం కూడా అందించారు. ఇక అధికారిక ప్రకటనే తరువాయి అనుకుంటున్న తరుణంలో బరిలోకి దిగడం లేదంటూ బక్కని నర్సింహులు స్టేట్ మెంట్ రిలీజ్ చేశారు. ఇదేంటని అడుగుతున్న మీడియాతో.. మునుగోడులో పోటీ చేయడం వల్ల ఉపయోగం లేదని, తమ లక్ష్యం 2023 ఎన్నికలని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే టీ.టీడీపీ మునుగోడు బరిలోకి దిగకపోవడానికి కారణం కొత్తగా పొడుస్తున్న పొత్తు పొడుపే కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బీజేపీతో జత కట్టేందుకు చంద్రబాబు మొగ్గు చూపుతున్న తరుణంలో మునుగోడులో ఆ పార్టీకి మద్దతివ్వాలని ఆయన సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే మరో వర్గం మాత్రం రేవంత్ రెడ్డితో వున్న సాన్నిహిత్యం కారణంగానే చంద్రబాబు మునుగోడు బరిలో దిగవద్దని పార్టీ క్యాడర్‌ని ఆదేశించినట్లు వాదిస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యూహం ఏదైనా.. ప్రస్తుతం మూడు ప్రధాన పార్టీలు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచార పర్వంతో మునుగోడు మార్మోగిపోతోంది.

Latest Articles