Khammam Politics: తెలంగాణ ఒకెత్తు… ఆ ఒక్క జిల్లా ఒకెత్తు.. రసవత్తరంగా మారుతున్న ఓ ఖిల్లా… రానున్న రోజుల్లో మరిన్ని ట్విస్టులు!

బీఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తూ ఉన్నాయి. ఇలాంటి కీలక తరుణంలో ఒక జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి

Khammam Politics: తెలంగాణ ఒకెత్తు... ఆ ఒక్క జిల్లా ఒకెత్తు.. రసవత్తరంగా మారుతున్న ఓ ఖిల్లా... రానున్న రోజుల్లో మరిన్ని ట్విస్టులు!
Telangana Politics
Follow us

|

Updated on: Jan 05, 2023 | 9:04 PM

తెలంగాణలో బలం పెంచుకునేందుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు మూడు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తూ ఉన్నాయి. ఇలాంటి కీలక తరుణంలో ఒక జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాలంలో తెలంగాణ ప్రాంతంలో వున్న వున్న పది జిల్లాల్లో తెలంగాణవాదం బలంగా వినిపించినప్పటికీ ఓ జిల్లాలో మాత్రం సగభాగం ఉద్యమానికి దూరంగా వుండింది. ప్రత్యేక తెలంగాణవాదం బలంగా ఉన్న రోజుల్లో.. సగం జిల్లా సమైక్యవాదం పైపు మొగ్గింది. అదే జిల్లాలో ఇప్పుడు ప్రత్యేక రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. ఈపాటికి అది ఏ జిల్లానో అర్థమయ్యే ఉంటుంది. ఎస్.. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు ఇప్పుడు అందరిని దర్శిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, ప్రధాన రాజకీయ నేతల కదలికలు, వారు నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు చర్చనీయాంశాలుగా మారాయి. రానున్న రోజుల్లో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయనే అంశంపై సర్వత్రా చర్చోప చర్చలు కొనసాగుతున్నాయి.

తుమ్మల దారెటు?

ఉమ్మడి ఖమ్మం జిల్లా గురించి చెప్పుకోవాల్సి వస్తే ముందుగా ప్రస్తావించాల్సింది మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురించి. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొలి రోజుల్లోనే ఆయన పిలుపు మేరకు పార్టీలో చేరిన తుమ్మల నాగేశ్వరరావు అనతి కాలంలోనే జిల్లాలో ప్రభావవంతమైన లీడర్‌గా ఎదిగారు. వామపక్షాల ప్రభావం అధికంగా ఉన్న జిల్లాలోనూ తనదైన శైలిలో రాజకీయాలు నిర్వహించి తెలుగుదేశం పార్టీకి పట్టు దక్కేలా చేశారు. పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తుమ్మల నాగేశ్వరరావు.. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు మంత్రివర్గాల్లో పనిచేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పిలుపుమేరకు గులాబీ పార్టీలో చేరారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా లేని తుమ్మల నాగేశ్వరరావును ఏకంగా మంత్రిని చేశారు కేసీఆర్. ఆ తర్వాత ఎమ్మెల్సీగా చేసి మంత్రివర్గంలో కొనసాగేలా చూసుకున్నారు. కానీ, 2016లో పాలేరు నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాంరెడ్డి వెంకట్ రెడ్డి ఆకస్మికంగా మరణించడంతో ఖాళీ అయిన నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు తుమ్మల నాగేశ్వరరావు. 2018 వరకు మంత్రిగా కొనసాగిన తుమ్మల నాగేశ్వరరావు.. అదే సంవత్సరం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచే మళ్లీ పోటీ చేసి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి చేతిలో అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. తుమ్మలపై గెలిచిన ఉపేందర్ రెడ్డి ఆ తర్వాత కాలంలో కేసీఆర్ పార్టీలో చేరిపోయారు. దాంతో తుమ్మల నాగేశ్వరరావు హవా ఆ నియోజకవర్గంలో క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఆయన కూడా క్రియాశీల రాజకీయాల నుంచి కొంత విరామం తీసుకున్నట్లుగా కనిపించింది. అయితే తాజాగా నవంబర్ నెలలో తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గంలో తన సామాజిక వర్గం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత మాట్లాడుతూ సంచలన కామెంట్లు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పాలేరు నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. తుమ్మలపై గెలిచిన ఉపేందర్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. సిట్టింగులందరికీ మళ్ళీ అవకాశం కల్పిస్తానని కెసిఆర్ ఇటీవలనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు తానే పాలేరులో పోటీ చేస్తానని ప్రకటించడం సంచలనంగా మారింది. అయితే ఆయన బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోటీ చేస్తారా లేక మరేదైనా పార్టీలో చేరి బరిలోకి దిగుతారా అన్నది తేలలేదు. ఇందులో ఏదైనా జరగవచ్చన్న చర్చ తుమ్మల కామెంట్ల తర్వాత జోరందుకున్నాయి. కేసీఆర్ టిక్కెట్ ఇవ్వకపోతే, ఇండిపెండెంటుగా కూడా ఆయన బరిలో వుండవచ్చన్న అంచనాలు మొదలయ్యాయి. ఈ చర్చ అలా కొనసాగుతుండగానే తాజాగా జనవరి ఒకటవ తేదీన తుమ్మల నాగేశ్వరరావు మరోసారి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఒక్క పాలేరు నియోజకవర్గం మాత్రమే కాకుండా జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి తన అనుచరవర్గాన్ని అంతా ఆహ్వానించి తన బలాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు తుమ్మల నాగేశ్వరరావు. కేసీఆర్‌ను ఒప్పించి బీఆర్ఎస్ టిక్కెట్ కొట్టేస్తారా? తెలంగాణ టీడీపీలో కదలికలు మొదలైన తరుణంలో ఆ పార్టీ తరపున బరిలోకి దిగుతారా లేక ఇండిపెండెంటుగా ఎన్నికలను ఎదుర్కొంటారా అన్నది ఆసక్తి రేపుతోంది. ఈ సందర్భంగా ఆయన ఎలాంటి కామెంట్లు చేయనప్పటికీ ఆయన కదలికలు మాత్రం రాజకీయంగా ఆయన ఏదో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా సూచనలు ఇచ్చాయి.

పొంగులేటి వ్యూహమేంటి?

ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరో కీలక నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున ఖమ్మం నుంచి ఎంపీగా గెలిచిన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2019 వరకు ఎంపీగా కొనసాగారు. అయితే, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున ఖమ్మం నుంచి పోటీ చేసి, పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో ఓటమి పాలైన నామా నాగేశ్వర రావుకు 2019లో ఖమ్మం ఎంపీ టిక్కెట్ ఇచ్చారు కేసీఆర్. టిక్కెట్ ఇవ్వనప్పటికీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీని అంటిపెట్టుకొనే ఉన్నారు. నాలుగేళ్ళుగా తన ప్రాతినిధ్యం క్రమంగా తగ్గుతూ వస్తున్నా ఆయన పార్టీ మారలేదు. కానీ అంత క్రియాశీలకంగా కూడా లేరు. తాజాగా వచ్చే ఎన్నికల్లో తాను అసెంబ్లీకి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దానికి అనుగుణంగా జిల్లాలో తనతో పాటు తన అనుచరులకు పార్టీ టికెట్లు ఇప్పించుకోవాలని ప్రయత్నం చేశారు. ఇదే ప్రతిపాదనను కేసీఆర్ ముందుంచినట్లుగా సమాచారం. అయితే శ్రీనివాసరెడ్డి ప్రతిపాదనలపై కేసీఆర్ విముఖత వ్యక్తం చేయడంతో పొంగులేటి రాజకీయ వ్యూహం మారినట్లుగా తెలుస్తోంది. జనవరి ఒకటవ తేదీన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచర వర్గంతో భారీ ఎత్తున ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వేలాదిమంది ఆయన అనుచరులు, అభిమానులు ఈ సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్లు ఆయన పార్టీ మారనున్న సంకేతాలను బలపరచాయి. తన ప్రతిపాదనలపై ‘‘తేలుస్తారా లేక నన్నే తీర్చుకోమంటారా..? ’’ అంటూ శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెంట్లు పరోక్షంగా టిఆర్ఎస్ అధిష్టాన వర్గానికి ఒక హెచ్చరికగా మారాయి. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ రెడ్డిని వదులుకునేందుకే గులాబీ బాస్ మొగ్గు చూపుతున్నట్లుగా కథనాలు వచ్చాయి. పొంగులేటి పార్టీ అధిష్టానం ముందు ఉంచిన ప్రతిపాదన ప్రకారం ఖమ్మం లేదా కొత్తగూడెం నుంచి తాను అసెంబ్లీకి పోటీ చేస్తానని, అదే సమయంలో పాయం వెంకటేశ్వర్లుకు పినపాక, మట్టా దయానందుకు సత్తుపల్లి టికెట్లు ఇవ్వాలని.. వైరా లేదా అశ్వరావుపేటలో ఒకటి, ఇల్లెందు సీటు కూడా తన అనుచరులకు ఇవ్వాలని శ్రీనివాస్ రెడ్డి పార్టీ అధిష్టానం ముందు ప్రతిపాదన చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రతిపాదనపై కేసీఆర్ స్పందించకపోవడంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించినట్లు ఆయన అనుచర వర్గం చెబుతోంది. ఇటీవల శ్రీనివాస్ రెడ్డి తన కూతురు వివాహాన్ని ఇండోనేషియాలోని బాలిలో జరిపించారు. ఈ వేడుకకు తెలంగాణలోని పలువురు రాజకీయ నాయకులను ఆయన ఆహ్వానించారు. ఈ వేడుకకు బిజెపి ముఖ్య నేతలు పలువురు హాజరయ్యారని, అక్కడే శ్రీనివాసరెడ్డి రాజకీయ వ్యూహంపై సమాలోచనలు జరిగాయని తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంక్రాంతి తర్వాత బిజెపిలో చేరతారని అందరూ భావిస్తున్నారు. ఇదిలా కొనసాగుతుండగానే తెలంగాణ ప్రభుత్వం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కల్పించిన భద్రతను కుదించింది. ఇప్పటివరకు ఆయనకున్న 3+3 సెక్యూరిటీని, టు ప్లస్ టు కు మార్చింది. అదే సమయంలో ఆయన పర్యటనల సమయంలో వినియోగించే పోలీసు ఎస్కార్టు వాహనాన్ని కూడా తొలగించింది. ఈ చర్యలను పరిశీలిస్తే శ్రీనివాసరెడ్డిని వదులుకొనేందుకే కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని స్పష్టమవుతుంది. తెలంగాణాలో పాగా వేయాలనుకుంటున్న బీజపీకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్దగా క్యాడర్ లేదు. ఇంకా చెప్పాలంటే అసెంబ్లీ బరిలో దిగే స్థాయి నేతలు కూడా అన్ని నియోజకవర్గాల్లో లేరు. పార్టీ అధిష్టానంపై గుర్రుగా వున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరితే, ఆయన వెంట వచ్చే బలమైన నేతలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిక్కెట్లివ్వవచ్చని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. మకర సంక్రాంతి తర్వాత ఈ తంతు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

షర్మిల, తుమ్మల.. పాలేరులో పాగా వేసేదెవరు?

ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల విషయానికి వస్తే చెప్పుకోవాల్సిన మరో ముఖ్య నేత వైఎస్సార్టీపీ వ్యవస్థాపకురాలు వైయస్ షర్మిల. ఆంధ్ర ప్రదేశ్‌లోని కడప జిల్లాలో పుట్టిన షర్మిల.. చెన్నైలో స్థిరపడిన కుటుంబానికి చెందిన బ్రదర్ అనిల్ కుమార్‌ని ద్వితీయ వివాహం చేసుకున్నారు. అనిల్ కుమార్ తండ్రి రమణారావు చెన్నైలో స్థిరపడినప్పటికీ ఆయనకు ఖమ్మం జిల్లా మూలాలున్నాయి. దాంతో షర్మిల ఖమ్మం జిల్లా కోడలిగా తనను తాను చెప్పుకుంటారు. ఈ నేపథ్యంలో వైయస్ షర్మిల కూడా పాలేరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆమె ఇదివరకే ఈ అంశాన్ని రెండుసార్లు ప్రకటించి ఉన్నారు. ఒకవైపు తుమ్మల నాగేశ్వరరావు, ఇంకోవైపు షర్మిల కూడా పాలేరు నియోజకవర్గం మీద ఫోకస్ చేస్తుండడం కూడా ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అన్ని అంశాల నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఉమ్మడి ఖమ్మం జిల్లా అత్యంత కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. అక్కడి ఫలితాలపై అంతా ఉత్కంఠతో చూసే అవకాశం వుంది.

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..