AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP-CONGRESS ALLIANCE: ఆ రాష్ట్రంలో దేశప్రజలను నివ్వెర పరిచే పరిణామం .. ఒకే కూటమిలో బీజేపీ-కాంగ్రెస్.. రాష్ట్ర ప్రభుత్వంలోను భాగస్వాములు

ఓ వైపు అయిదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికలు.. ఇంకోవైపు పార్లమెంటు వేదికగా ఘాటైన విమర్శలు, ప్రతి విమర్శలు.. ఇవన్నీ చూస్తే కాంగ్రెస్, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో..

BJP-CONGRESS ALLIANCE: ఆ రాష్ట్రంలో దేశప్రజలను నివ్వెర పరిచే పరిణామం .. ఒకే కూటమిలో బీజేపీ-కాంగ్రెస్.. రాష్ట్ర ప్రభుత్వంలోను భాగస్వాములు
Bjp Alliance
Rajesh Sharma
| Edited By: Ravi Kiran|

Updated on: Feb 09, 2022 | 5:39 PM

Share

BJP-CONGRESS PARTIES IN ONE STATE GOVERNMENT: ఓ వైపు అయిదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికలు.. ఇంకోవైపు పార్లమెంటు వేదికగా ఘాటైన విమర్శలు, ప్రతి విమర్శలు.. ఇవన్నీ చూస్తే కాంగ్రెస్, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో వైరం కొనసాగుతున్నట్లుగా అందరూ భావిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 7, 8 తేదీలలో లోక్‌సభ, రాజ్యసభల సాక్షిగా కాంగ్రెస్ పార్టీని చెడుగుడు ఆడుతూ చేసిన ప్రసంగాలను ఎవరు మరిచిపోలేరు. అంతకు ముందు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, అధిర్ రంజన్ తదితరులు చేసిన ప్రసంగాలలో బీజేపీని, ఎన్డీయే ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టడాన్ని కూడా ఎవరు సమీప భవిష్యత్తులో మరువలేరు. ఈ క్రమంలో ఈశాన్య భారతంలో చోటుచేసుకున్న ఓ రాజకీయ పరిణామం కేవలం రాజకీయ పరిశీలకులనే కాదు.. కాస్తో కూస్తో రాజకీయ పరిఙ్ఞానం వున్న వారందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. యావత్ దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యర్థి పార్టీలుగానే అందరికీ తెలుసు. కానీ ఓ ఈశాన్య రాష్ట్రంలో మాత్రం విచిత్ర పరిణామం చోటుచేసుకుంది. పరస్పరం విరుద్ద పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఓకే రాజకీయ కూటమిలో చేరడం ఓ విచిత్ర పరిణామంగా చెప్పుకుంటున్నారు. కొన్ని చోట్ల గ్రామ పంచాయితీలు, మండల పరిషత్తులు.. ఇంకా వీలైతే మునిసిపాలిటీలలో కాంగ్రెస్, బీజేపీలే కాకుండా మిగిలిన ప్రధాన పార్టీలు సైతం జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి.. స్థానికంగా పొత్తులు పెట్టుకున్న సంగతులు, పరస్పరం పదవుల కోసం సహకరించుకున్న పరిస్థితులను గతంలో చూశాం. కానీ ఏకంగా రాష్ట్రస్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ జతకట్టడంతోపాటు ఒకే ప్రభుత్వంలో భాగస్తులైన ఉదంతం మేఘాలయాలో చోటుచేసుకుంది.

పరస్పరం పూర్తి వైరం కలిగిన పార్టీలు మేఘాలయాలో ఓకే రాజకీయ కూటమిలో చేరాయి. చేరడమే కాదు.. ఏకంగా రెండు పార్టీలు అధికారాన్ని పంచుకోబోతున్నాయి కూడా. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఫిబ్రవరి 9న అక్కడ అధికారంలో వున్న మేఘాలయ డెమోక్రటిక్‌ అలయన్స్‌కు మద్దతు ప్రకటించారు. మద్దతు ప్రకటించడంతోపాటు ఏకంగా ప్రభుత్వంలో చేరేందుకు ముందుకొచ్చారు. ఈ కూటమికి నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ నాయకత్వం వహిస్తుండగా.. ఆ కూటమిలో భారతీయ జనతా పార్టీ కూడా మిత్రపక్షంగా ఉంది. లేటెస్టుగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా ఆ కూటమిలో చేరడంతో.. కమలం పార్టీతో హస్తం పార్టీ జతకట్టినట్లయ్యింది. 60 మంది సభ్యులున్న మేఘాలయా అసెంబ్లీకి 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ 21 చోట్ల విజయం సాధించింది. ఎన్‌పీపీకి 20 సీట్లు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ కేవలం 2 సీట్లకే పరిమితమైంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ..బీజేపీ, ఇతర చిన్న పార్టీలతో ఎన్‌పీపీ సారథ్యంలో మేఘాలయ డెమోక్రటిక్‌ అలియన్స్‌ ఏర్పాటై.. అధికారాన్ని హస్తగతం చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యేకు మంత్రి పదవికూడా ఇచ్చారు. కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్షంగా మారింది. అయితే తదనంతర కాలంలో కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్‌బై చెబుతూ వచ్చారు.

మరో ఆశ్చర్యకరమైన పరిణామం ఏంటంటే.. గత ఎన్నికల్లో రాష్ట్రంలో అస్సలు పోటీ చేయని తృణమూల్ కాంగ్రెస్ ప్రస్తుతం మేఘాలయాలో ప్రధాన ప్రతిపక్షంగా మారింది. దానికి కారణం కాంగ్రెస్ సీనియర్ నేత 12 మంది ఎమ్మెల్యేలతో కలిసి టీఎంసీలో చేరడమే. 2021 నవంబరులో మాజీ ముఖ్యమంత్రి ముకుల్‌ సంగ్మా సహా 12 మంది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీని వీడి తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. దీంతో మేఘాలయా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ.. రాత్రికి రాత్రే టీఎంసీ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా మారిపోయింది. ఆ పరిణామం తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి కేవలం అయిదుగురు శాసనసభ్యులు మాత్రమే మిగిలారు. ఇక తాజాగా ఫిబ్రవరి 9న మిగిలిన అయిదుగురు ఎమ్మెల్యేలు మేఘాలయ డెమొక్రాటిక్ అలయెన్స్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతు స్పీకర్‌కు లేఖ అందించారు. అయిదుగురు సభ్యులతో కూడిన కాంగ్రెస్ శాసన సభా పక్షం ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాను కలిసి మద్దతు లేఖను ఆయనకు కూడా అందజేశారు. ఎండిఏలో చేరుతున్నట్లు.. ప్రభుత్వంలోను భాగస్వాములు అవుతున్నట్లు వారు వెల్లడించారు. దాంతో ఎండిఏ కూటమి సారథ్యంలోని మేఘాలయా రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి కొనసాగబోతున్నాయి. అయితే, ఈ పరిణామానికి, సీఎల్పీ నిర్ణయానికి కాంగ్రెస్ అధిష్టానం ఆమోదం వుందా లేదా అన్నది తేలాల్సి వుంది.