UP polls: ఉత్తరప్రదేశ్ మొదటి విడత ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా మారిన కులమతాలు
UP Election 2022: యూపీలో రైతులు తమకు ఓటు వేస్తారన్న నమ్మకం కలగడం లేదన్నది బీజేపీ నేతల ఇన్‌సైడ్ టాక్! ప్రచారపర్వంలో బీజేపీ నేతలకు ఎదురైన అనుభవాలు కూడా ఆ పార్టీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీశాయి. చాలా ప్రాంతాలలో ప్రజలు నల్ల జెండాలు చూపించి తమ నిరసనను వ్యక్తం చేశారు.

Uttar Pradesh Election 2022: దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి ఘట్టం రేపు మొదలు కాబోతున్నది. మొదటి విడతలో 58 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాన రాజకీయ పక్షాలైన బీజేపీ(Bjp), సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party)రెండూ విజయంపై కొండంత ధీమాతో ఉన్నాయి. అయినప్పటికీ ఏదో ఒక భయం.. ఫస్ట్ ఫేస్ ఎన్నికల తర్వాత బీజేపీకి తత్వం బోధపడుతుందని ఎస్పీ అధినేత అఖిలేశ్(Akhilesh Yadav) అన్నది నిజమవుతుందా, లేక గతంలో మాదిరిగానే ఈసారి కూడా 58 స్థానాలలో 53 సీట్లను గెల్చుకుంటామంటున్న బీజేపీ మాట చెల్లుబాటు అవుతుందా అన్నది చూడాలి. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఉన్న 11 జిల్లాలు ఫస్ట్ ఫేజ్ ఎన్నికలకు సిద్ధమయ్యాయి. ఇక్కడ జాట్లు ఎవరి పక్షాన నిలుస్తే ఆ పార్టీ విజయం సాధిస్తూ వస్తున్నది. క్రితం సారి బీజేపీకి మద్దతు ఇచ్చారు కాబట్టే ఆ పార్టీకి అత్యధిక సీట్లు లభించాయి. మొత్తం ఉత్తరప్రదేశ్‌లో జనాభా పరంగా వీరి సంఖ్య పెద్దదేమీ కాదు. మహా అయితే రెండు శాతం ఉంటారంటే. కాకపోతే వీరి ప్రభావం చాలా ఎక్కువ. రేపు ఎన్నికలు జరగబోయే 58 స్థానాలలో దాదాపు 30 నియోజకవర్గాలలో 30 శాతం వరకు జాట్లు ఉన్నారు. వీరిలో రైతులే ఎక్కువ. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన వారిలో వీరు కూడా ఉన్నారు. ప్రభుత్వం ఈ చట్టాలను వెనక్కి తీసుకున్నప్పటికీ వీరు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఢిల్లీ సర్కార్‌పై అదే ఆగ్రహం. రైతులలో గూడుకట్టుకున్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు రాష్ట్రీయ లోక్‌దళ్‌తో పొత్తు పెట్టుకుంది సమాజ్‌వాదీ పార్టీ. ఇదొక్కటే బీజేపీని కలవరపరుస్తోంది. పైకి 53 సీట్లు గెల్చుకుంటామని చెబుతున్నదే కానీ, అన్ని స్థానాలు వస్తాయా అన్న అనుమానం ఆ పార్టీ పెద్దల్లో కూడా ఉంది. రైతులు తమకు ఓటు వేస్తారన్న నమ్మకం కలగడం లేదన్నది బీజేపీ నేతల ఇన్‌సైడ్ టాక్! ప్రచారపర్వంలో బీజేపీ నేతలకు ఎదురైన అనుభవాలు కూడా ఆ పార్టీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీశాయి. చాలా ప్రాంతాలలో ప్రజలు నల్ల జెండాలు చూపించి తమ నిరసనను వ్యక్తం చేశారు. అప్పుడే బీజేపీ నేతలకు సీన్ అర్థమైపోయింది..అయినప్పటికీ అన్నదాతలను తమవైపు తిప్పుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. రైతు పక్షపాతి తమ పార్టీ అని చెప్పుకుంటోంది. బహుజన్ సమాజ్ పార్టీ ముస్లిం అభ్యర్థులను ఎక్కువగా బరిలో దింపింది కాబట్టి ఏమైనా ఓట్లు చీలే అవకాశం ఉంటాయేమోనని బీజేపీ అనుకుంటుంది.. ఒకవేళ ఓట్లు చీలితే మాత్రం బీజేపీకి గెలుపు అవకాశాలు ఉంటాయి.
ఎన్నికలు అభివృద్ధి ఎజెండా మీద జరగాలి. అదేం చిత్రమో కానీ అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో మాత్రం కులము, మతము ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతున్నాయి. మానిఫేస్టోలలో ఉచితాల ప్రస్తావన అన్ని పార్టీలు తీసుకొచ్చాయి కానీ బహిరంగ సభలలో, ర్యాలీలలో మాట్లాడేటప్పుడు మాత్రం కులం, మతం ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. కనీస అవసరాలైన మంచినీరు, ఉపాధి, విద్య, వైద్యం వంటివి ఎవరికీ పట్టడం లేదు. ఇప్పుడు మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలలో ముస్లింలు కూడా ఎక్కువగా ఉన్నారు. జాట్లను మచ్చిక చేసుకునే ప్రయత్నం ఫలించకపోవడంతో ఇప్పుడు బీజేపీ ముజఫర్‌నగర్ అల్లర్లను ప్రస్తావించడం మొదలు పెట్టింది. ముస్లింలు, జాట్‌లు సమాజ్‌వాదీ- రాష్ట్రీయ లోక్‌దళ్ కూటమికి మద్దతు ఇస్తే తమకు ఓటమి తప్పదని గ్రహించిన బీజేపీ జాన్-ముస్లింల వర్గాల మధ్య చీలికను తెచ్చే ప్రయత్నం చేస్తోంది.. అందుకే అప్పుడెప్పుడో 2013లో జరిగిన ముజఫర్‌నగర్ అల్లర్లను అర్జెంట్‌గా తెరమీదకు తెచ్చింది. స్వాతంత్ర్య సమరయోధుడు, జాట్ సమాజికవర్గ నాయకుడు రాజా మహేంద్ర ప్రతాప్‌ను బీజేపీ పదే పదే పొడుగుతున్నది కూడా ఇందుకే! ఇక రామమందిర నిర్మాణ ప్రస్తావన పాతపడింది కాబట్టి ఇప్పుడు మధురలో శ్రీ కృష్ణ ఆలయాన్ని కటిస్టామని చెబుతున్నారు బీజేపీ నేతలు. ఈసారి ఎన్నికలు 80శాతం వర్సెస్ 20 శాతం ఎన్నికలుగా ముఖ్యమంత్రి యోగీ అంటున్నారంటే దాని అర్థం జనాభాలో ఉన్న 80 శాతం హిందువులకు, 20 శాతం ముస్లింలకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా ఆయన అభివర్ణించారని అర్థం చేసుకోవాలి. తమ పార్టీ తరఫున బీజేపీ ఒక్క ముస్లింను కూడా నిలబెట్టకపోవడానికి ఇదే కారణం కావచ్చు.