AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైర్మన్‌, మేయర్‌ ఎన్నికలోనూ తనదైన ముద్ర ఉండాలనే భావనా..? నెలాఖరుకి రిటైరవుతున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ సెలవు రద్దు వెనుక రీజనేంటి?

SEC Nimmagadda ramesh kumar : ఆయనో ఉన్నతాధికారి. రాజ్యాంగబద్ధమైన పదవిలో కీలక బాధ్యతలు చూస్తున్న అధికారి. ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణతో ఆయన బాధ్యత ముగుస్తుంది...

చైర్మన్‌, మేయర్‌ ఎన్నికలోనూ తనదైన ముద్ర ఉండాలనే భావనా..?  నెలాఖరుకి రిటైరవుతున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ సెలవు రద్దు వెనుక రీజనేంటి?
SEC Nimmagadda Ramesh Kumar
Venkata Narayana
|

Updated on: Mar 12, 2021 | 6:23 PM

Share

SEC Nimmagadda ramesh kumar : ఆయనో ఉన్నతాధికారి. రాజ్యాంగబద్ధమైన పదవిలో కీలక బాధ్యతలు చూస్తున్న అధికారి. ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణతో ఆయన బాధ్యత ముగుస్తుంది. కానీ ఆ ఆఫీసర్‌ మాత్రం సమ్‌థింగ్‌ స్పెషల్‌. దేశంలో ఎక్కడా..ఏ రాష్ట్రంలో లేని విధంగా రాజకీయపక్షాల నోళ్లలో నలిగారు. ఆరోపణల వర్షంలో తడిసి ముద్దయ్యారు. ఆయనే.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌. ఏపీ ఎన్నికల కమిషనర్‌. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పటినుంచీ ఎలక్షన్‌ రిజల్ట్‌ దాకా..ఆయన చుట్టే రాజకీయం చక్కర్లు కొట్టింది. పంచాయతీ ఎలక్షన్స్‌ ముందు అధికారపక్షానికి టార్గెట్‌ అయ్యారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ. మున్సిపోల్స్‌ ముంగిట్లో విపక్షం ఆయనపై కన్నెర్ర చేస్తోంది. మరి ఆయన ఎవరివైపు? రాజ్యాంగంమీద ఒట్టనలేదుగానీ…నేను ఆ గట్టు లేదు ఈ గట్టు కాదు..నా డ్యూటీ నేను చేసుకుపోతున్నానంటారు నిమ్మగడ్డ.

పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైన సమయంలో ప్రభుత్వంతో ఎన్నికల కమిషనర్‌కి ఓ రేంజ్‌ యుద్ధమే జరిగింది. ప్రభుత్వం వద్దంటున్నా టీడీపీకి ఫేవర్‌ చేసేందుకే ఎస్‌ఈసీ ఎన్నికలకు తొందరపెడుతున్నారని వైసీపీ ఆరోపించింది. కొందరు వైసీపీ నేతలు, మంత్రులు మాటలతో విరుచుకుపడ్డారు. అటు నిమ్మగడ్డ కూడా కోర్టుకెళ్లారు. గవర్నర్‌ని కలిశారు. కొందరు లీడర్ల నోళ్లకు తాళాలేశారు. పంచాయతీ ఎలక్షన్‌ ఫైనల్‌ స్టేజ్‌కొచ్చేసరికి సీన్‌ మారిపోయింది. మున్సిపోల్స్‌ ఎన్నికలకు ప్రభుత్వమే సై అంది. ఎన్నికలసంఘానికి ప్రభుత్వం ఫుల్‌ కోఆపరేషన్‌ ఇస్తే…విమర్శల బాణం టీడీపీ చేతుల్లోకెళ్లింది. ఆయన పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని విపక్షపార్టీ ఆరోపించేదాకా వెళ్లింది.

ఎవరేమన్నా అనుకోండి…నా దారి రహదారి అంటూ తన డ్యూటీ చేసుకుపోయారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ. మున్సిపోల్స్‌కి అన్ని రెడీ చేశారు. తను చెప్పాల్సింది చెప్పేశారు. నాన్‌స్టాప్‌గా రెండుమూడునెలలనుంచి విపరీతమైన పని ఒత్తిడి. దీనికితోడు రాజకీయ వేడి. అన్నీ తట్టుకుని నిలబడ్డ నిమ్మగడ్డ…ఓ వారం రిలాక్స్‌ అవ్వాలనుకున్నారు. 17నుంచి 24దాకా లీవ్‌మీద వెళ్లాలనుకున్నారు. 19నుంచి 22మధ్యలో మదురై, రామేశ్వరం వెళ్లాలనేది ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ప్లాన్‌. అయితే సడెన్‌గా లీవ్‌ క్యాన్సిల్‌ చేసుకున్నారు ఎన్నికల కమిషనర్‌. మామూలుగా అయితే ఓ ఆఫీసర్‌ల లీవ్‌గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోరుగానీ…పెట్టిందీ వద్దనుకుందీ నిమ్మగడ్డ కావటంతో ఈ ఇష్యూ మీద కూడా గుసగుసలు మొదలయ్యాయట.

18న మేయర్‌, చైర్మన్‌ ఎన్నికలు జరుగుతాయి. కీలకమైన ఆ ప్రక్రియకు అందుబాటులో ఉండేందుకే ఎస్‌ఈసీ లీవ్‌ క్యాన్సిల్‌ చేసుకున్నారని టాక్‌. ఇప్పటికే ఏకగ్రీవాలు, ప్రలోభాలపై విపక్షపార్టీలు ఆరోపణలుచేస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసినా కీలకమైన మున్సిపల్‌ ఛైర్మన్లు, మేయర్ల ఎన్నికల సమయంలో అందుబాటులో లేకపోతే కొత్త ఆరోపణలకు అవకాశమిచ్చినట్లవుతుందని నిమ్మగడ్డ భావించారట. అందుకే ఆ కార్యక్రమం కూడా తన ప్రత్యక్ష పర్యవేక్షణలోనే పూర్తిచేయాలనుకుని…పెట్టిన లీవ్‌ క్యాన్సిల్‌ చేసుకుని ఉండొచ్చంటున్నారు. మార్చి 31తో నిమ్మగడ్డ పదవీకాలం ముగుస్తుంది. తన హయాంలో లోకల్‌బాడీస్‌ ఎన్నికలు పూర్తిచేయాలనుకున్న పంతాన్ని ఆయన నెరవేర్చుకున్నారు. రిటైర్మెంట్‌దాకా ఆన్‌డ్యూటీలో ఉండాలనుకున్నారా? లేదంటే మేయర్‌, చైర్మన్‌ ఎన్నికల సమయంలో ప్రలోభాలు, బేరసారాలకు ఛాన్స్‌ లేకుండా చివరి అంకంలోనూ విశ్వరూపం చూపాలనుకుంటున్నారా అన్న డిస్కషన్‌ జరుగుతోంది. మొత్తానికి అసలు రీజన్‌ నిమ్మగడ్డకే తెలుసుగానీ…ఎస్‌ఈసీ ఎపిసోడ్‌ ఇప్పటికింకా సశేషం.

Read also : Telugu States MLC elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో జోరుగా డబ్బు పంపిణీ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి