AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Woman Sacrifise: ఆమె త్యాగానికి చలించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్.. ఏకంగా ఇంటికెళ్ళి ఆమె చేత్తో..!

ఆయన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌... బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ అకాడమీలోని ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అది పూర్తయ్యాక పెద్ద ఎత్తున విందు ఏర్పాట్లు చేశారు. ఆయన మాత్రం అక్కడ భోజనం చేయడానికి ఇష్టపడలేదు. ఓ ఇల్లాలిని కలిసి మాట్లాడాలనుకున్నారు. ఇంతకీ ఎవరామె.. ఏమిటామె ప్రత్యేకత?

Woman Sacrifise: ఆమె త్యాగానికి చలించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్.. ఏకంగా ఇంటికెళ్ళి ఆమె చేత్తో..!
Rajnath
Rajesh Sharma
|

Updated on: Apr 10, 2021 | 7:34 PM

Share

Woman Sacrifice touched Defense Minister Rajnath Singh: ఆయన కేంద్ర రక్షణ మంత్రి (DEFENSE MINISTER) రాజ్‌నాథ్‌ సింగ్ (RAJNATH SINGH)‌… గతవారం మధ్యప్రదేశ్‌ (MADHYA PRADESH)లోని గ్వాలియర్ (GWALIAR)‌ తాలూకు టేకన్‌పూర్‌లోని బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్ (BORDER SECURITY FORCE)‌ అకాడమీలోని ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అది పూర్తయ్యాక అక్కడ పెద్ద ఎత్తున విందు, రకరకాల ఏర్పాట్లు చేశారు. ఆయన మాత్రం అక్కడ భోజనం చేయడానికి ఇష్టపడలేదు. ఓ ఇల్లాలిని కలిసి మాట్లాడాలనుకున్నారు. ఆమె చేతి వంట రుచి చూడాలని ఆశపడ్డారు. ఇంతకీ ఎవరామె.. ఏమిటామె ప్రత్యేకత? తెలుసుకోవాలంటే చదవాల్సిందే!

ఇంద్రాక్షీ త్రిపాఠి (INDRAKSHI TRIPATI)… ఆమెకు అలా పరిచయం చేసుకోవడం ఇష్టముండదు. అసిస్టెంట్‌ కమాండెంట్ (ASSISTANT COMMANDENT)‌ సందీప్‌ మిశ్రా (SANDEEP MISHRA) భార్య అని చెప్పుకోవడానికి గర్వపడుతుంది. కారణం సందీప్‌ మిశ్రా దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన వీరుడు. భారత సరిహద్దు భద్రతా విధుల్లో హోరాహోరీ పోరాడి చూపు కోల్పోయారు. అయితేనేం దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తికి సేవ చేస్తే మాతృదేశానికి సేవ చేసినట్టు అనుకుంది ఇంద్రాక్షి. పెద్దలు కాదన్నా.. బలవంతంగా ఒప్పించి అతని జీవితంలోకి వచ్చింది. ఆమె కళ్లతో భర్తకు లోకాన్ని చూపిస్తూ… ఆనందంగా వైవాహిక జీవితంలో సాగిపోతోంది. ఒక పాపకు తల్లిగా, సందీప్‌ సంరక్షకురాలిగా నిత్యం కాచుకునే ఇంద్రాక్షి గొప్ప మనసు గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ సెల్యూట్‌ కొట్టకుండా ఉండరు. అందుకే కేంద్ర రక్షణ శాఖా మంత్రి కూడా టేకన్‌పూర్‌లో పని చేస్తున్న సందీప్‌ మిశ్రా అర్థాంగి గురించి తెలుసుకున్నాక వెంటనే ఆమెకు అభినందనలు చెప్పాలనుకున్నారు. వారింటికి వెళ్లి కోరి ఆతిథ్యం అందుకున్నారు.

ఉత్తర్‌ప్రదేశ్ (UTTAR PRADESH)‌లోని సిద్ధార్థ్‌ నగర్‌ జిల్లా (SIDDARTH NAGAR DISTRICT)లో ఉన్న బన్సీ (BANSI) అనే చిన్న పట్టణంలో పుట్టి పెరిగింది ఇంద్రాక్షి. తండ్రి ఆ ప్రాంతంలో బాగా పేరున్న న్యాయవాది. వారిది సంపన్న కుటుంబం. పైగా తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు. బీఏ తరవాత పీజీ పూర్తి చేసింది. తైక్వాండో కరాటే ఛాంపియన్‌ కూడా. ఉపాధ్యాయ వృత్తి మీదున్న గౌరవంతో బన్సీలోనే ఓ ప్రయివేటు పాఠశాలలో 2001లో హిందీ టీచర్‌గా చేరింది. ఈ క్రమంలోనే ఇంద్రాక్షికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు ఆమె తల్లిదండ్రులు. రకరకాల వివాహ పరిచయ వేదికల ద్వారా తల్లిదండ్రులు తగిన వరుడి కోసం వెతకడం మొదలుపెట్టారు. అప్పటి వరకూ ఇంద్రాక్షికి పెళ్లి గురించి ఆలోచనలు లేవు.

అయితే 2004లో వివాహ ఓ పరిచయ వేదిక ద్వారా సందీప్‌ మిశ్రా సంబంధం గురించి తెలిసింది. అతని గురించి చదివి ఆశ్చర్యపోయింది. వెంటనే సందీప్‌కి ఫోన్‌ చేసి వివరాలు అడిగింది ఇంద్రాక్షి. మధ్యప్రదేశ్‌కి చెందిన సందీప్‌ మిశ్రా 1999లో బీఎస్‌ఎఫ్‌ (BSF)లో చేరారు. మొదటి పోస్టింగ్‌ బిహార్ (BIHAR)‌, ఆ తరువాత వివిధ చోట్ల పనిచేసి 2000 సంవత్సరంలో అసిస్టెంట్‌ కమాండెంట్‌గా అసోం (ASSOM)లోని టిన్సుకియా జిల్లాకు బదిలీ అయ్యారు. అక్కడ ఉన్నప్పుడు తీవ్రవాదుల దాడి జరిగింది. అందులోనే హోరాహోరీ పోరాడిన సందీప్‌ శరీరంలో ఐదు బులెట్లు దిగాయి. ఎడమ కంట్లోకి ఒక బులెట్‌ దూసుకుపోవడంతో పూర్తిగా చూపు కోల్పోయారు. ముక్కు ఎముక విరిగింది. మిగతా శరీర భాగాలకూ తీవ్ర గాయాలయ్యాయి. పలు శస్త్ర చికిత్సలు చేసిన ఆరు నెలల తరవాత ఆసుపత్రి నుంచి బయటకు రాలేదాయన. అతనిది సాధారణ మధ్యతరగతి కుటుంబం. తల్లిదండ్రులు సందీప్‌ పెళ్లి, భవిష్యత్తు గురించి చాలా ఆందోళన చెందేవారు. తామున్నంత కాలం కొడుకుని చూసుకుంటారు. ఆ తరువాత అతని బాధ్యతలు ఎవరు చూస్తారంటూ తల్లి చాలా బాధపడేది. అందుకే పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. మరోవైపు సందీప్‌ కూడా బాధపడుతూ ఇంట్లోనే కూర్చోదల్చుకోలేదు. తనకి జీవితాన్నీ, మంచి పేరునీ తీసుకొచ్చిన బీఎస్‌ఎఫ్‌లోనే ఏదో ఒకవిభాగంలో పని చేయాలనుకున్నారు. అందుకే తల్లిదండ్రులు వద్దన్నా… ఢిల్లీ వెళ్లి చూపులేని వారికి ఉపయోగపడే కంప్యూటర్‌ కోర్సు నేర్చుకున్నారు.

ఏడాదిన్నర విరామం అనంతరం సందీప్‌కు టేకన్‌పూర్‌ బీఎస్‌ఎఫ్‌ అకాడమీ (BSF ACADEMY)లోని కంప్యూటర్‌ సెంటర్‌లో పనిచేసే అవకాశం వచ్చింది. అంతేనా అతని సేవలకు భారత ప్రభుత్వం శౌర్య పురస్కారాన్నిచ్చి మరీ గౌరవించింది. ఇదంతా తెలుసుకున్నాక ఇంద్రాక్షి అతడినే పెళ్లాడాలనుకుంది. అతని అమ్మానాన్నల బాధ్యత తాను తీసుకోవాలనుకుంది. చివరకు తల్లిదండ్రులకు అదే విషయం చెప్పింది. కానీ వారు వద్దంటే వద్దన్నారు. ‘చూపులేని వ్యక్తి నిన్నేం చూసుకుంటాడు’ అని అడిగారు. దానికి ఇంద్రాక్షి ‘దేశాన్ని ప్రేమించే వ్యక్తి కన్న తల్లినీ, కట్టుకున్న భార్యనీ అంత కంటే గొప్పగా ప్రేమిస్తాడు. దేశ రక్షణలో భాగంగా చూపు కోల్పోయిన అతనికి నేను చూపుగా మారతాను. నేనే సేవ చేస్తాను’ అంటూ సమాధానమిచ్చింది. అంతేకాదు అతన్ని తప్ప ఇంకెవర్నీ పెళ్లిచేసుకోను అని తెగేసి చెప్పింది. దాంతో కొన్నాళ్లకి తల్లిదండ్రులు మనసు మార్చుకున్నారు. ఇంద్రాక్షి మనసును అర్థం చేసుకున్నారు. సందీప్‌ మిశ్రాను సంప్రదించి .. అతని పెద్దవాళ్లతో మాట్లాడి 2004లో ఘనంగా వారి పెళ్లి చేశారు.

ఇదంతా తెలిసిన బీఎస్‌ఎఫ్‌ టేకన్‌పూర్‌ అధికారులు ఇంద్రాక్షికి అక్కడే ఉన్న సెకండరీ స్కూల్‌లో హిందీ పండిట్‌గా ఉద్యోగమిచ్చారు. పదమూడేళ్ల నుంచీ ఈ జంట ఆ అకాడమీలోనే ఎవరి విభాగాల్లో వాళ్లు పనిచేస్తున్నారు. వీరికో పాప. సందీప్‌ మిశ్రాను, కుటుంబాన్ని చూసుకుంటూ ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో పాపను పెంచి పెద్ద చేస్తోంది ఆమె. తండ్రి గొప్పదనం వివరిస్తూ అతడినే రోల్‌మోడల్‌గా చూపిస్తూ ఉన్నతంగా తీర్చిదిద్దుతోంది. మరోవైపు వయసు మీద పడిన అతని తల్లిదండ్రులకు తానే కొడుకై సేవలు చేస్తోంది. ఎన్ని సమస్యలు వచ్చినా కుటుంబాన్ని కాచుకుంటూ… భర్త చేయి వదలకుండా ముందుకెళుతున్న ఇంద్రాక్షి గురించి విన్నారు రాజ్‌నాథ్‌ సింగ్‌. దాంతో వెంటనే వారింటికి వెళ్లి అడిగి మరీ ఆతిథ్యం అందుకున్నారు. భోజనం చేసి.. కుటుంబ సభ్యులందరి యోగ క్షేమాలు తెలుసుకుని వారితో కాసేపు సరదాగా గడిపారు. వైకల్యం ఉందని తెలిసి కోరి సందీప్‌ మిశ్రా జీవితంలోకి వచ్చినందుకు ఇంద్రాక్షిని అభినందించారు. ఆ జంట పదికాలాల పాటు చల్లగా ఉండాలని దీవించి మరీ వెళ్లారు.

ALSO READ: హిమానీ నదాలపై బ్రిటన్ శాస్త్రవేత్తల తాజా హెచ్చరిక.. అదే జరిగితే మానవాళికి ముప్పే!

ALSO READ: ఆ విషాద ఘటనకు త్వరలో 109 ఏళ్ళు.. ఆ ఓడతో గుంటూరు జిల్లాకు లింకు? ఏంటో అది?

ALSO READ: తెలుగు రాష్ట్రాలకు మళ్ళీ మావోయిస్టు టెన్షన్.. తెలంగాణలో పోలీసులు అలర్ట్.. ఏజెన్సీలోను అంతే