ఇక జీవితంలో IndiGo విమానంలో ప్రయాణించను.. కేరళ రాజకీయ నేత శపథం.. ఎందుకంటే..?
Kerala News: ఇక భవిష్యత్తులో ఎప్పుడూ తాను, తన కుటుంబీకులు ఎవరూ ఇండిగో (IndiGo) విమానంలో ప్రయాణించబోమని కేరళలో అధికార ఎల్డీఎఫ్ కూటమి నేత శపథం చేశారు.
Kerala News: ప్రైవేటు విమానయాన సంస్థ ఇండిగో(IndiGo) తనపై మూడు వారాల బ్యాన్ విధించడంపై కేరళలోని అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రండ్ (LDF) కన్వీనర్ ఈపీ జయరాజన్ (E P Jayarajan) సీరియస్ అయ్యారు. ఇక భవిష్యత్తులో ఎప్పుడూ తాను, తన కుటుంబీకులు ఇండిగో విమానం ఎక్కబోమంటూ ఆయన శపథం చేశారు. అవసరమైతే నడుస్తూ గమ్య స్థానానికి చేరుకుంటానని పేర్కొన్నారు. ఇటీవల ఇండిగో విమానంలో ప్రయాణించిన జయరాజన్ సహ ప్రయాణీకుల పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు ఆయనపై ఇండిగో సంస్థ మూడు వారాల బ్యాన్ విధించింది.
జూన్ 13న సీఎం పినరయి విజయన్ కున్నూర్ నుంచి తిరువనంతపురంకు ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో జయరాజన్ కూడా ఉన్నారు. తిరువనంతపురం విమానాశ్రయంలో విమానం ల్యాండింగ్ కాగా.. ఇద్దరు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం పినరయి విజయన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గోల్డ్ స్కామ్‌లో సీఎం పినరయి విజయన్ ప్రమేయముందన్న ఆరోపణల నేపథ్యంలో సీఎంగా వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ఆ విమానంలోనే ప్రయాణిస్తున్న జయరాజన్.. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను బలంగా నెట్టేశారు. జయరాజన్ వ్యవరించిన తీరు సరిగ్గా లేనందున ఆయన తమ విమానాల్లో ప్రయాణించకుండా ఇండిగో మూడు వారాలు బ్యాన్ విధించింది. జయరాజన్‌తో పాటు సీఎంకు వ్యతిరేకంగా విమానంలో నినాదాలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలపై కూడా ఆ సంస్థ రెండు వారాల నిషేధం విధించింది.
ఇండిగో బ్యాన్‌పై స్పందించిన జయరాజన్.. తాను, తన కుటుంబీకులు ఎవరూ ఇకపై ఎప్పుడూ ఇండిగో విమానంలో ప్రయాణించబోమన్నారు. అవసరమైతే నడిచే వెళ్తాను తప్ప.. ఇండిగో విమానంలో ప్రయాణించబోనని వ్యాఖ్యానించారు. దేశీయ, అంతర్జాతీయ ఇండిగో విమానాల్లో ప్రయాణించబోనని.. అవసరమైతే ఇంకా మెరుగైన సేవలు అందించే విమాన సంస్థలు చాలా ఉన్నాయని పేర్కొన్నారు.
అంతకు ముందు మీడియాతో మాట్లాడిన జయరాజన్.. ఇండిగో సంస్థ తనపై తాత్కాలిక బ్యాన్ విధించినట్లు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. మీడియాలో వచ్చిన కథనాలను చూసి ఆరా తీయగా.. మూడు వారాల తాత్కాలిక బ్యాన్ విధించినట్లు ఇండిగో అధికారులు తెలియజేసినట్లు తెలిపారు. తనపై బ్యాన్ విధించినట్లు అధికారికంగా ఇప్పటి వరకు తనకు ఇండిగో నుంచి ఎలాంటి సమాచారం రాలేదని చెప్పారు.
ఇండిగో విమానంలో జరిగిన ఘటనకు సంబంధించిన ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు, మరో వ్యక్తిపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎంపై హత్యా యత్నానికి పాల్పడ్డారంటూ పోలీసులు 120బీ, 307, 332 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే రాజకీయ దురుద్దేశంతో తమపై కేసు నమోదుచేశారని నిందితులు తమపై ఆరోపణలను తోసిపుచ్చారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి