గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్… ఇప్పుడిదే దేశంలో హాట్‌టాపిక్
దేశంలో కొన్ని రాష్ట్రాల్లో.. ప్రభుత్వాధినేతలూ వర్సెస్ రాజ్యాంగాధినేతల మధ్య ఘర్షణ వాతావరణం.. రోజురోజుకు చర్చనీయాంశం అవుతోంది. రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ మధ్య దూరం మరింత పెరుగుతోంది. కేంద్ర, రాష్ట్రాల్లో విభిన్న ప్రభుత్వాలున్నప్పుడు.. ఈ ఘర్షణ అనివార్యమౌతోంది. అధికారాల విషయంలో.. ఎప్పుడూ ఏదో ఒక అలజడి జరుగుతునే ఉంది. తరుచూ ఏవో ఒక ప్రకంపనలు చెలరేగుతునే ఉన్నాయి. కేరళ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ... ఇలా ఒక్కో రాష్ట్రంలో గవర్నర్ వ్యవస్థ వివాదం అవడంతో.. దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.

తెలంగాణలో రాజ్‌భవన్ వర్సెస్ ప్రగతిభవన్ మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో గవర్నమెట్ సిఫార్సులను రిజెక్ట్ చేసిన గవర్నర్ తమిళిసై.. ప్రభుత్వంతో రాజీపడే ప్రసక్తే లేదన్న సంకేతాలు పంపారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కేబినెట్ సిఫార్సు చేసిన కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ అభ్యర్థిత్వాలను తమిళిసై తిరస్కరించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా రాజకీయ నేతలను కేబినెట్ సిఫార్సు చేయొద్దని తమిళిసై సూచించారు. ఆర్టికల్ 171(5) ప్రకారం కేబినెట్ అభ్యర్థులను ఎంపిక చేయలేదని గవర్నర్ తమిళిసై లేఖలో తెలిపారు. రాష్ట్రంలో చాలా మంది వివిధ రంగాల్లో ప్రముఖలు ఉన్నారని.. వారిని కూడా పరిగణలోకి తీసుకోలేదన్నారు. తమిళిసై తెలంగాణ గవర్నర్‌గా వచ్చిన కొత్తలోనే.. ప్రభుత్వంతో కాస్త సఖ్యతతో ఉన్నా.. తర్వాత ప్రభుత్వంతో దూరం పెరుగుతూ వచ్చింది. పాడి కౌశిక్‌రెడ్డి నియామకంపై మొదలైన గొడవ.. చిలికిచిలికి గాలివానలా మారి గ్యాప్ పెంచింది. ఆతర్వాత.. రాష్ట్ర ప్రభుత్వం బిల్లులపై కొర్రీలు వేయడం.. గవర్నర్ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి, మంత్రులు దూరంగా ఉండటం ప్రభుత్వ విధానంగా మారింది. తనకు ప్రొటోకాల్ ఇవ్వడం లేదని గవర్నర్ ఆగ్రహం చెందడమే కాకుండా.. సచివాలయం, అంబేద్కర్ విగ్రహాం ఆవిష్కరణ వంటి ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానం పంపడంలేదని రాష్ట్ర ప్రభుత్వంపై.. బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు గవర్నర్.
అటు… కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి గవర్నర్‌కు మధ్య వివాదం కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నా.. ఆ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్. గవర్నర్ ఆమోదం లేనిదే ఏ బిల్లు చట్టం కాదు.. దీంతోనే.. కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్ ఆమోదం పొందక ఎన్నో బిల్లులు.. పెండింగ్‌లో పడుతున్నాయి. ఈ బిల్లుల విషయంలోనే.. గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ కొనసాగుతోంది. కేరళ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన 8 బిల్లులపై… గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్.. సంతకం చేయలేదని.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్ర శాసనసభ ఆమోదించిన 8 బిల్లులు గవర్నర్‌కు ఆమోదం కోసం పంపారు. చాలా కాలం గడిచినా ఈ బిల్లులు చట్టంగా మారలేదంటున్నారు సీఎం. గవర్నర్ వ్యవహార శైలిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించే యోచనలో ఉంది. గతంలో… యూనివర్సిటీ వీసీల రాజీనామా విషయంలోనూ.. కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి గవర్నర్‌కు మధ్య తీవ్ర వివాదమే కొనసాగింది.
మరోవైపు.. పశ్చిమ బెంగాల్‌లోనూ.. గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ ఇష్యూ కంటిన్యూ అవుతునే ఉంది. గవర్నర్ ఆనంద్ బోస్-సీఎం మమతా బెనర్జీ మధ్య వివాదం కొనసాగుతునే ఉంది. ఇప్పుడున్న ఆనంద్ బోస్ కంటే ముందు, గవర్నర్‌గా పనిచేసిన జగదీప్ దంకర్, కేశరీనాథ్‌తోనూ.. దీదీకి బేదాభిప్రాయాలు వచ్చాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. గవర్నర్ సీవీ ఆనంద బోస్ మధ్య పలు విషయాల్లో మాటల యుద్ధం కొనసాగుతునేఉంది. ఇరు వైపుల నుంచి విమర్శలు, ప్రతివిమర్శలు వస్తూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న…. అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లులను ఆమోదించడం లేదని బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాల హక్కులను హరిస్తూ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తే రాజ్ భవన్ ముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై గవర్నర్ సీవీ ఆనంద బోస్ కౌంటర్ వ్యాఖ్యలు చేశారు. రాజ్ భవన్ బయట ఎందుకు నిలబడతారని.. వారు కోరుకుంటే రాజ్ భవన్ లోపలికే వచ్చి నిరసన చేసుకోవడానికి ఇన్విటేషన్ ఇస్తానంటూ గవర్నర్ రివర్స్ అయ్యారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అతిపెద్ద పండుగ సీజన్‌కు సిద్ధమవుతున్న తరుణంలో.. కొత్తగా దుర్గాదేవి పూజా వేడుకపై వివాదం చెలరేగింది. రాజ్‌భవన్ సొంతంగా.. దుర్గా భారత్ సమ్మాన్‌ను ప్రకటించింది. అవార్డుల కోసం నామినేషన్లను ఆహ్వానించింది. ఇప్పుడిదే.. మరో వివాదమైంది. అలానే.. యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్ నియామకం, ధూపగురి నుంచి గెలిచిన తృణమూల్ అభ్యర్థి ప్రమాణ స్వీకారోత్సవం వరకూ.. ఇలా ఎన్నో విషయాల్లో.. ఇరువర్గాల అధికారాలపై.. గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ వివాదం కొనసాగుతోంది.
ఇక తమిళనాడులోనూ.. సీఎం స్టాలిన్- గవర్నర్ ఆర్‌ఎన్ రవి మధ్య పోరు కొనసాగుతునే ఉంది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోద ముద్ర వేసేందుకు.. గవర్నర్ అనవసరమైన జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సీఎం స్టాలిన్.. గవర్నర్ చర్యలను నిరసిస్తూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వరుసగా లేఖలు రాస్తునే ఉన్నారు స్టాలిన్. మొన్నటికి మొన్న తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ నియామకంపై స్టాలిన్ ప్రభుత్వం పంపిన ఫైల్‌ను గవర్నర్ వెనక్కిపంపారు. అంతేగాక తమిళనాడు కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన మోడల్ సిలబస్‌ను యూనివర్సిటీలు పాటించాల్సిన అవసరం లేదని గవర్నర్ ఉత్తర్వులు జారీచేశారు. ఇలా ఏదో ఒక పేచీ గవర్నర్- గవర్నమెంట్ మధ్య కొనసాగుతునే ఉంది.
గవర్నర్ వ్యవస్థ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు తమ వారిని గవర్నర్‌లుగా నియమించడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్న భావన ఉంది.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి