Lok Sabha Elections: ముస్లింల ఓట్లపై ఆ నేతలు కన్ను.. సీట్లు గెలుస్తారా..? లేక ఓట్లు చీల్చి బీజేపీకి ప్లస్ అవుతారా..

రాజకీయాల్లో అందరూ ఆదర్శాలు మాట్లాడతారు. కులమతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూడాలని నీతులు చెబుతుంటారు. కానీ తీరా ఎన్నికలు వచ్చేసరికి.. అందరూ ఆ తాను ముక్కలే అన్నట్టుగా కులాలు, మతాల ఆధారంగానే సమాజాన్ని చీల్చి ఓట్లు దండుకోవాలని చూస్తుంటారు. ఇప్పుడు దేశమంతటా సార్వత్రిక ఎన్నికల వేడి రగులుకుంది. ఇప్పటికే మొదటి దశ పోలింగ్ పూర్తిచేసుకుని, 2వ దశ పోలింగ్ వైపు వడివడిగా దేశం అడుగులు వేస్తోంది. సంపూర్ణ మెజారిటీతో వరుసగా పదేళ్లపాటు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఉవ్వూళ్లూరుతుంటే..

Lok Sabha Elections: ముస్లింల ఓట్లపై ఆ నేతలు కన్ను.. సీట్లు గెలుస్తారా..? లేక ఓట్లు చీల్చి బీజేపీకి ప్లస్ అవుతారా..
Muslim Leaders
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Shaik Madar Saheb

Updated on: Apr 23, 2024 | 6:10 PM

రాజకీయాల్లో అందరూ ఆదర్శాలు మాట్లాడతారు. కులమతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూడాలని నీతులు చెబుతుంటారు. కానీ తీరా ఎన్నికలు వచ్చేసరికి.. అందరూ ఆ తాను ముక్కలే అన్నట్టుగా కులాలు, మతాల ఆధారంగానే సమాజాన్ని చీల్చి ఓట్లు దండుకోవాలని చూస్తుంటారు. ఇప్పుడు దేశమంతటా సార్వత్రిక ఎన్నికల వేడి రగులుకుంది. ఇప్పటికే మొదటి దశ పోలింగ్ పూర్తిచేసుకుని, 2వ దశ పోలింగ్ వైపు వడివడిగా దేశం అడుగులు వేస్తోంది. సంపూర్ణ మెజారిటీతో వరుసగా పదేళ్లపాటు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఉవ్వూళ్లూరుతుంటే.. కమలదళం ఆధిపత్యానికి చెక్ పెట్టి అధికారం సాధించాలని విపక్ష కూటమి కలలు కంటోంది. మొత్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు విన్యాసాలు చేస్తున్న సమయంలో ఎన్నికల్లో ప్రభావవంతమైన సమూహంగా ఉన్న ముస్లింలు ఎటువైపు అన్నదే చర్చనీయాంశంగా మారింది. ముస్లిం సమాజంలో దేశవ్యాప్త గుర్తింపు పొందిన కొందరు నేతలు.. యావత్ ముస్లిం సమాజానికి తామే ప్రతినిధులం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అలాంటివారిలో ‘ఆలిండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్’ (AIMIM) అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ఆలిండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) అధ్యక్షుడు బద్రుద్దీన్ అజ్మల్, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ISF) అబ్బాస్ సిద్ధిఖీతో పాటు మరికొందరు నేతలున్నారు. అజ్మల్ అస్సాంకు, సిద్ధిఖీ పశ్చిమ బెంగాల్‌కు పరిమితమవగా… అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ కేంద్రంగా దేశవ్యాప్తంగా రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నారు. యావత్ ముస్లిం సమాజానికి అసలు సిసలు ప్రతినిధిగా తనను తాను తీర్చిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నారు. ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకించే భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు ఈ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించేనా.. లేక బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చి పరోక్షంగా సహకరించేనా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అస్సాంలో అజ్మల్ మేజిక్ పునరావృతమయ్యేనా?

బద్రుద్దీన్ అజ్మల్ అస్సాం రాజకీయాల్లో ప్రముఖ ముస్లిం నేత. ముస్లిం ఓట్లతో కింగ్ కాలేకపోయినా ‘కింగ్‌మేకర్’గా ఎదగాలన్నది ఆయన అభిలాష, చిరకాల వాంఛ. ఈసారి రాష్ట్రంలోని 14 లోక్‌సభ స్థానాల్లో 3 స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. అస్సాం జనాభాలో దాదాపు 34 శాతం మంది ముస్లింలు ఉన్నారు. ఈ ముస్లిం ఓట్ల సాయంతో బద్రుద్దీన్ అజ్మల్ 2009 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. 2014లో అజ్మల్ స్వయంగా మూడు సీట్లు గెలుచుకోగా, 2019లో ఆ సంఖ్య ఒక్క సీటుకు తగ్గింది. ఈసారి AIUDF తన అభ్యర్థులను మూడు లోక్‌సభ స్థానాల్లో నిలబెట్టింది. ఇందులో బద్రుద్దీన్ అజ్మల్ నాలుగో సారి ధుబ్రి స్థానం నుండి పోటీ చేస్తున్నారు. ఆయన పార్టీ తరఫున మరో రెండు లోక్‌సభ స్థానాలు నాగాఁవ్, కరీంగంజ్ నుంచి అభ్యర్థులను బరిలోకి దించింది. కరీంగంజ్ నుంచి సహబుల్ ఇస్లాం చౌదరి పోటీ చేస్తుండగా.. నాగాఁవ్ నుంచి అమీనుల్ ఇస్లాం బరిలో ఉన్నారు. ధుబ్రి, నాగాఁవ్, కరీంగంజ్ స్థానాల్లో పెద్ద సంఖ్యలో ముస్లిం ఓటర్లు ఉన్నారు. వాటిలో పార్టీ అధినేత బద్రుద్దీన్ అజ్మల్‌కు ధుబ్రి కంచుకోట. వరుసగా మూడుసార్లు గెలుపొందిన ఆయనకు ఈసారి మాత్రం గట్టి సవాలు ఎదురైంది. కరీంగంజ్, నాగాఁవ్ స్థానాలను బీజేపీ చేజిక్కించుకోవడం కోసం బలమైన అభ్యర్థులను బరిలోకి దించింది. ఈ పరిస్థితుల్లో ముస్లిం ఓట్లను కాపాడుకుంటూ 2014 తరహాలో విజయాన్ని పునరావృతం చేయడమే అజ్మల్ ముందున్న అతిపెద్ద సవాలుగా మారింది.

బెంగాల్‌లో సిద్ధిక్ అద్భుతాలు చేయగలడా?

పశ్చిమ బెంగాల్‌లో 30 శాతానికి పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో గంపగుత్తగా ఒకవైపు నిలబడగలిగే సమూహం ఎన్నికల రాజకీయాల్లో అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే శక్తిగా ఉంటుంది. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ముస్లింల మద్దతుతో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పుడు ఫుర్ఫురా షరీఫ్‌కు చెందిన పిర్జాదా అబ్బాస్ సిద్ధిఖీ ముస్లింల గొంతుకగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ISF) అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. కాంగ్రెస్, వామపక్షాలు ఒక్క సీటు కూడా గెలవలేకపోయినా, ఐఎస్ఎఫ్ నుంచి నౌషాద్ సిద్ధిఖీ విజయం సాధించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో అబ్బాస్ సిద్ధిఖీ 30 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టారు. ముఖ్యంగా ముస్లిం సామాజికవర్గం ఎక్కువగా ఉండే స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేస్తోంది. పిర్జాదా ఎంట్రీతో కాంగ్రెస్-లెఫ్ట్‌లకే కాకుండా మమతా బెనర్జీకి కూడా ఆందోళన పెరిగింది. రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాలకు గాను 30 స్థానాల్లో పోటీ ఆ పార్టీ పోటీ చేస్తోంది. అయితే ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే నౌషాద్ సిద్ధిఖీ డైమండ్ హార్బర్ స్థానం నుండి అభిషేక్ బెనర్జీపై పోటీ చేస్తానని తొలుత ప్రకటించి తరువాత వెనక్కి తగ్గారు. రాష్ట్రంలో ముస్లిం ఓట్లతో గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న మమతా బెనర్జీకి ఈ పార్టీ ఒక పెద్ద సవాలుగా మారింది. ఈ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది? అసలు గెలుస్తుందా.. లేదా? అన్న విషయాన్ని పక్కనపెడితే.. ముస్లిం సమాజం నుంచి చీల్చే ప్రతి ఓటూ బీజేపీకి లాభించేదిగానే పరిగణించాల్సి ఉంటుంది. అది తృణమూల్ విజయావకాశాలను దెబ్బతీస్తుంది. అయితే బెంగాల్ ముస్లిం సమాజం బీజేపీని ఓడించే క్రమంలో రాష్ట్రంలో బలమైన రాజకీయ ప్రత్యర్థి తృణమూల్ కాంగ్రెస్‌కు ఓటేస్తుందా.. లేక తమ గొంతుకగా మారి నిలబడ్డ ఐఎస్ఎఫ్‌కు ఓటేస్తుందా అన్నది మాత్రం ప్రస్తుతానికి ఎవరికీ అంతుచిక్కడం లేదు.

ముస్లింల గొంతుకగా ఒవైసీ..

మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇప్పటికే వరుసగా 4 పర్యాయాలు గెలుపొందిన హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ సీటును కూడా ఆ పార్టీ కైవసం చేసుకోగా, కిషన్‌గంజ్‌లో కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఔరంగాబాద్ నుంచి ఇంతియాజ్ జలీల్ విజయం సాధించారు. ఈసారి ఈ మూడు లోక్‌సభ స్థానాల్లో ఒవైసీ పోటీ చేస్తున్నారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తన పార్టీని విస్తరింపజేసేందుకు చాలాకాలంగా ఓవైసీ ప్రయత్నిస్తున్నారు. ముస్లిం సమాజానికి గొంతుకగా మారి, వారి సమస్యలపై గళమెత్తుతూ ఉన్నారు. ముస్లింల హక్కుల కోసం నినదిస్తూ వచ్చారు. అయితే తాము తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీజేపీని ఓడించడం కోసం ఓవైసీ చేస్తున్న ప్రయత్నాలు ఒక్కోసారి బెడిసికొట్టి ప్రత్యర్థికే లాభించేలా చేస్తున్నాయి. బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చి పరోక్షంగా ఆ పార్టీ గెలుపొందడానికి దోహదం చేస్తున్నాయి. దీంతో ప్రతిపక్ష పార్టీలు సైతం ఓవైసీని బీజేపీకి బీ-టీమ్‌గా చిత్రీకరిస్తూ విమర్శిస్తూ వచ్చాయి. ఈ పరిస్థితుల్లో తాము గెలవడానికి ఆస్కారం ఉన్న చోట మాత్రమే పోటీ చేయాలని ఓవైసీ నిర్ణయించుకున్నారు. ఫలితంగా మిగతా నియోజకవర్గాల్లో బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుందని భావిస్తున్నారు. అందులో ముస్లిం జనాభా పెద్ద సంఖ్యలో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క సీట్లో కూడా తమ అభ్యర్థులను బరిలోకి దించలేదు. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ఎంఐఎం పోటీ చేయడం లేదు. బీహార్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపుతామని ముందుగా ప్రకటించినప్పటికీ తన నిర్ణయాన్ని మార్చుకుని ఎంపిక చేసిన స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలు అధికంగా ఉండే సీమాంచల్ ప్రాంతంలో ఎంఐఎం గెలుపొందిన ఎమ్మెల్యేల్లో నలుగురు ఆర్జేడీలో చేరిపోగా.. పార్టీకి అండగా నిలిచిన ఏకైక ఎమ్మెల్యే అకర్తుల ఇమాన్. అందుకే ఒవైసీ మరోసారి కిషన్‌గంజ్ లోక్‌సభ స్థానం నుండి అక్తరుల్ ఇమాన్‌ను పోటీకి దింపారు. ఈ కారణంగా బీహార్‌లోని మిగిలిన స్థానాల్లో ఎన్నికలను పోటీ చేసే వ్యూహాన్ని ఆయన వాయిదా వేశారు. మొత్తంగా అసదుద్దీన్ ఒవైసీ భారత రాజకీయాల్లో ముస్లిం సమాజ ప్రతినిధిగా స్థిరపడేందుకు ప్రయత్నిస్తున్నారు.

బీ టీం ఎవరు.. ?

దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ఓవైపు, కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండి-కూటమి మరోవైపు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ పోటీలో ముస్లిం ఓటింగ్ సరళి రాజకీయ పార్టీల్లో టెన్షన్ పెంచుతోంది. ప్రాంతీయంగా ఉన్న ముస్లిం రాజకీయ పార్టీలవైపు నిలబడితే పరోక్షంగా బీజేపీకి లాభం చేస్తుందన్న విషయాన్ని ఆ సమాజం గుర్తించింది. అందుకే చాలా వరకు విపక్ష కూటమికి అండగా నిలవాలని భావించినట్టు తెలుస్తోంది. మత పెద్దలు సైతం వారిని ఆ దిశగా నడిపిస్తున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ఓవైసీ వంటి నేతలు సైతం దేశవ్యాప్తంగా పోటీ నుంచి విరమించుకుని, ఎంపిక చేసిన 3 స్థానాలకు మాత్రమే పరిమితమవడం కూడా ఇందులో భాగమేనని అర్థం చేసుకోవచ్చు. అయితే బెంగాల్‌లో సిద్ధిఖి మాత్రం విపక్ష కూటమితో సంబంధం లేకుండా పోటీ చేస్తుండడం, తృణమూల్ కాంగ్రెస్ ఓటుబ్యాంకును దెబ్బకొట్టేలా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో ఓవైసీ ఎదుర్కొన్నట్టే, ఇప్పుడు సిద్దిఖీని కూడా బీజేపీ బి-టీమ్‌గా పిలుస్తున్నారు. వీరితో పాటు కేరళలోనూ ముస్లిం సమాజానికి ప్రాతినిథ్యం వహించేలా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) వంటి కొన్ని పార్టీలు ఉన్నప్పటికీ, చాలావరకు అవన్నీ ప్రతిపక్ష కూటమి (I.N.D.I.A) భాగమయ్యాయి. దాంతో బీజేపీ వ్యతిరేక ఓటు చీలుతుందన్న ఆందోళన లేదు. మొత్తంగా ముస్లిం సమాజం ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..