Weddings at Covid Center : కొవిడ్ సెంటర్‌లో వివాహాలు.. పెళ్లి ఖర్చులు విరాళాలు..! నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్న ఉత్తమ జంటలు..
Weddings at Covid Center : కరోనా మహమ్మారి వల్ల పండుగలకు, ఫంక్షన్లకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఎంతో ఘనంగా
Weddings at Covid Center : కరోనా మహమ్మారి వల్ల పండుగలకు, ఫంక్షన్లకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఎంతో ఘనంగా నిర్వహించుకోవలసిన వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. చాలామంది ప్రజలు ఎన్నో శుభకార్యాలకు దూరంగా ఉంటున్నారు. మరికొందరు కరోనా సోకి ఐసోలేషన్ సెంటర్‌లో ఉంటున్నారు. అందుకే ప్రభుత్వాలు కూడా కఠిన నియమాలు అమలు చేస్తున్నాయి. లాక్‌డౌన్ విధిస్తూ కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి. అయితే కొంతమంది నిబంధనలను ఉల్లంఘించి రహస్యంగా ఎక్కువ మందితో వివాహ వేడుకలు నిర్వహించడం వల్ల చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. అందుకే ఎవ్వరు ఇలా చేయకుండా ఉండాలని మహారాష్ట్రలో ఓ జంట కొవిడ్ సెంటర్‌లో పెళ్లి చేసుకొని ఆందరికి ఆదర్శంగా నిలిచారు.
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని పార్నర్ పట్టణంలోని కోవిడ్ కేర్ సెంటర్‌లో ఒక ప్రత్యేకమైన వివాహ కార్యక్రమం జరిగింది. ఇటీవల అహ్మద్ నగర్ జిల్లాలో వివాహ వేడుకలకు సంబంధించిన ఆంక్షలు సడలించబడ్డాయి. పార్నర్ నుంచి రెండు జంటలు ఇటీవల కోవిడ్ సెంటర్లో వివాహం చేసుకున్నారు. వారి వివాహాలకు ఈ ప్రత్యేకమైన వేదికను ఎంచుకోవడమే కాకుండా ఈ జంట తమ వివాహా ఖర్చుల కోసం ఉంచిన మొత్తాన్ని కోవిడ్ -19 కేంద్రానికి విరాళంగా ఇవ్వడం గొప్ప విషయం.
పార్నర్ పట్టణంలోని ఎమ్మెల్యే నీలేష్ లంకకు చెందిన శరద్ చంద్రజీ పవార్ ఆరోగ్య కేంద్రంలో ఈ జంటలు వివాహం చేసుకున్నారు. అనికేట్ వ్యావహరే, ఆర్తి షిండేతో పాటు రాజ్‌శ్రీ కాలే, జనార్దన్ కదమ్ తమ జీవితంలోని కొత్త దశను స్వాగతించాలని నిర్ణయించుకున్నారు. కోవిడ్ కేంద్రానికి ఫేస్ మాస్క్‌లు, శానిటైజర్లు, పిపిఈ కిట్లు, అవసరమైన మందులను దానం చేయాలని ఈ జంటలు నిర్ణయించుకున్నారు. రోగుల చికిత్స కోసం వారు 37,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా విరాళంగా ఇచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచం పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వివాహాలు వంటి సామాజిక సమావేశాలకు చాలా ఆంక్షలు ఉన్నాయి. మా ప్రజలు, గ్రామస్తులు ప్రస్తుతం కోవిడ్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. వారిని ఉత్సాహపరిచేందుకు ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. అందుకోసం ఇక్కడ పెళ్లి చేసుకొని వివాహ ఖర్చులను విరాళంగా అందించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. సమాజం కోసం ఆలోచించిన ఈ జంటలను ఎమ్మెల్యే ఎమ్మెల్యే నీలేష్ లంకేతో పాటు కొవిడ్ పేషెంట్లు అందరు అభినందించారు.