AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wayanad Landslides: కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రకృతి విలయం.. సీఎం సహాయనిధికి ఎలా సాయం చేయాలంటే..

ప్రకృతి వర ప్రసాదంగా భావించే కేరళలో ఇంతటి విషాదం చోటు చేసుకోవడం అందరినీ కలచి వేస్తోంది. దేశ ప్రధాని సహా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వయనాడ్ బాధితులకు తమ వంతు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. చాలా మంది సీఎం రిలీఫ్ ఫండ్ కు పెద్ద ఎత్తున డబ్బు సాయాన్ని నేరుగా జమచేస్తున్నారు.

Wayanad Landslides: కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రకృతి విలయం.. సీఎం సహాయనిధికి ఎలా సాయం చేయాలంటే..
Wayanad Landslides
Shaik Madar Saheb
|

Updated on: Aug 05, 2024 | 1:40 PM

Share

వయనాడ్‌లో జరిగిన విలయం.. ఈ దశాబ్దంలో ఎదురైన అత్యంత విపత్కర పరిస్థితుల్లో ఒకటి.. ప్రకృతి ప్రకోపానికి వయనాడ్‌ విలవిల్లాడిపోయింది. గ్రామాల మీద కొండలు విరుచుకుపడ్డాయి. వరదలు నామరూపాల్లేకుండా చేశాయి.. ఊళ్లకు ఊళ్లే బురదలో కలిసిపోయాయి. నిద్రలో ఉన్నవాళ్లు శాశ్వతంగా నిద్రలోకి వెళ్లిపోయారు. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ చాలా మంది ఆచూకీ కనపడటం లేదు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. గల్లంతైన వాళ్లు ఎక్కడున్నారో.. అసలు ప్రాణాలతో ఉన్నారో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలా వయనాడ్‌ మరుభూమిని తలపిస్తోంది.. ఎక్కడ చూసినా.. ఎటుచూసినా కనుచూపుమేర విధ్వంసమే..! ఇప్పటి వరకూ మృతుల సంఖ్య 400 దాటింది. 200 మందికి పైగా స్థానికుల ఆచూకీ గల్లంతైంది. ఇప్పటికీ చాలా మంది శిథిలాల కింద కూరుకుపోయినట్లు అంచనా వేశారు.. తప్పిపోయిన వారి కోసం వయనాడ్‌లో 7వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. రెస్క్యూ ఆపరేషన్‌లో 1300 మంది సైనికులను మోహరించారు.. ఇప్పటివరకు 11వందల మందిని రక్షించారు రెస్క్యూ టీమ్‌.. ఆస్పత్రుల్లో ఇంకా 200 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఈ ప్రకృతి విలయం యావత్తు దేశాన్ని కన్నీళ్లు పెట్టిస్తోంది. ప్రకృతి వర ప్రసాదంగా భావించే కేరళలో ఇంతటి విషాదం చోటు చేసుకోవడం అందరినీ కలచి వేస్తోంది. దేశ ప్రధాని సహా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వయనాడ్ బాధితులకు తమ వంతు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. చాలా మంది సీఎం రిలీఫ్ ఫండ్ కు పెద్ద ఎత్తున డబ్బు సాయాన్ని నేరుగా జమచేస్తున్నారు. మరికొందరు ఆర్థిక సాయంతో పాటు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

సీఎం సహాయనిధికి విరాళం ఎలా ఇవ్వాలి..

కేరళ పెను విపత్తును చవిచూస్తోందని.. చాలా మంది నుంచి సహాయం పొందడం ద్వారానే మనం ఈ విషాదాన్ని అధిగమించగలమని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఎవరికి తోచినంతగా వారు ఆర్థిక సాయం చేయాలని.. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు పంపాలని కేరళ ప్రభుత్వం కోరుతోంది. సాయం చేయాలనున్న వారు నేరుగా CMDRF వెబ్‌సైట్ ( https://donation.cmdrf.kerala.gov.in/ ) లో లాగిన్ అయి వివరాలను నమోదు చేసి విరాళాలను యూపీఐ లేదా బ్యాంకు అకౌంట్ ద్వారా పంపించవచ్చు.. దానిలో సాయం చేస్తున్న వారి పేరు.. మెయిల్, పాన్, విరాళం తదితర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దు..

ఇదిలాఉంటే.. విపత్తు మధ్య ముఖ్యమంత్రి సహాయ నిధికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్దఎత్తున దుష్ప్రచారం జరుగుతోంది. సహాయ నిధికి అందజేసిన డబ్బులు అర్హులకు చేరడం లేదని, అధికారులు డబ్బులు దుర్వినియోగం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సహాయ నిధికి ఎవరూ విరాళాలు ఇవ్వవద్దని కూడా ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అయితే ఇదంతా కేవలం ప్రచారం మాత్రమేనని.. ఇలాంటి వదంతులను నమ్మవద్దని ప్రభుత్వం ప్రకటించింది.. ముఖ్యమంత్రి సహాయనిధికి వచ్చే నిధుల నిర్వహణ బాధ్యత ఆర్థిక కార్యదర్శిపై ఉంటుంది. ఈ డబ్బు SBI తిరువనంతపురం ప్రధాన శాఖకు వెళుతుంది. అదే ఖాతా ద్వారా లబ్ధిదారులకు చెల్లింపులు జరుగుతాయి. ఈ ఖాతా ద్వారా నేరుగా లబ్ధిదారులకు నగదు బదిలీ చేయడం ద్వారా ఎవరూ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేరు. ఈ నిధిని ఆర్థిక శాఖ కార్యదర్శి నిర్వహిస్తున్నప్పటికీ, నిధుల నియంత్రణ రెవెన్యూ శాఖపై ఉంటుంది. CMDRF బ్యాంక్ ఖాతా నుంచి ఆర్థిక కార్యదర్శి తన విచక్షణతో ఒక్క రూపాయి కూడా చెల్లించలేరు లేదా బదిలీ చేయలేరు. రెవెన్యూ కార్యదర్శి జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం లబ్ధిదారులకు డబ్బు పంపిణీ చేస్తారు.. రాష్ట్ర పునరుద్ధరణకు ఉపయోగిస్తారు..

ఈ విరాళాల మొత్తానికి సంబంధించిన అన్ని వివరాలను CMDRF వెబ్‌సైట్ ( https://donation.cmdrf.kerala.gov.in) లో లేదా.. మీరు మరింత సమాచారం పొందాలనుకుంటే, సమాచార హక్కు చట్టం కింద కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా, ఈ ఖాతా కంట్రోలర్, అకౌంటెంట్ జనరల్ ద్వారా ఆడిట్ చేస్తారు.. అంతేకాకుండా.. ఈ నిధికి సంబంధించిన లెక్కలను ప్రభుత్వం శాసనసభలో సమర్పిస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..