Gold Facts: పసిడి ప్రియులు మస్ట్‌గా తెలుసుకోవాల్సిన పచ్చి నిజాలు.. అప్పుడే పట్టిందల్లా బంగారం..!

బడ్జెట్ తర్వాత బంగారం ధర దాదాపుగా ఆరున్నర లక్షలు తగ్గింది. ఆశ్చర్యంగా ఉంది కదా. కిలో బంగారం ధర ఆరు లక్షల 20వేలు తగ్గింది. కారణం.. బడ్జెట్‌లో బంగారంపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ తగ్గించడమే. ఇన్నాళ్లు పసిడిపై సుంకం భారం 15 శాతం ఉండేది. దీన్ని ఆరు శాతానికి తగ్గించారు. అలా తగ్గించారో లేదో పది గ్రాముల బంగారం ధర రమారమి నాలుగు వేల రూపాయలు తగ్గింది.

Gold Facts: పసిడి ప్రియులు మస్ట్‌గా తెలుసుకోవాల్సిన పచ్చి నిజాలు.. అప్పుడే పట్టిందల్లా బంగారం..!
Gold Myths And Facts
Follow us
K Sammaiah

| Edited By: Ravi Panangapalli

Updated on: Aug 06, 2024 | 10:28 AM

“బంగారం ధర తగ్గుతోందట వదిన”. మగువల మోములో చిరునవ్వు తొంగిచూడడానికి ఈ ఒక్కమాట చాలు. అసలా ఆ ఆనందం వెలకట్టలేనిది. ఇంటాయన జేబుకు చిల్లు పడడం తరువాత సంగతి. ముందైతే కొనేద్దాం అనే అనుకుంటారు. “తరుగుటయే ఎరుంగని” అన్నట్టు పెరగడమే తప్ప తగ్గడం అన్నదే తనకు తెలియదన్నట్టుగా పెరుగుతూ పోతోంది పసిడి. పది గ్రాముల బంగారం 30వేలు దాటిన తరువాత.. యమ స్పీడ్‌ అందుకుంది. చూస్తుండగానే 50వేలు దాటేసింది. త్వరపడి పట్టుకునేలోపు 75వేలకు పెరిగి కూర్చుంది. ఇంకేముంది.. కనకం హొయలు లకారానికి పోయినా ఆశ్చర్యం లేదన్నట్టుగా మెంటల్‌గా ఫిక్స్‌ చేస్తూ వెళ్లిపోతోంది. సరిగ్గా అలాంటి సమయంలో పుత్తడి బొమ్మను కిందకు దింపి మధ్యతరగతి చేతికి అందించారు నిర్మలమ్మ.

బడ్జెట్ తర్వాత బంగారం ధర దాదాపుగా ఆరున్నర లక్షలు తగ్గింది. ఆశ్చర్యంగా ఉంది కదా. కిలో బంగారం ధర ఆరు లక్షల 20వేలు తగ్గింది. కారణం.. బడ్జెట్‌లో బంగారంపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ తగ్గించడమే. ఇన్నాళ్లు పసిడిపై సుంకం భారం 15 శాతం ఉండేది. దీన్ని ఆరు శాతానికి తగ్గించారు. అలా తగ్గించారో లేదో పది గ్రాముల బంగారం ధర రమారమి నాలుగు వేల రూపాయలు తగ్గింది. ఓస్‌.. నాలుగు వేలేనా అనుకోకండి. ఇది ఇంకాస్త తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎలా తగ్గుతుందో చెప్పి కన్ఫ్యూజ్‌ చేయడం కంటే.. సింపుల్‌గా అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే.. బంగారు నగలు కొనుక్కునే సమయానికి ఇప్పుడున్న రేటు కంటే ఏకంగా 9 శాతం ధర తగ్గబోతోంది. లక్ష పెట్టి నగ కొనాలనుకుంటే అది అటు ఇటుగా రూ.90 వేలకే దక్కుతుందన్నమాట.

Gold Myths And Facts4

Gold Myths And Facts

బంగారంతో సెంటిమెంట్‌

కరోనా తరువాత జనం డబ్బులు దాచుకోడానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఎక్కువగా ఖర్చుపెట్టడం లేదు. ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా సరే.. కొనుగోళ్ల శక్తి ఉన్నప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. జనంతో ఖర్చుపెట్టించినప్పుడే ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఫ్రిడ్జ్‌ కొనుక్కోండి, ఏసీ కొనుక్కోండని రేట్లు తగ్గిస్తే ఎవరూ కొనరు. ‘బంగారం రేట్లు తగ్గాయి’ అని చెప్పండి.. పదివేలో, పాతికవేలో.. ఎంతో కొంత బంగారం వస్తుంది కదా అని కొనేస్తారు. మనదేశంలో బంగారాన్ని మించిన సెంటిమెంట్‌ వస్తువు మరేదీ లేదు. సో, గల్లా పెట్టెల్లో, పోపుల డబ్బాలో దాచుకున్న డబ్బంతా మార్కెట్లోకి వచ్చేస్తుంది. అలా మార్కెట్లోకి డబ్బు రావడం, ప్రజల కొనుగోలు శక్తి పెరగడం వల్ల ఇండియన్ ఎకానమి కూడా పెరుగుతుంది.

అయితే అంతా బాగానే ఉన్నా బంగారం కొనుగోలు చేసేటప్పుడు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. లేదంటే మోసపోయాక కళ్లు తేలేయడం గ్యారంటీ. బంగారాన్ని ఎంత భద్రంగా దాసుకుంటామో దాని కొనుగోలు రసీదును కూడా అంతకంటే ఎక్కువగా భద్రంగా చూసుకోవాలని రకరకాల అనుభవాలు హెచ్చరిస్తుంటాయి. ఇలాగే ఓ మహిళ తన బంగారు ఆభరణాన్ని కరిగించి కొత్త డిజైన్‌లో తయారు చేయించుకునేందుకు స్వర్ణకారుడి వద్దకు వెళ్లింది. ఆభరణాన్ని పరిశీలించగా అందులో 70 శాతానికి మించి బంగారం లేదని తేల్చాడు. హాల్‌మార్క్‌ సెంటర్‌కు పంపి పరిశీలిస్తే ఆ నగలో రాగి 17.45 శాతం, వెండి 16.21 శాతం ఉండగా బంగారం 66.14 శాతం మాత్రమే ఉన్నట్లు తేలింది. ఆ నగను కొనుగోలు చేసిన రసీదు ఎక్కడో పోవడంతో ప్రశ్నించే అవకాశం లేకుండాపోయింది.

మరిన్ని ప్రీమియం  కథనాల కోసం TV9 News APP  డౌన్‌లోడ్ చేసుకోండి.

Gold Myths And Facts3

Gold Myths And Facts

మగవారికీ మక్కువే

బంగారంపై మహిళలకుండే కావుషీని మాటల్లో చెప్పడం కష్టమే. బంగారంతో చేసిన నగలను ఒంటిపై చూసుకుని తెగ మురిసిపోతుంటారు. పేదరికంలో ఉన్నా ఇంటిలో ఎదిగిన ఆడపిల్లలకు తులమో పలమో బంగారం ఒంటి మీద ఉండాలని ఆశపడుతుంటారు. పేద, ధనిక తేడా లేకుండా ప్రతిఒక్కరూ తమ స్థాయికి తగ్గట్టు చేతిలో నాలుగు పైసలు కనపడగానే నగా నట్రా కొని దాచిపెట్టుకుంటారు. పుట్టింటివారు పెట్టిన నగలు భద్రంగా కాపాడుకుంటూ శుభకార్యాల్లో ధరిస్తూ ఉంటారు. ప్రస్తుతం ట్రెండ్‌కు తగ్గట్టు పాత నగలను కరగదీసి కొత్త డిజైన్‌లోకి మార్పించుకోవడానికి ఎక్కువగా ఇష్ట పడుతున్నారు. మహిళలే కాదు ఈ మధ్య కాలంలో నగలు ధరించే పురుషుల సంఖ్యా పెరిగిపోతుండటం గమనార్హం. మెడలో చైన్లు, ఉంగరాలు, బ్రాస్‌లెట్స్‌ రూపంలో పురుషులు సైతం భంగారం నగలు ధరిస్తున్నారు.

అయితే షాపులో నగను కొనుగోలు చేసుటప్పుడు ఆ నగను మొత్తం బంగారం కిందే లెక్కించి డబ్బులు కట్టించుకుంటారు. అదే నగను కొంత కాలం తర్వాత కరిగించి మరో ఆభరణం తయారీ కోసమో, అవసరానికి అమ్మడానికో వెళితే అసలు విషయం బయటపడుతుంది. క్యారెట్ల మోసాలు బయటపడుతున్నాయి. నాణ్యత తక్కువుందనో, వేస్టేజీ ఎక్కువుందనో వీలైనంత తక్కువ ధర చెల్లిస్తుంటారు. మనం కొనుగోలు చేసేటప్పుడు ఒక రకంగా, మనది అమ్మేటప్పుడు మరో రకంగా వ్యాపారుల వ్యవహరం ఉంటుంది. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో ఆభరణాల్లో మేలిమి బంగారం అంతే అన్నట్టుగా ఉంటుంది సీన్‌. కళ్ల ముందే బంగారం స్వచ్ఛతలో మాయ చేస్తున్నా నాణ్యత గుర్తించలేక నష్టపోవడం వినియోగదారుల వంతు అవుతుంది.

మరిన్ని ప్రీమియం  కథనాల కోసం TV9 News APP  డౌన్‌లోడ్ చేసుకోండి.

మోసాలు ఎన్నో రకాలు

పెద్ద పెద్ద పేరెన్నిక గన్న నగల దుకాణాల నుంచి మొదలు షాపింగ్‌ మాల్స్‌, చిన్నచిన్న షాపుల వరకు కూడా ఏదో రకంగా వినియోగదారుడి జేబుకు చిల్లు పెట్టేందుకే ప్రయత్నిస్తుంటాయి. చూద్దామన్నా కూడా 24 క్యారెట్ల నాణ్యమైన బంగారం ఎక్కడా కనిపించదు. ఎక్కడైనా 24 క్యారెట్ల కంటే తక్కువ నాణ్యత కలిగిన బంగారాన్నే అమ్ముతుంటారు. ఆభరణంలో పటుత్వం కోసం, కావాల్సిన డిజైన్‌గా మల్చడం కోసం బంగారంలో కొంత మేర రాగి కలుపుతారు. సాధారణంగా ఆభరణాలన్నీ 22 క్యారెట్లు లేదా కొంచెం తక్కువ నాణ్యత కలిగి ఉంటాయి. వజ్రాల నగ కేవలం 18 క్యారెట్‌తోనే ఉంటుంది.

అయితే వ్యాపారులు 18 క్యారెట్ల అభరణాన్ని చేతిలో పెట్టి 22 క్యారెట్ల బిల్లు వసూలు చేయడం సర్వసాధరణంగా మారిపోయింది. 22 క్యారెట్లు 18 క్యారెట్ల ఆభరణానికి మధ్య గ్రాముకు కనీసం వెయ్యి నుంచి రెండు వేల రూపాయల తేడా ఉంటుంది. ఈ లెక్కన 10 గ్రాముల బంగారానికి దాదాపు రూ.10 నుంచి రూ.12 వేల వరకు వినియోగదారులు నష్టపోయే ప్రమాదం ఉంది.

హాల్‌మార్క్‌ ముద్ర

బిస్కెట్‌ బంగారం అనే పదం వినే ఉంటారు కదా.. బస్కెట్‌ బంగారంలో వంద శాతం స్వచ్ఛతతో కూడిన మేలిమి బంగారం ఉంటుంది. బంగారు ఆభరణాల నాణ్యతకు సంబంధించి హాల్‌ మార్క్‌ ముద్ర ద్వారా తెలుసుకోవచ్చు. భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్‌) నిబంధన మేరకు బంగారం ఉంటేనే ఆ ఆభరణంపై హాల్‌ మార్క్‌ ముద్ర వేస్తారు.

బంగారం 24 క్యారెట్ల నాణ్యతతో ఉంటే దానిపై 999 అని, 23 క్యారెట్‌లు ఉంటే 958 అని, 22 క్యారెట్‌ల బంగారం అయితే 916 అని, 21 క్యారెట్‌లపై 875, 18 క్యారెట్‌లపై 750 అని హాల్‌మార్క్‌ ముద్ర ఉంటుంది. ఈ నంబర్‌ తర్వాత హాల్‌ మార్క్‌ వేసిన సెంటర్‌ మార్క్‌ ఉంటుంది. తయారైన సంవత్సరం ఇంగ్లిష్‌ అక్షరం కోడ్‌ రూపంలో ఉంటుంది. చివరిలో బీఐఎస్‌ ధ్రువీకరించిన ఆభరణాల తయారీదారుల గుర్తు ఉంటుంది. ఈ హాల్‌మార్క్‌ ముద్ర లేని ఆభరణాల కొనుగోలులోనే మోసాలకు అవకాశం ఉంటుంది.

Gold Myths And Facts2

Gold Myths And Facts

బంగారాన్ని దేంట్లో కొలుస్తారు?

బంగారం ఎంత మేరకు బంగారం స్వచ్ఛమైనది అనేది క్యారెట్‌లలో కొలుస్తారు. ఇది 0 నుంచి 24 వరకు ఉంటుంది. క్యారెట్‌ విలువ ఎంత ఎక్కువగా ఉంటే బంగారం అంత నాణ్యతగా ఉన్నట్లు లెక్క. ధర కూడా బంగారం క్యారెట్లను బట్టి నిర్ణయిస్తారు. బంగారం ఎంతో సున్నితంగా పెళుసు స్వభావంతో కూడిన లోహం. కాబట్టే ఆభరణాల తయారీలో అది గట్టిగా ఉండేందుకు రాగి, వెండి, వంటి ఇతర లోహాలు మిక్స్‌ చేస్తారు.

బంగారం, ఇతర లోహాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయనేది క్యారెట్‌ ద్వారా లెక్క గడతారు. అయితే బంగారంలో ఇతర లోహాలు ఎంత నిష్పత్తిలో కలిసి ఉన్నాయి? క్యారెట్ల మధ్య తేడాలు ఎలా ఉన్నాయి? వంటి విషయాలు బంగారం వ్యాపారులకు, ఎప్పుడూ నగల లావాదేవీలు చేసేవారు, బంగారంపై పెట్టుబడులు పెట్టేవారు మాత్రమే ఈజీగా గుర్తుపుడుతూ ఉంటారు.

మరిన్ని ప్రీమియం  కథనాల కోసం TV9 News APP  డౌన్‌లోడ్ చేసుకోండి.

నాణ్యత ఎలా లెక్కగడతారు?

మార్కెట్‌లో కొనుగోలు చేసిన బంగారు నగలో ఎంత బంగారం ఉందో క్యారెట్‌ లెక్క ద్వారా తెలిసిపోతుంది. ఉదాహరణకు 14 క్యారెట్ల ఉంగరాన్ని కొనుగోలు చేశారనుకోండి.. బంగారం స్వచ్ఛతను 0 నుండి 24 స్కేల్‌లో కొలుస్తారు కాబట్టి, 14ని 24తో భాగించాలి. అప్పుడు 0.583 వస్తుంది. అంటే మీ 14 క్యారెట్ల బంగారు ఉంగరంలో 58.3% బంగారం ఉందన్న మాట.

అదేవిధంగా బంగారం స్వచ్ఛతను ఫైన్‌నెస్, దాని రంగును బట్టి సులభంగా కనుగొంటారు. ఇతర తక్కువ క్యారెట్ల బంగారంతో పోల్చుకుంటే 24 క్యారెట్ల బంగారం మెరుస్తూ ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం మెరుపు కాస్త తక్కువగా ఉండి, 24 క్యారెట్లతో పోల్చుకుంటే కొంత ముదురు రంగులో కనిపిస్తుంది. బంగారంలో ఇతర లోహాల పరిమాణం పెరిగేకొద్దీ రంగులో తేడా వస్తుంటుంది. బంగారం తెల్లగా ఉందంటే నికెల్‌ పరిమాణం ఎక్కువగా కలిసిందని గుర్తు.

Gold Myths And Facts5

Gold Myths And Facts

బంగారంలో వివిధ రకాలు

బంగారంలో 24 క్యారెట్లు, 23 క్యారెట్లు, 22 క్యారట్లు, 18 క్యారెట్లు, 14 క్యారెట్లు అని వివిధ రకాలుగా ఉంటుంది. బంగారంలో కలిసే ఇతర లోహాల పరిణామాన్ని బట్టి అది ఎంత క్యారెట్ల నాణ్యతలో ఉందో లెక్క గడతారు. పూర్తి స్థాయి నాణ్యత కలిగిన బంగారాన్ని 24 క్యారెట్ల బంగారం అంటారు. ఇందులో ఇతర లోహాలేవీ ఉండవు ప్యూర్‌ గోల్డ్‌ అన్నామట. అందుకే 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారంతో పోలిస్తే 24 క్యారెట్ల బంగారం ఖరీదు ఎక్కువగా ఉంటుంది. ఇది బిస్కెట్‌ బంగారం రూపంలో మార్కెట్‌లో లభిస్తుంది. అయితే 24 క్యారెట్ల బంగారం ఖరీదెక్కువే కానీ నగల తయారీకి మాత్రం పనికిరాదు. ఇందులో ఏదో ఒక లోహం కలిపిన తర్వాతే నగ తయారు చేయడానికి పనికి వస్తుంది. బంగారంలో పెట్టుబడులు పెట్టే వారు 24 క్యారెట్ల బంగారం ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు.

ఇక 22 క్యారెట్ల బంగారం విషయానికొస్తే ఇందులో 22 వంతుల బంగారం ఉంటే రెండొంతుల రాగి, జింక్‌ వంటి ఇతర లోహాలు కలిసి ఉంటాయి. అంటే 91.6 శాతం బంగారం, 8.4 శాతం కలిపిన ఇతర లోహాలు ఉంటాయన్న మాట. ముందే చెప్పుకున్నట్లు 24 క్యారెట్ల బంగారం కంటే దీనికి మన్నిక ఎక్కువ. కాబట్టే నగల తయారీకి ఇది బాగా పనికి వస్తుంది. ఎలా అంటే అలా మలుచుకునే బంగారంగా మారిపోతుంది. సాధారణంగా 22 క్యారెట్ల బంగారంతోనే నగలు తయారు చేస్తారు. ఇదే 916 కేడీఎం గోల్డ్‌ లేదా 91.6 కేడీయం గోల్డ్‌ అని మార్కెట్లో చలామణి అవుతుంటుంది.

మన్నిక ఎక్కువ.. ధర తక్కువ

ఒక లోహంలో 18 బాగాల బంగారం, ఆరు బాగాల ఇతర లోహాలు ఉంటే దాన్ని 18 క్యారెట్ల బంగారం అంటారు. దీనిలో 75 శాతం బంగారం , 25 శాతం జింక్, రాగి, నికెల్‌ వంటి ఇతర లోహాలు మిక్స్‌ అయి ఉంటాయి. 24, 22 క్యారెట్ల బంగారం కంటే ఇది మరింత మన్నికగా ఉంటుంది. తక్కువ ఖర్చు అవుతుందని చాలామంది ఈ ఆభరణాలు కొనేందుకు మొగ్గు చూపుతుంటారు. 14 క్యారెట్ల బంగారం కూడా ఉంటుంది. ఇందులో 58.3 శాతం గోల్డ్, 41.7 శాతం ఇతర లోహాలు కలిసి ఉంటాయి. దీని మన్నిక కూడా ఎక్కువ. ధర చాలా తక్కువ. ఇక 12 క్యారెట్లలో 50 శాతం, 10 క్యారెట్లలో 41.7 శాతానికి మించి బంగారం ఉండదు.

‘టంచ్‌’నుగా వినియోగదారుడికి టోపీ

ఒకటే రకమైన నగ చాలాకాలం నుంచి వాడడం వలన బోరికొడుతుందనో, కొత్త డిజైన్‌లోకి మార్చుకుందామనో నగల దుకాణాన్ని ఆశ్రయిస్తుంటారు. పాత నగను కరిగించడం ద్వారా దాంట్లో బంగారం శాతం ఎంత ఉందో తెలుసుకోవడానికి టంచ్‌ మిషన్‌ ద్వారా పరిశీలిస్తారు. మిషన్‌లో ముందే సెట్‌ చేసి పెట్టిన రీడింగ్‌తో బంగారం శాతాన్ని లెక్కగడతారు. పాత నగలో ఉన్న బంగారం శాతం కంటే 5 నుంచి 10 శాతం తక్కువగానే లెక్కగడుతుంటారు. ఇది టంచ్‌ మిషన్‌లతో జరుగుతున్న మోసం. దీన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో మోసగాళ్లది ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతుంది.

వాస్తవానికి బంగారం నాణ్యతను, పాత బంగారంలో బంగారం శాతాన్ని నిర్ణయించేందుకు బీఐఎస్‌ (బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌) సంస్థ ద్వారా అనుమతి పొందిన లైసెన్స్‌దారుడి దగ్గరే లెక్క గట్టాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా ఎక్స్‌–రే ఫ్లోరోసెన్స్‌ మిషన్‌ అంటే కంప్యూటర్‌ అనుసంధాన యంత్రాల టంచ్‌ మిషన్‌తో బంగారం నాణ్యత ప్రమాణాలు నిర్ధారిస్తున్నారు. అంతే కాకుండా అఫీషియల్‌ పేపర్‌పై కాకుండా సాధారణ కాగితంపైనే ప్యూరిటీ పర్సంటేజీలను రాసి ఇచ్చేస్తున్నారు.

మరిన్ని ప్రీమియం  కథనాల కోసం TV9 News APP  డౌన్‌లోడ్ చేసుకోండి.

Gold Myths And Facts6

Gold Myths And Facts

వన్‌గ్రామ్‌ గోల్డ్‌ ట్రెండ్‌

బంగారం ధరలు చుక్కలు అంటడంతో సామాన్యులు ఒరిజినల్‌ బంగారాన్ని తలదన్నేలా కనిపించే వన్‌గ్రామ్‌ గోల్డ్‌ నగల వైపు మళ్లుతున్నారు. తాహతుకు మించి భారీ వ్యయంతో నగలు కొనేకన్నా.. పెళ్ళిళ్లు ఇతర వేడుకల్లో ఈ వన్‌ గ్రామ్‌ గోల్డ్‌ నగలు ఎక్కువగా ధరిస్తున్నారు. ఆకర్షణీయ డిజైన్లలో ఉండే వన్‌ గ్రామ్‌ గోల్డ్‌ నగలకు ఇటీవలి కాలంలో గిరాకీ అమాంతం పెరిగిపోయింది.

వెండి, రాగితో చేసిన ఆభరణాలకు బంగారం పూత పూయడం ద్వారా అచ్చం బంగారు నగలుగా అకర్షనీయమైన డిజైనల్లలో వీటిని తయారు చేస్తారు. నకిలీ జ్యువెలరీ మాదిరిగా కలర్‌ తొందరగా తేలిపోకుండా వన్‌ గ్రామ్‌ గోల్డ్‌ ఆభరణాల రంగు ఎక్కువ కాలం ఉంటుంది. అంతేకానీ ఈ ఆభరణాల్లో ఒక గ్రాము బంగారాన్ని వినియోగిస్తారని భ్రమ పడితే మాత్రం పప్పులో కాలేసినట్టేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అవగాహన లేకుంటే అంతే సంగతులు!

మోసాలు పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో బంగారం వంటి విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తత అవసరం. నాణ్యతపై ముందే అవగాహన ఏర్పరచుకోవాలి. అనేక చోట్ల నగల దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌ల్లో బంగారం నాణ్యతను తెలియజేసే క్యారెక్టరైజేషన్‌ మిషన్‌ అందుబాటులో ఉండటం లేదు. కాదు.. కాదు ఉంచడం లేదు అంటే సబబుగా ఉంటుంది. ప్రభుత్వ పరంగా తనిఖీలు నిర్వహించే అధికారుల వద్ద కూడా నాణ్యతను పరిశీలించే మిషన్లు చూద్దామన్నా కనిపించడం లేదు. వినియోగదారులు చెల్లించే సొమ్ముకు తగిన నాణ్యతతో కూడిన బంగారం లభించే విధంగా వ్యవస్థను తయారు చేసే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంది. ఇప్పటికైనా నాణ్యతను తెలియజేసే మిషన్లను సరఫరా చేసి, మోసాలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఎంతైనా ఉంది.

వినియోదారుడు కూడ బంగారం నాణ్యతను అడిగి తెలుసుకోవాలి. అనుమానం ఉంటే నాణ్యతను పరీక్షించుకునేందుకు కూడా వెనకాడకూడదు. మోహమాటానికి పోతే అసలుకే మోసం వస్తుంది. హాల్‌మార్క్‌ గుర్తును చూసిన తర్వాత మాత్రమే నగలు కొనుగోలు చేస్తే మోసపోయే ఆస్కారం తక్కువ. హాల్‌మార్క్‌ అనేది బంగారంపై ప్రభుత్వ హామీలాంటిదని గుర్తు పెట్టుకోండి. ఒక్కో ఆభరణాన్ని పరీక్షించి, హాల్‌ మార్క్‌ ఇచ్చేందుకు అయ్యే ఖర్చు చాలా తక్కువ అనే విషయాన్ని గూడా వినియోగదారుడు గుర్తించాలి. అలాంటిది హాల్‌మార్క్‌ లేని నగల జోలికి పోకుండా ఉండడమే ఉత్తమం.

మరిన్ని ప్రీమియం  కథనాల కోసం TV9 News APP  డౌన్‌లోడ్ చేసుకోండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ