రాజీనామా బాటలో ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ? కొత్త సీఎం ఎవరు ?

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి  త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో నిన్న బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని కలుసుకున్న ఆయన రాష్ట్రంలో తలెత్తిన...

  • Umakanth Rao
  • Publish Date - 2:50 pm, Tue, 9 March 21
రాజీనామా బాటలో ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ? కొత్త సీఎం ఎవరు ?

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి  త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో నిన్న బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని కలుసుకున్న ఆయన రాష్ట్రంలో తలెత్తిన రాజకీయ సంక్షోభాన్ని వారి దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో రావత్ పని తీరు పట్ల పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు  బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కనీసం నలుగురు మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు ఈయన దయనీయమైన వర్కింగ్ స్టైల్ ని పార్టీ అధిష్టానం దృష్టికి తెచ్చినట్టు తెలుస్తోంది. రావత్ నాయకత్వం కింద బీజేపీ… వచ్చే ఏడాది  జరగనున్న ఎన్నికల్లో  విజయంసాధించే అవకాశాలు లేవని వారు స్పష్టం చేసినట్టు సమాచారం. పలు అంశాల్లో ఆయన తమను విశ్వాసం లోకి తీసుకోవడంలేదని, తమను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వారు ఆరోపించారు. రావత్ రాజీనామా చేయకపోతే తాము తమ పదవులకు రాజీనామా చేస్తామని వారు పేర్కొన్నట్టు తెలిసింది. కాగా ఇద్దరు పార్టీ పరిశీలకులు రమణ్ సింగ్, దుశ్యంత్  సింగ్  గౌతమ్ ఇటీవల ఉత్తరాఖండ్ విజిట్ చేసి అక్కడి రాజకీయపరిస్థితిపై తమ నివేదికను పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సమర్పించారు.

2017 లో బీజేపీ ఉత్తరాఖండ్ లో రావత్ ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. అయితే అప్పటి నుంచే ఆయన ప్రభుత్వంపై పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు.  రాష్ట్ర అభివృద్డికి దోహదపడే చర్యలేవీ ఆయన తీసుకోవడంలేదని వారు అభిప్రాయపడుతూ వచ్చారు. పార్టీ నిబంధనల ప్రకారం  12 మంది మంత్రులను రావత్ తీసుకోవలసి ఉండగా కేవలం ఏడుగురితో సరిపెట్టారు. ఇందుకు బీజేపీ సీనియర్ నాయకత్వం కూడా ఆయన పట్ల లోలోన అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మొత్తం మీద రావత్ రాజ్‌భవ‌న్‌లో గవర్నర్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పిస్తారని అంటున్నారు. ఇక ఉత్తరాఖండ్‌కు బీజేపీ ఎవరిని కొత్త సీఎంగా నియమిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Read More :

India Vs England: కెప్టెన్ విరాట్ కోహ్లీ కి ఇది నిజంగా అవమానమే…!

Taapsee Pannu: తాప్సీ పన్నూకి పెరుగుతున్న మద్దతు… తప్పుచేసి ఉంటే శిక్షకి సిద్ధమంటున్న బ్యూటీ…!!