ధంతేరస్ వేళ తీవ్ర విషాదం.. ట్రాక్టర్ ట్రాలీని ఢీకొన్న ట్రక్కు.. ఐదుగురు మృతి, 17 మందికి సీరియస్!
ఉత్తరప్రదేశ్‌లో ధంతేరస్ పండుగ రోజున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ట్రక్కు ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ట్రాలీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 17 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

సీతాపూర్: ఉత్తరప్రదేశ్‌లో ధంతేరస్ పండుగ రోజున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ట్రక్కు ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ట్రాలీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 17 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ముండన్ కార్యక్రమం నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతాపూర్ జిల్లాలోని పిసవాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బరిగవాన్ గ్రామానికి చెందిన పలువురు గ్రామస్థులు హర్దోయ్ జిల్లాలోని రాయ్‌పూర్ మథియాలో నిర్వహించిన ముండన్ కార్యక్రమానికి వెళ్లారు. కార్యక్రమం ముగించుకుని పెద్ద సంఖ్యలో ప్రజలు ట్రాక్టర్ ట్రాలీలో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో హిమ్మత్‌నగర్ ప్రాంతంలోని కొల్హాఘాట్ వంతెన సమీపానికి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టింది.
ట్రాలీ బోల్తా.. కింద చిక్కుకున్న ప్రయాణికులు
ట్రక్కు ఢీకొట్టిన వేగానికి ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న పలువురు కిందపడి ట్రాలీ కింద చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితుల ఆర్తనాదాలతో ప్రాంతమంతా భయానకంగా మారింది. స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాలీ కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు.
ఐదుగురు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో కాజల్ (10), సుశీల (50), రూబీ (22), సునీత (40)తో పాటు సుమారు 58 ఏళ్ల గుర్తుతెలియని మహిళ మరణించారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ట్రక్కు వదిలి పరారైన డ్రైవర్
ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు. పోలీసులు ట్రక్కును స్వాధీనం చేసుకుని డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, మృతురాలిగా గుర్తించిన మహిళ వివరాలను నమోదు చేస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమా? మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన కుటుంబాలు ప్రయాణిస్తున్న సమయంలో జరిగిన ఈ ఘోర ప్రమాదం బరిగవాన్ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బాధిత కుటుంబాలను స్థానికులు పరామర్శిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
