సెమీకండక్టర్ రంగంలో సరికొత్త శకం.. సెమికాన్ 2.0 పోర్టల్ ప్రారంభించిన అశ్వినీ వైష్ణవ్..
భారత్ కేవలం విదేశీ విడిభాగాలను బిగించే అసెంబ్లింగ్ దేశం మాత్రమే కాదు.. ప్రపంచానికే కావాల్సిన చిప్‌లను తయారుచేసే గ్లోబల్ సెమీకండక్టర్ సూపర్ పవర్.. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం మరో భారీ ముందడుగు వేసింది. రూ.1,27,500 కోట్ల భారీ వ్యయంతో సెమికాన్ 2.0 పోర్టల్‌ను లాంఛ్ చేయడంతో పాటు రూ.7,500 కోట్లకు పైగా పెట్టుబడులతో మరో 12 కీలక ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపింది.

భారతదేశాన్ని గ్లోబల్ సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద రూ.1,27,500 కోట్ల భారీ బడ్జెట్‌తో కేంద్ర కేబినెట్ ఆమోదించిన సెమికాన్ 2.0 వెబ్ అప్లికేషన్ పోర్టల్‌ను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. దీంతో పాటు ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ కింద రూ.7,503 కోట్ల పెట్టుబడులతో కూడిన మరో 12 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. గత కొన్నేళ్లలోనే ఇండియా సెమీకండక్టర్ మిషన్ దేశంలో బలమైన పునాదిని నిర్మించింది. తొలి దశలో భాగంగా ఆరు రాష్ట్రాల్లో రూ.1.64 లక్షల కోట్ల పెట్టుబడులతో 12 ప్రాజెక్టులకు ఆమోదం తెలపగా, వాటిలో ఇప్పటికే ఐదు ప్రాజెక్టులు వాణిజ్యపరమైన ఉత్పత్తిని ప్రారంభించాయి. అలాగే స్టార్టప్‌లకు ఈడీఏ టూల్స్, నిధుల సాయం అందించడంతో పాటు చిప్స్ టు స్టార్టప్ ప్రోగ్రామ్ ద్వారా 332 విద్యాసంస్థల్లో సుమారు 70,000 మంది విద్యార్థులకు అధునాతన శిక్షణ ఇచ్చారు.
ఈ విజయాల స్ఫూర్తితో ప్రారంభమైన సెమికాన్ 2.0 ఆరు వ్యూహాత్మక స్తంభాలపై ప్రత్యేక దృష్టి సారించింది.
- చిప్ డిజైనింగ్
- యంత్రాలు, ముడి పదార్థాల సరఫరా
- మరిన్ని ఫ్యాబ్‌ల ఏర్పాటు
- ఏటీఎంపీ-ఓశాట్ పరిశ్రమ బలోపేతం
- పరిశోధన – అభివృద్ధి
- నిపుణులైన మానవ వనరుల అభివృద్ధి
తాజాగా ప్రారంభించిన పోర్టల్ ద్వారా పిల్లర్ 2, పిల్లర్ 3, పిల్లర్ 4 విభాగాలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.
ఈసీఎంఎస్ కింద 12 ప్రాజెక్టులకు ఆమోదం
గతంలో రూ.69,548 కోట్ల పెట్టుబడితో ఆమోదించిన 106 ప్రాజెక్టులకు కొనసాగింపుగా, కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ తాజాగా మరో 12 ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసింది.ఈ 12 ప్రాజెక్టుల ద్వారా రూ.7,503 కోట్ల పెట్టుబడులు రానుండగా, సుమారు రూ.39,045 కోట్ల విలువైన ఉత్పత్తులు జరగనున్నాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా 7,127 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లతో సహా ఏడు రాష్ట్రాలలో ఈ యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. దేశంలో తొలిసారిగా కాపర్ ఫాయిల్, క్యాథోడ్ యాక్టివ్ మెటీరియల్, స్పెషాలిటీ సిరామిక్స్ తయారీకి ఈసీఎంఎస్ కింద అనుమతులు లభించాయి.
మల్టీ-లేయర్ పీసీబీలకు నెస్ట్ ఐసీఈఎల్ఆర్, రిలేల తయారీకి టీడీకనెక్స్, హీట్ సింక్‌లకు మోడరన్ ఆటోమోటివ్స్, స్పెషాలిటీ సిరామిక్స్కు వోల్టిక్స్ సెమికాన్లకు ఆమోదం లభించింది. అలాగే లిథియం అయాన్ బ్యాటరీల్లో వాడే కాపర్ ఫాయిల్, యానోడ్ మెటీరియల్, క్యాథోడ్ మెటీరియల్ వంటి సప్లై చైన్ ఉత్పత్తుల తయారీకి మార్గం సుగమమైంది. మొత్తంగా ఈసీఎంఎస్ పథకం కింద ఇప్పటివరకు 16 రాష్ట్రాల్లో 34 ఉత్పత్తులకు సంబంధించి 118 దరఖాస్తులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా రూ.77,051 కోట్ల పెట్టుబడులు, రూ.5.73 లక్షల కోట్ల ఉత్పత్తితో పాటు 81,755 మందికి ప్రత్యక్ష ఉపాధి దక్కనుంది.
కేవలం అసెంబ్లింగ్ కాదు.. స్వయం సమృద్ధి లక్ష్యం: అశ్వినీ వైష్ణవ్
కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. భారత ఎలక్ట్రానిక్స్ రంగ ప్రయాణం కేవలం వస్తువుల అసెంబ్లింగ్ స్థాయిని దాటి, కాంపోనెంట్లు, పరికరాలు, అధునాతన సాంకేతికతల తయారీ దశకు చేరుకుందని స్పష్టం చేశారు. ఈ పథకం కింద ఆమోదం పొందిన వాటిలో దాదాపు 50 శాతం ఎంఎస్ఎంఈ రంగానికి చెందినవే ఉండటం దేశీయ సరఫరా గొలుసు బలాన్ని తెలియజేస్తోందన్నారు. కనీసం మూడు ప్రధాన ఎక్విప్మెంట్ తయారీ సంస్థలు, ఐదు గ్లోబల్ కెమికల్-గ్యాసెస్ కంపెనీలను భారత్‌కు తీసుకురావడమే సెమికాన్ 2.0 ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో సాంకేతిక నాణ్యత, ప్రపంచస్థాయి పోటీతత్వమే భారత్‌ను ముందుంచుతాయని మంత్రి ఉద్ఘాటించారు.
