Yogi Swearing-in Ceremony: యోగి ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ ఏర్పాట్లు.. సుందరంగా ముస్తాబైన ఏకనా స్టేడియం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు లక్నోలోని ఎకానా స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరగనుంది.
Yogi Adityanath Swearing-in Ceremony: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు లక్నో(Lucknow)లోని ఎకనా స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరగనుంది. ముఖ్య అతిథులుగా ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు కూడా హాజరవుతున్నారు. యోగి ప్రభుత్వంలో కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మలను మళ్లీ డిప్యూటీ సీఎంలుగా చేయవచ్చు. వీరితో పాటు మహేంద్ర సింగ్, అసీమ్ అరుణ్ కూడా మంత్రులు అవుతారని భావిస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్‌తో పాటు 46 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందులో ఏడుగురు మహిళలను కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారన్న వార్తలు వెలువడుతున్నాయి. అయితే, ఈసారి యువ ముఖాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి యోగి ఆదిత్యనాథ్ గురువారం శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. దీంతో పాటు గవర్నర్‌ను కలిసిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సీఎంయోగి పూర్తి వివరాలను సమర్పించారు. అయితే ఉపముఖ్యమంత్రి ఎవరనే విషయంపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. నేతగా ఎన్నికైన అనంతరం యోగి ఆదిత్యనాథ్ రాజ్ భవన్ చేరుకున్నారు. 273 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ముందు వివరించారు.
అంతకుముందు జరిగిన యూపీ బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో యోగిని బీజేఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు సురేష్ ఖన్నా.. ఉత్తరప్రదేశ్ శాసనసభా పక్ష నేతగా యోగి ఆదిత్యనాథ్‌ను చేయాలని ప్రతిపాదించగా, దానిని సూర్య ప్రతాప్ షాహి ఆమోదించారు. ఆ తర్వాత శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేంద్ర పరిశీలకులు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సహ పర్యవేక్షకులు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ ఈ విషయాన్ని ప్రకటించారు.
బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం ముగిసిన అనంతరం యోగి రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుపై తన వాదనను వినిపించిన గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారం చేయడానికి తన ప్రతిపాదిత మంత్రివర్గ సహచరుల జాబితాను సమర్పించాలని గవర్నర్ అభ్యర్థించారు. తద్వారా వారు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అగ్రనేతలు, పారిశ్రామికవేత్తలు, సాధువులు పాల్గొననున్నారు. భారతీయ జనతా పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ కార్యక్రమానికి హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీతో పాటు దేశంలోని 60 మందికి పైగా ప్రముఖ పారిశ్రామికవేత్తలను కూడా ఆహ్వానించారు. ఇదిలావుంటే, మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆయన మిత్రపక్షం రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డి)కి చెందిన జయంత్ చౌదరి ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని ప్రకటించారు. ఎన్నికల్లో గూండాలు, మావలీలు, టెర్రరిస్టులతో పాటు రైతులకు ఎనభై-ట్వంటీ గురించి చెప్పారని జయంత్ అన్నారు. అలాంటి భావజాలం ఉన్న వ్యక్తులకు దూరంగా ఉంటామన్నారు.
యోగి ప్రమాణ స్వీకారం కోసం లక్నో మొత్తం ముస్తాబైంది. లక్నో విమానాశ్రయం నుండి ఎకానా స్టేడియం వరకు వెళ్లే రహదారి పోస్టర్లు, హోర్డింగ్ జెండాలతో నిండి ఉంది. లక్నోలోని అటల్ స్టేడియంలో బీజేపీ మద్దతుదారులు గుమిగూడి డప్పులు వాయిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు సభా వేదిక పరిసరాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, “ఉత్తరప్రదేశ్ పోలీసులు, ప్రావిన్షియల్ ఆర్మ్‌డ్ కానిస్టేబుల్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్), యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఎటిఎస్) ఇతర యూనిట్లు భద్రత కోసం నియమించారు.