Mobile game addiction: స్మార్ట్ ఫోన్‌ను రిపేర్ చేసేందుకు తల్లిదండ్రుల నిరాకరణ..మైనర్ బాలుడు ఆత్మహత్య
మొబైల్ ఫోన్‌లో గేమ్‌లకు బానిసైన ఓ మైనర్ బాలుడు (15) అర్థాంతరంగా తనువు చాలించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మొబైల్ ఫోన్‌లో గేమ్‌లకు బానిసైన ఓ మైనర్ బాలుడు (15) అర్థాంతరంగా తనువు చాలించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాకు చెందిన బాలుడు నిత్యం ఫోన్‌లో గేమ్‌లు ఆడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో బాలుడి ఫోన్ కొద్ది రోజుల క్రితం పాడైంది. దీంతో ఫోన్ బాగుచేయించమని తల్లిదండ్రులను కోరాడు. ఐతే ఫోన్ రిపేర్ చేయిస్తే మళ్లీ గేమ్‌లకు అలవాటు పడతాడేమోనని భావించిన తల్లిదండ్రులు ఫోన్‌ను బాగుచేయించేందుకు నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు మంగళవారం (ఫిబ్రవరి 14) ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటీన సమీప ఆసుపత్రకి తరలించగా.. పరీక్షించిన వైద్యులు బాలుడు మృతి చెందినట్లు ధృవీకరించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డీసీపీ గ్రేటర్ నోయిడా సాద్ మియాన్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. మొబైల్‌లో ఆన్‌లైన్ గేమ్స్‌కు అడిక్ట్ అయిన మైనర్ బాలుడు ఫోన్ రిపేర్ చేయడానికి తల్లిదండ్రులు నిరాకరించినందున ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక నిర్ధరణకు వచ్చాం. దర్యాప్తులో అసలు కారణం తెలుసుకుంటామన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.