Ulta Pani Video: అక్కడ రివర్స్‌లో నీటి ప్రవాహం.. కాగితం పడవ నీళ్లలో వదిలి సంబరపడిన కేంద్ర మంత్రి!
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మూడు రోజుల ఛత్తీస్‌గఢ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అక్కడి ఓ ప్రకృతి వింతను చూసి మంత్రి శివరాజ్ చౌహాన్ అమితాశ్చర్యానికి గురయ్యారు. సంబరంగా కాగితం పడవలు చేసి నీటిలో వదిలి మురిసిపోయారు. అసలేం జరిగిందంటే..

ఛత్తీస్‌గఢ్, జులై 9: సాధారణంగా నీరు ఎగువ నుంచి పల్లానికి ప్రవహించడం మనం చూస్తేనే ఉంటాం. ఈ భూమి మీద ఎక్కడైనా ఇలాంటి దృశ్యమే కనిపిస్తుంది. అయితే చత్తీస్‌ఘడ్‌లోని మైన్‌పట్ ప్రాంతంలో మాత్రం అంతా రివల్స్ ఉంటుంది. అంటే దిగువ నుంచి ఎగువకు నీరు ప్రవహిస్తుంది. అక్కడి ఈ వింత ప్రదేశానికి ‘ఉల్టాపానీ’ అనే పేరుంది. చత్తీస్‌ఘడ్ పర్యటనలో ఉన్న మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కంట ఈ దృశ్యం పడింది. ఈ ద్యశ్యాన్ని చూసి ఆయన అమిత ఆశ్చర్యానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఎక్స్ ఖాతాలో పోస్టుపెట్టారు కూడా.
‘నిజంగా, మన ఛత్తీస్‌గఢ్ అద్భుతం! ఇక్కడి నీరు కింది నుంచి పైకి వ్యతిరేక దిశలో ప్రవహిస్తుంది. నా జీవితంలో ఇలాంటి అనుభవం ఎదురుకావడం తొలిసారి. దీనిని మైన్‌పట్‌లో గమనించాను. దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఏమైనప్పటికీ.. ఈ రహస్యం ఎంతో ఆసక్తికరంగా ఉంది’ అని అందులో పేర్కొన్నారు. నీరు కింది నుంచి పైకి ప్రవహించడం తొలిసారి చూస్తున్నానని, ఇది నిజంగా ప్రకృతి అద్భుతమని అన్నారు. అంతేకాదు చిరునవ్వులు చిందిస్తూ కాగితం పడవ చేసి నీళ్లలో వదిలగా.. అది కూడా వ్యతిరేక దిశలో కింది నుంచి పైకి వెళ్లడం చూసి ఆశ్చర్యపోయారు.
छत्तीसगढ़ सचमुच अद्वितीय है!
छत्तीसगढ़ प्राकृतिक सौंदर्य से ही नहीं, बल्कि प्रकृति के अद्भुत चमत्कारों से भी समृद्ध है। ‘उल्टा पानी’ के रूप में ऐसा ही एक चमत्कार हमें मैनपाट में देखने को मिला।
यहाँ पानी ऊपर से नीचे नहीं, बल्कि नीचे से ऊपर बहता दिखाई देता है। हमने वहाँ एक कागज़… pic.twitter.com/ZsQ8WWPtdM
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 8, 2025
చత్తీస్‌ఘడ్‌లో ‘ఉల్టా పానీ’ వంటి ప్రదేశాలను పర్యాటక రంగానికి ప్రత్యేకంగా అభివృద్ధి చేసి ప్రోత్సహించాలని, తద్వారా ఛత్తీస్‌గఢ్ పర్యాటక రంగంలోనూ ప్రకాశిస్తుందని ఆయన సూచించారు. ఛత్తీస్‌గఢ్ సుర్గుజా జిల్లాలోని ఓ కొండ ప్రాంతమే మైన్‌పట్. దీనిని ఛత్తీస్‌గఢ్ శిమ్లాగా పిలుస్తుంటారు. బిసార్ పానీగా పేరుగాంచిన ‘ఉల్టా పానీ’ ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ వింతను చూసి ఆశ్చర్యపోతారు. అయినప్పటికీ, ఇప్పటివరకు దీనిపై పరిశోధన చేయడానికి ఒక్క సైంటిస్టు కూడా రాలేదు. దీని వెనుక ఉన్న సైన్స్ సీక్రెట్‌ను ఎవరూ ఛేదించలేదు. అయితే భౌగోళిక శాస్త్రవేత్తలు మాత్రం గురుత్వాకర్షణ, అయస్కాంత కారణం వల్ల ఇలా జరుగుతుందని భావిస్తున్నారు. అందుకే ఇక్కడ నీరు వ్యతిరేక దిశలో ప్రవహిస్తుందని అంటున్నారు. కానీ ఇది కూడా ఒక ఊహ మాత్రమే. మైన్‌పట్ అగ్నిపర్వత పీఠభూమి కాబట్టి అక్కడి అయస్కాంత శక్తి వల్ల ఇలా జరుగుతుందని భావిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




