విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరుగుతుంది.. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తాం- కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు!
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై నిష్పాక్షికమైన సమగ్ర దర్యాప్తు చేసి ప్రమాదానికి గల కారణాలు తెలియజేస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయడు తెలిపారు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో జరిగిన విమాన ప్రమాద విషయం తెలియగానే ఆయన ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మృతుల సంఖ్య ఇంకా కనుగోవాల్సి ఉందని ఆయన తెలిపారు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 242 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా AI171 విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ విమానం ఎయిర్ పోర్ట్ సమీపంలోని ఓ బిడ్జింగ్‌ను ఢీకొట్టి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో బిడ్జింగ్‌లో ఉన్న పలువురు మెడికల్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అయితే విమాన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా వెలువడ లేదు. ఈ ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి బయల్దేరి వెళ్లారు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయడు. అక్కడికి వెళ్లి తాను దగ్గరుండి మరీ సహాయక చర్యలను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ విషాదకరమైన, భయంకరమైన సంఘటన తనను పూర్తిగా షాక్ గురిచేసిందని తెలిపారు. ఈ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారని తెలిసి చాలా బాధేసిందని అన్నారు. ఈ ప్రమాదంలో ఇతర దేశాల చెందిన వారు కూడా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ సమయంలో, ప్రయాణీకులు వారి కుటుంబాల గురించి మాత్రమే తాను ఆలోచించగలనని.. ఈ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు తెలిపారు.
వీడియో చూడండి..
ప్రమాదం జరిగిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌చేసి తనతో మాట్లాడారని తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని కోరినట్టు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా విషయం తెలిసిన వెంటనే ఇక్కడికి చేరుకున్నారని ఆయన కూడా ఇక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారన్నారు. అయితే ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య ఇంకా కనుగోవాల్సి ఉందని ఆయన తెలిపారు. విమాన ప్రమాదంపై నిష్పాక్షికమైన సమగ్ర దర్యాప్తు చేస్తామని.. ఆ తర్వాత అన్ని విషయాలను తెలియజేస్తామని ఆయన అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




