Mines Ministers Conference: బొగ్గు రంగంలో కీలక సంస్కరణలు తీసుకొచ్చిన కేంద్రప్రభుత్వం.. హైదరాబాద్ లో ముగిసిన మైనింగ్ మంత్రుల సమావేశం..
బొగ్గు రంగంలో సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్రాల భాగస్వామ్యంతో అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. హైదరాబాద్ లో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరిగిన జాతీయ మైనింగ్..
National Mines Ministers Conference: బొగ్గు రంగంలో సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్రాల భాగస్వామ్యంతో అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. హైదరాబాద్ లో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరిగిన జాతీయ మైనింగ్ మంత్రుల సదస్సు శనివారంతో ముగిసింది. ఈసదస్సును కేంద్ర బొగ్గు గనులు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం ప్రారంభించారు. రెండోరోజు సమావేశంలో బొగ్గురంగానికి సంబంధించి కీలక అంశాలపై చర్చించారు. బొగ్గు రంగంలో స్వయంసమృద్ధి సాధించడం ద్వారా దేశంలో సుస్థిరమైన మైనింగ్‌ను ప్రోత్సహించే దిశలో జాతీయ మైనింగ్ మంత్రుల సమావేశం ఓ ముందడుగని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన మైనింగ్ మంత్రులు, మైనింగ్ శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల నుండి మైనింగ్‌కు సంబంధించిన డిజిఎంలు, డిఎంజీలతో పాటు బొగ్గు మంత్రిత్వ శాఖ, గనుల మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు. బొగ్గు రంగంలో సంస్కరణలు, వాటి ప్రభావం, బొగ్గు తవ్వకాల కోసం భూసేకరణ, బొగ్గు లాజిస్టిక్స్, బొగ్గు గనుల నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించారు.
ఈసమావేశంలో వక్తలు మాట్లాడుతూ..2014లో సుప్రీంకోర్టు 204 బొగ్గు బ్లాకులను రద్దు చేసిన తర్వాత 2015లో మొట్టమొదటిసారిగా సంస్కరణలు ప్రవేశపెట్టబడ్డాయని, ఆ క్రమంలో బొగ్గు బ్లాకుల కేటాయింపు ప్రారంభమైందని తెలిపారు. వీటిలో వాణిజ్య విక్రయాలకు అనుమతి లేదని, బొగ్గు అమ్మకం, వినియోగంపై ఎలాంటి పరిమితి లేకుండా వాణిజ్య గనుల తవ్వకాలను సరళీకృతం చేయడం ద్వారా 2020లో మరోసారి సంస్కరణలు తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈసంస్కరణల ద్వారా వినియోగదారులు 50% ఉత్పత్తిని బహిరంగ మార్కెట్‌లో విక్రయించడానికి అనుమతించినట్లు పేర్కొన్నారు. ఇటీవల బ్యాంక్ గ్యారెంటీని కేటాయించకుండా పిఎస్‌యులు బొగ్గు బ్లాకులను సరెండర్ చేయడానికి ఒక సారి సడలింపును అనుమతించే విధానం జారీ చేసినట్లు తెలిపారు. బొగ్గు బ్లాకులను క్రమ పద్ధతిలో వేలానికి అందించేందుకు బొగ్గు బ్లాకుల రివాల్వింగ్ వేలాన్ని మంత్రిత్వ శాఖ ఆమోదించిందని తెలియజేశారు. బొగ్గు మంత్రిత్వ శాఖ సంస్కరణలు తీసుకొచ్చే సమయంలో రాష్ట్రాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ ధరలపై ఆధారపడి జాతీయ బొగ్గు సూచిక ఉంటుందని తెలిపారు. ఈసంస్కరణల ద్వారా ప్రయోజనాలు పొందాలంటే రాష్ట్రాల మద్దతు అవసరమని ఈసమావేశంలో నిర్ణయించడం జరిగింది. వాణిజ్య వేలం ద్వారా వచ్చే ఆదాయం సంబంధిత రాష్ట్రాలకు వెళ్తుందని, భూపరిహారం విధానాన్ని రూపొందించడానికి రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉంటుందని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఈసమావేశంలో స్పష్టం చేసింది. ఈ సమావేశంలో బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన పలు సంస్కరణలపై చర్చించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..