China and Russia: రష్యా, చైనా అధ్యక్షుల భేటీ ఫిక్స్.. ప్రధానంగా ఈ అంశాలపైనే చర్చించే అవకాశం..
రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆక్షంలు విధిస్తున్న నేపథ్యంలో మరో వారం రోజుల్లో చైనా, రష్యా అధ్యక్షులు భేటీ కానున్నారు. రష్యా అధ్యక్షుడు..
China and Russia: రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆక్షంలు విధిస్తున్న నేపథ్యంలో మరో వారం రోజుల్లో చైనా, రష్యా అధ్యక్షులు భేటీ కానున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ (Xi Jinping) ఈనెలలో సమావేశం కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఉజ్బెకిస్తాన్ (Uzbekistan)లో జరిగే సదస్సులో వచ్చే వారం వీరిద్దరూ సమావేశం కానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తోన్న ఈ రెండు ప్రధాన దేశాలు తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు పలు ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో ఇరు దేశాల అధినేతలు ఉజ్బెకిస్తాన్‌లో జరిగే సదస్సులో పాల్గొంటారని చైనాలోని రష్యా రాయబారి ఆండ్రూ దెనిసోవ్ (Andrey Denisov) వెల్లడించారు. ఈసదస్సులో భాగంగా ఇరువురు నేతల సమావేశం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నామని తెలిపారు. 2019 తర్వాత చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ చైనా దాటి ఎక్కడా పర్యటించలేదు. కేవలం హాంకాంగ్‌లో మాత్రమే ఒకరోజు పర్యటించారు. ఒకవేళ ఉజ్బెకిస్తాన్ వెళితే.. గత రెండున్నరేళ్లలో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ చేసిన తొలి విదేశీ పర్యటన ఇదే కానుంది. మరోవైపు, ఆరు నెలల క్రితం ఉక్రెయిన్‌లో యుద్ధం మొదలుపెట్టిన తర్వాత రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఏకాకి అయిన రష్యాను ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు వెంటాడుతున్నాయి. చైనాలో మూడోసారి అధికార పగ్గాలు చేపట్టిన జిన్‌పింగ్‌కు కూడా చైనా ఆర్థికవృద్ధి మందగించడం ఓ సవాల్‌గా మారింది. ఈ రెండు దేశాలకు పాశ్చాత్య దేశాలతో ఉన్న సంబంధాలు మరింత క్షీణిస్తున్నాయి. ఈదశలో ఇరుదేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు రష్యా, చైనాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలోనే ఈ రెండు దేశాల అగ్ర దేశాధినేతల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉక్రెయిన్- రష్యా యుద్ధం కారణంగా తమకు ఎటువంటి నష్టం జరగలేదని ఇటీవల ఓ కార్యక్రమంలో వ్లాదిమిర్ పుతిన్ చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు రష్యాను ఒంటరి చేసేందుకు ఆంక్షల పేరుతో పాశ్చాత్య దేశాలు చేస్తోన్న ప్రయత్నాలు విఫలమయ్యాయని కూడా పుతిన్ ఈసందర్బంగా పేర్కొన్నారు. వాటి వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నాశనమవడంతోపాటు ఆహార, ఇంధన ధరల పెరుగుదలకు కారణమయ్యాయని అన్నారు. ఇదే సమయంలో భవిష్యత్తు శక్తిగా ఆసియా ఎదుగుతోందని అభిప్రాయపడ్డారు. ఈవ్యాఖ్యల అనంతరం చైనా, రష్యా అధ్యక్షులు ఒకే చోట సమావేశం కావడం కూడా చర్చనీయాంశమవుతోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..