Literacy Day: సంపూర్ణ అక్షరాస్యత సాధించేది ఎప్పటికో.. లక్ష్యానికి అడుగడుగునా అడ్డంకులు.. నేడు ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం..

ప్రతి వ్యక్తి జీవితానికి విద్య ఎంతో వెలుగునిస్తుంది. విద్య అంటే కేవలం పాఠ్యపుస్తకాలు బట్టిపట్టడం కాదు. ఈసమాజంలో బతికేందుకు అవసరమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడం అక్షరాస్యత కిందే వస్తుంది. ఒకరి నుంచి..

Literacy Day: సంపూర్ణ అక్షరాస్యత సాధించేది ఎప్పటికో.. లక్ష్యానికి అడుగడుగునా అడ్డంకులు.. నేడు ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం..
World Literacy Day
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 08, 2022 | 9:53 AM

World Literacy Day: ప్రతి వ్యక్తి జీవితానికి విద్య ఎంతో వెలుగునిస్తుంది. విద్య అంటే కేవలం పాఠ్యపుస్తకాలు బట్టిపట్టడం కాదు. ఈసమాజంలో బతికేందుకు అవసరమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడం అక్షరాస్యత కిందే వస్తుంది. ఒకరి నుంచి మోసపోకుండా ఉండేందుకు విద్య ఉపయోగపడుతుంది. నేడు నిరక్ష్యరాస్యులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అలాగే త్వరగా మోసపోతూ ఉంటారు. దీనికి కారణం అక్షరాస్యతకు వారు దూరంగా ఉండటమే. దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని కేంద్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయినా.. ఈలక్ష్యానికి అడుగడుగునా అడ్డంకులే. ప్రపంచ వ్యాప్తంగా కూడా అక్షరాస్యత శాతాన్ని పెంచడానికి ఐక్యరాజ్యసమితి అనేక చర్యలు తీసుకుంటోంది. దేశంలో అక్షరాస్యత శాతం చూసుకున్నట్లయితే ప్రస్తుతం 74.04 అక్షరాస్యత శాతం ఉండగా.. వీరిలో పురుషుల అక్షరాస్యత శాతం 82.14 కాగా, 65.46% మహిళల అక్షరాస్యతగా ఉంది. దేశంలో 93.91 అక్షరాస్యత శాతంతో కేరళ మొదటిస్థానంలో ఉండగా, 92.28 శాతంతో లక్షద్వీప్ తర్వాతి స్థానంలో ఉంది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో 91.58% అక్షరాస్యత ఉంది. ఇక 63.82 శాతంతో బీహార్ అక్షరాస్యతలో చివరిస్థానంలో ఉండగా.. అరుణాచల్ ప్రదేశ్ 66.95%, రాజస్థాన్ 67.06%గా అక్షరాస్యత ఉంది.

2030 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని కేంద్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే విద్యా రంగంలో నెలకొన్న సవాళ్లతో పాటు కరోనా మహమ్మారి కారణంగా ఈలక్ష్యానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. మరోవైపు ప్రజల్లో విద్యపై అవగాహన పెంచడానికి ఐక్యరాజ్యసమితి ప్రతీ ఏడాది సెప్టెంబర్‌ 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాది ట్రాన్స్ ఫార్మింగ్ లిటరసీ లెర్నింగ్ స్పేసెస్ ఇతివృత్తంతో ఈఏడాది ప్రపంచ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుతోంది. 1966 నుంచి విద్యపై విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రపంచ నిరక్షరాస్యుల్లో 34% మంది భారత్‌లోనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా తర్వాత 2.4 కోట్ల మంది తిరిగి పాఠశాలల్లో చేరలేదు. వారిలో 1.1 కోట్ల మంది అమ్మాయిలున్నారు. కరోనా ప్రభావం, లాక్‌డౌన్లతో దేశంలో 15లక్షల స్కూళ్లు మూత పడ్డాయని, 24.7 కోట్ల విద్యార్థులు ఏడాది పాటు చదువుకి దూరమయ్యారని యునెస్కో వెల్లడించింది. తర్వాత కూడా 30%మంది విద్యార్థులు తిరిగి పాఠశాలల్లో చేరలేదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. సంపూర్ణ అక్షరాస్యత మినహిస్తే.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అక్షరాస్యతలో భారత్ గణనీయమైన పురగోతి సాధించింది.

ఏడేళ్ల వయసు కంటే ఎక్కువ ఉన్న వారు ఏదో ఒక భాషలో చదవడం, రాయడం వస్తే వారిని అక్షరాస్యులుగా పరిగణిస్తారు. 1951లో 18.3% ఉన్న అక్షరాస్యత రేటు 2022 వచ్చేసరికి 77.7శాతానికి పెరిగింది. మొదట్లో అక్షరాస్యతలో లింగ వివక్ష అధికంగా ఉండేది. దానిని కూడా క్రమక్రమంగా దాటుకుంటూ వస్తున్నప్పటికీ అమ్మాయిల్లో అక్షరాస్యత ఇంకా పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1961లో కేవలం 15.4% మంది మహిళలు అక్షరాస్యులైతే ఆ తర్వాత పదేళ్లకి 1971లో 22% 2001 నాటికి 53.7% , 2022 నాటికి 70శాతం మహిళలు అక్షరాస్యులయ్యారు. అన్నింటికంటే మైనార్టీ విద్యార్థుల్లో డ్రాప్‌అవుట్‌లను నివారించడంలో భారత్‌ కొంతమేరకు విజయం సాధించింది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం 2015–16లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు దాదాపుగా 9% ఉన్న డ్రాపవుట్లు 2020–21కి 0.8శాతానికి తగ్గాయి. ప్రాథమిక పాఠశాలలు 10 రెట్లు పెరిగాయి. గ్రామీణ నిరుపేదలకు స్కూళ్లు అందుబాటులో ఉండకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమంది విద్యకు దూరంగా ఉంటున్నారు. 2030 లోపు సంపూర్ణ అక్షరాస్యత సాధించాంటే ప్రభుత్వాలు సమిష్టిగా మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..