Andhra Pradesh: వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా పర్వాలేదంటే ఇదేనేమో.. నంద్యాల జిల్లాలో వైసీపీ నాయకుడి నిర్వాకం..?

అధికార పార్టీలో ఉంటే మనం ఏం చేసినా చెల్లుంతుదిలే అనుకుంటారు నాయకులు.. మనల్ని అడిగేవారు ఎవరుంటారులే అనే ధైర్యంతో చాలా మంది ఖాళీ స్థలాలను కబ్జా చేయడం సాధారణంగా చూస్తుంటాం. కాని ప్రభుత్వ కార్యాలయాలు..

Andhra Pradesh: వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా పర్వాలేదంటే ఇదేనేమో.. నంద్యాల జిల్లాలో వైసీపీ నాయకుడి నిర్వాకం..?
School Building
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 10, 2022 | 5:30 PM

Andhra Pradesh: అధికార పార్టీలో ఉంటే మనం ఏం చేసినా చెల్లుంతుదిలే అనుకుంటారు నాయకులు.. మనల్ని అడిగేవారు ఎవరుంటారులే అనే ధైర్యంతో చాలా మంది ఖాళీ స్థలాలను కబ్జా చేయడం సాధారణంగా చూస్తుంటాం. కాని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల భవనాల జోలికి మాత్రం వెళ్లరు. ఎందుకంటే విషయం ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్తే మందలిస్తారనే ఉద్దేశంతో పరిధులు దాటి ప్రవర్తించరు. పరిధి దాటి ప్రవర్తించారంటే వారికి మంత్రులో లేదా అంతకంటే పెద్దవాళ్ల అండదండలుండాలి. మరి ఎవరి అండ ఉందో తెలీదు గానీ ఓ నాయకుడు ఏకంగా పాఠశాల భవనాన్ని ఇంటిగా మార్చేసుకున్నారు. ఇదెక్కడో కాదు.. ఆంధ్రప్రదేశ్‌ లోని నంద్యాల జిల్లా పాణ్యం పట్టణంలోని ఇందిరానగర్ లో మూతపడిన పాఠశాల భవనాన్ని ఓ పార్టీకి చెందిన నాయకుడు తన నివాసంగా మార్చుకున్నారు. రాజీవ్ విద్యా మిషన్ నిధులు రూ.5,30000తో పాఠశాలను నిర్మించారు. అయితే ఈపాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య తక్కువుగా ఉండటంతో ఇక్కడి పాఠశాల విద్యార్థులను వేరే పాఠశాలకు మార్చారు. దీంతో ఐదేళ్ల క్రితం పాఠశాలను మూసివేశారు. దీంతో ఎలాగూ పాఠశాల ఉపయోగంలో లేకపోవడంతో అధికారపార్టీ నాయకుల అండదండలతో స్థానిక వైసీపీ నేత  ఒకరు ఈపాఠశాల భవనాన్ని ఆక్రమించుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.  పాఠశాల శిలాఫలకం, బోర్డు తొలగించి తన ఇంటిగా మార్చుకున్నాడు. రెండు పడక గదులు, వంట గది, హాలు, బయట బాత్‌రూమ్‌లు, మెట్లు నిర్మించారు. ఇంత జరుగుతున్నా స్థానిక అధికారులు మాత్రం మౌనవ్రతం పాటిస్తూ వచ్చారు.

ఈవిషయం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. నాడు-నేడు పేరుతో పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నాం.. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో.. వైసీపీ ప్రభుత్వంలో నాడు-నేడు అంటూ పాఠశాలను ఇంటిగా మార్చుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. విద్యార్థులు లేకపోతే వారిని పాఠశాలకు రప్పించేందుకు కృషి చేయాల్సిన ప్రభుత్వం.. పాఠశాల భవనాన్ని వైసీపీ నాయకుడు కబ్జా చేసినా చూసీచూడనట్లు వదిలేయడాన్ని చంద్రబాబు నాయుడు తప్పుబట్టారు. దీంతో పాఠశాల భవనం కబ్జా విషయం కలకలం రేపింది. స్థానిక సర్పంచి పల్లవి బంధువులే పాఠశాల భవనాన్ని ఆక్రమించి నివాసంగా మార్చుకున్నారనే విమర్శలు వస్తున్నాయి.

పాఠశాల భవనాన్ని ఆక్రమించుకుని.. ఇంటిగా మార్చుకుంటున్నారని అధికారులకు తెలిసినా పట్టించుకోవలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈవిషయం వెలుగులోకి రావడంతో స్థానిక ఎంఇవో ఈపాఠశాల భవనానికి తాళం వేయించారు. మొత్తం మీద కబ్జాకు కాదేది అనర్హం అన్నట్లుగా ఏకంగా పాఠశాల భవనాన్నే ఆక్రమించుకోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు స్థానికులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..