Nirmala Sitharaman: రేపు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులతో కేంద్ర మంత్రి సీతారామన్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులతో సమావేశం కానున్నారు.
Nirmala Sitharaman Meet: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులతో సమావేశం కానున్నారు. దేశ వృద్ధికి ఊతమిచ్చేలా సంస్కరణల ఆధారిత వ్యాపార వాతావరణాన్ని సృష్టించి పెట్టుబడులను ఆకర్షించే మార్గాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. నవంబర్ 15న జరిగే ఈ వర్చువల్ సమావేశంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రులు పంకజ్ చౌదరి, భగవత్ కరాద్ కూడా పాల్గొంటారని ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక కార్యదర్శులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
పెట్టుబడులను పెంచేందుకు అనువైన పర్యావరణ వ్యవస్థను రూపొందించడం ఈ సమావేశంలో చర్చనీయాంశం అవుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతే కాకుండా వృద్ధిని ప్రోత్సహించే చర్యలు, సంస్కరణలు, పెట్టుబడి ప్రోత్సాహం మరియు సంస్కరణ ఆధారిత వ్యాపార వాతావరణాన్ని సృష్టించడం వంటి అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.కరోనా మహమ్మారి రెండు విడతలుగా విరుచుకుపడి దేశం వ్యాప్తంగా కకావికలం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ వేగంగా పునరుద్ధరణ, మూలధన వ్యయాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల మధ్య ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
Union Finance Minister Smt. @nsitharaman will interact with all Chief Ministers and State Finance Ministers; and Lt. Governors of UTs tomorrow, 15th November 2021, at 03.00 PM through virtual conference. #Growth #Investments #TeamIndia (1/3) pic.twitter.com/7e0wU2KIS8
— Ministry of Finance (@FinMinIndia) November 14, 2021
అంతకుముందు, కేంద్ర ఆర్థిక కార్యదర్శి టివి సోమనాథన్ గత వారం మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయిలో సమస్యలు, అవకాశాలు మరియు సవాళ్లు చర్చకు కేంద్రంగా ఉంటాయి, దీని ద్వారా మనం అధిక పెట్టుబడులు మరియు వృద్ధిని సాధించగలమన్నారు. ప్రభుత్వం మూలధన వ్యయాన్ని భరిస్తోందని, ప్రైవేట్ రంగం నుంచి సానుకూల స్పందన వస్తోందన్నారు. అయితే అది ఇంకా పెద్ద ఎత్తున నిజమైన పెట్టుబడిగా మారలేదని కార్యదర్శి చెప్పారు. అయితే, మూలధన వ్యయం భారీ పెట్టుబడికి మరింత తోడ్పాటు అవసరమన్నారు.
గత ఆర్థిక సంవత్సరంలో 2020-21లో, కోవిడ్-19 మహమ్మారి కారణంగా, భారత ఆర్థిక వ్యవస్థలో 7.3 శాతం క్షీణత నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 20.1 శాతం చొప్పున వృద్ధి చెందింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో 64 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) దేశంలోకి వచ్చాయి.