ఇండియాకు రానున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ..! ఎందుకంటే..?
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ త్వరలో భారతదేశాన్ని సందర్శించే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. గతంలో ప్రధానమంత్రి మోదీ ఆయనను ఆహ్వానించారు. ఈ పర్యటన భారత్-ఉక్రెయిన్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఈ ఏడాది చివరలో భారత్‌కు రానున్నారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ త్వరలో భారతదేశాన్ని సందర్శించే అవకాశం ఉందని సమాచారం. ఆయన పర్యటన తేదీని నిర్ణయించేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు ఆ దేశ రాయబారి ఒలెక్సాండర్ పోలిష్‌చుక్ తెలిపారు. గత ఏడాది ఆగస్టులో కైవ్‌ను సందర్శించిన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెలెన్స్కీని భారతదేశానికి ఆహ్వానించారు.
“భారత్, ఉక్రెయిన్ మధ్య భవిష్యత్తు వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి ప్రకటనకు సంబంధించి, నన్ను నమ్మండి, మాకు దానికి అవకాశం ఉంది. భారత ప్రధానమంత్రి జెలెన్స్కీని భారతదేశానికి రమ్మని ఆహ్వానించారు. ఇరుపక్షాలు దీనిపై కృషి చేస్తున్నాయి. అధ్యక్షుడు జెలెన్స్కీ కచ్చితంగా భారతదేశంలో ఉంటారని మేం ఆశిస్తున్నాం. ఇది మా ద్వైపాక్షిక సంబంధంలో గొప్ప విజయం అవుతుంది. కచ్చితమైన తేదీపై మేం అంగీకరించడానికి ప్రయత్నిస్తున్నాం” అని ఇండియాలోని ఉక్రెయిన్ రాయబారి వెల్లడించారు.
మరోవైపు ఈ ఏడాది చివరి నాటికి రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశాన్ని సందర్శించనున్నారు. ఈ నెల ప్రారంభంలో రష్యా పర్యటన సందర్భంగా జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ , రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఏడాది చివరి నాటికి భారతదేశాన్ని సందర్శిస్తారని ధృవీకరించిన తర్వాత ఈ జెలెన్స్కీ పర్యటన తెరపైకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై 50 శాతం సుంకాలు విధించడం వల్ల భారత్ రష్యా, చైనాలకు దగ్గరవుతున్న తరుణంలో పుతిన్ భారత పర్యటన చాలా కీలకంగా మారనుంది. ఈ సమయంలోనే ఆర్‌ఐసి త్రయం తిరిగి పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ఉక్రెయిన్‌లో శాంతి కోసం ప్రధాని మోదీ ఒత్తిడి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి కోసం వాదిస్తూ “ఇది యుద్ధ యుగం కాదు” అని నొక్కి చెప్పారు. ఆయన పుతిన్, జెలెన్స్కీ ఇద్దరితో కూడా టెలిఫోన్ సంభాషణలు జరిపారు. భారతదేశం రెండు దేశాల మధ్య శాంతిని కోరుకుంటుందని వెల్లడించారు. భారత్ కూడా అలాస్కాలో పుతిన్, ట్రంప్ మధ్య జరిగిన శిఖరాగ్ర సమావేశాన్ని స్వాగతించింది , “శాంతి సాధనలో వారి నాయకత్వం చాలా ప్రశంసనీయం” అని పేర్కొంది. “శిఖరాగ్ర సమావేశంలో సాధించిన పురోగతిని భారతదేశం అభినందిస్తుంది. చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే ముందుకు సాగవచ్చు. ఉక్రెయిన్‌లో వివాదానికి త్వరిత ముగింపును ప్రపంచం చూడాలనుకుంటోంది” అని ఆగస్టు 16న విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఒక ప్రకటనలో తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
