Tamil Nadu: చిన్న స్టాలిన్‌కు పెద్ద ఎలివేషన్.. డిప్యూటీ సీఎంగా ఉదయనిధికి ప్రమోషన్
సన్ రైజ్ పార్టీలో సన్ రైజ్ స్టోరీ. అధికార DMK డైరెక్షన్‌లో పొలిటికల్ యాక్షన్ మూవీ స్టార్ట్. డిప్యూటీ సీఎం ఉదయ నిధి హీరోగా ముహూర్తం క్లాప్ కొట్టేశారు. తమిళనాడు పొలిటికల్ బాక్సాఫీస్ తెరపై సూపర్ స్టార్ విజయ్‌ను ఎదుర్కొనే అస్త్రం వెనుక అసలు కహానీ ఏంటి? టార్గెట్ 2026 ఎలక్షన్స్‌లో, చిన్న స్టాలిన్ రాజకీయ కలెక్షన్స్ రాబడతారా?
అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా స్టోరీ. తండ్రీ కొడుకు ఓ తమిళనాడు…పొలిటికల్ స్టోరీ ఇది. సినిమాను మించిన మాస్ మసాలా సీన్లు, ట్విస్టులతో పొలిటికల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు, తమిళ రాజకీయ వెండి తెరపై మంటలు పుట్టించే రియల్ పొలిటికల్ మూవీ స్టార్టయింది. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. సినిమా సూపర్ స్టార్‌ను సినిమా స్టార్ కమ్ పొలిటీషయన్‌తోనే ఎదుర్కోవాలి. ఇదే అస్త్రం, ఇదే వ్యూహంతో అధికార డీఎంకే పొలిటికల్ మూవీ స్టార్టయింది.
ఉదయనిధితో విజయ్‌కు కౌంటర్
తమిళ్ సూపర్ స్టార్, తలపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఆల్రెడీ గ్రాండ్‌గా పార్టీ స్టార్టయింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు తమిళగ వెట్రి కళగం కసరత్తులు చేస్తోంది. టీవీకే పార్టీ జెండా ఎగరేసి సీఎం సీట్లో కూర్చునేందుకు విజయ్ వ్యూహాలు పన్నుతున్నారు. అయితే దీనికి కౌంటర్ ప్లాన్ రెడీ చేసింది డీఎంకే. 2026లో విజయ్‌ను ఎదుర్కొనేందుకు తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధిని రంగంలోకి దించే వ్యూహం సిద్ధం చేసింది. ఉదయనిధి సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. ఇటు పొలిటికల్‌గా కూడా ఫామ్‌లో ఉన్నారు. స్టాలిన్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న ఆయన…సనాతన ధర్మం మీద నెగటివ్ కామెంట్లతో ఆమధ్య కాక రేపారు. అలా ముందుకుపోతూ…నలుగురి నోళ్లలో తన పేరు నానేలా చూసుకుంటున్నారు జూనియర్ స్టాలిన్.
చిన్న స్టాలిన్‌కు పెద్ద ఎలివేషన్
అయితే విజయ్‌ని ఢీ కొట్టాలంటే చిన్న స్టాలిన్‌కు పెద్ద ఎలివేషన్ ఉండాలి. పొలిటికల్ సిల్వర్ స్క్రీన్ మీద సూపర్ స్టార్ విజయ్‌తో తల పడాలంటే…హీరోగా జూనియర్ స్టాలిన్ స్టామినా సరిపోదు. దీంతో ఆయనకు కేబినెట్ మంత్రి నుంచి డిప్యూటీ సీఎంగా పొలిటికల్ ఎలివేషన్ ఇచ్చారంటున్నాయి చెన్నై వర్గాలు. ఈ భారీ ఎలివేషన్‌తో విజయ్‌తో 2026లో ఢీ అనేందుకు ఉదయనిధి ఉవ్విళ్లూరుతున్నారని తమిళ పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్.
నలుగురికి చోటు, ముగ్గురికి ఉద్వాసన
దీనిలో భాగంగానే తమిళనాడులో కేబినెట్ విస్తరణ జరిగిందంటోంది మద్రాస్ పొలిటికల్ టాకీస్. డీఎంకే ముందుచూపు వ్యూహంలోనే భాగంగా డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్‌ను ప్రమోట్ చేశారని చెబుతున్నారు. ఇక స్టాలిన్ మంత్రివర్గంలో కొత్తగా నలుగురికి చోటు దక్కింది. ముగ్గురికి ఉద్వాసన పలికారు. ఆరుగురు మంత్రుల శాఖలను మార్చారు సీఎం స్టాలిన్. మంత్రిగా సెంథిల్ బాలాజీ ప్రమాణం చేశారు. మనీ లాండరింగ్ కేసులో జైలు పాలైన సెంథిల్ బాలాజీ….రెండు రోజుల క్రితమే జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం డీఎంకే రెడీ అవుతోంది. దీనిలో భాగంగానే తన కుమారుడికి స్టాలిన్ ప్రమోషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..