మారుతిమల కొండపై నుంచి దూకిన ఇద్దరు 9వ తరగతి బాలికలు.. సూసైడ్ నోట్‌లో షాకింగ్ విషయాలు!
Kerala school girls suicide Case: రాష్ట్రంలోని కొల్లంలోని మారుతిమల కొండపై నుంచి దూకిన ఇద్దరు స్కూల్ విద్యార్ధినుల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పెరింగనాడ్‌లోని త్రిచెనమంగళంలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మీను, శివర్ణ అనే ఇద్దరు బాలికలు సూసైడ్ నోట్ రాసి, ఆత్మహత్యకు పాల్పడ్డారు..

కొల్లం, అక్టోబర్ 19: కేరళ రాష్ట్రంలోని కొల్లంలోని మారుతిమల కొండపై నుంచి దూకిన ఇద్దరు స్కూల్ విద్యార్ధినుల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పెరింగనాడ్‌లోని త్రిచెనమంగళంలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మీను, శివర్ణ అనే ఇద్దరు బాలికలు సూసైడ్ నోట్ రాసి, ఆత్మహత్యకు పాల్పడ్డారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు అబద్ధం చెప్పి ఇంటి నుండి వెళ్లిపోయారు. పాఠశాలలో జరుగుతున్న కల్చరర్ ప్రొగ్రామ్‌లో పాల్గొంటున్నామని ఇద్దరు తమ ఇళ్లల్లో చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇందులో శివర్ణ తిరువతిర పోటీలో పాల్గొంటున్నానని చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తె కళా ప్రదర్శనను చూడటానికి పాఠశాలకు వచ్చారు. కానీ ఎంత వెతికినా బాలిక కనిపించలేదు. శివర్ణ గురించి తోటి క్లాస్‌మేట్స్‌ను ప్రశ్నించగా.. ఇక్కడే ఎక్కడో ఉందని వారు చెప్పారు. దీంతో బాలిక తల్లిదండ్రులు మరికాసేపు వెయిట్ చేశారు. కానీ సమయం గడిచేకొద్దీ వారి కుమార్తె ఎంతకూ కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు టీచర్లను సంప్రదించారు. దీంతో శివర్ణతోపాటు మీను అనే మరో విద్యార్ధిని కూడా కనిపించనట్లు పాఠశాల యాజమన్యం గుర్తించింది. ఇద్దరు అమ్మాయిల మిస్సింగ్ వార్త దావానలంలా క్షణాల్లో వ్యాపించింది. మీను దగ్గర ఫోన్ ఉంది. కానీ ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో అదే రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బాలికల తల్లిదండ్రులు అదూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొల్లంలోని పూయప్పల్లిలో ఓ టవర్ వద్ద పోలీసులకు సిగ్నల్ దొరికింది.
అక్కడికి వెళ్లి చూడగా ఇద్దరు బాలికలు కొండపై నుంచి దూకినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో మీను అక్కడికక్కడే మృతి చెందగా.. శివర్ణ గాయాలతో బయటపడింది. ఆమెను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం నాటికి శివర్ణను మెడికల్ కాలేజీకి తరలించారు. మృతి చెందిన మీను ఇదే పాఠశాలలో ఒకటవ తరగతి నుండి చదువుతుంది. శివర్ణ ఏడాది క్రితమే ఆ పాఠశాలలో చేరింది. ఇంట్లో, పాఠశాలలో వారిద్దరి ప్రవర్తనలో ఎవరూ అసాధారణంగా ఏమీ గమనించలేదు. వారి ప్రవర్తనలో ఎటువంటి మార్పు కన్పించలేదని పాఠశాల కౌన్సెలర్ కూడా చెప్పాడు.
సాధారణంగా మారుతిమల పర్యాటక ప్రాంతం కావడంతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అందుకే సంఘటన జరిగిన రోజు ఇద్దరు అమ్మాయిలు ప్రమాద ప్రాంతంలోకి ఎక్కడం ఎవరూ గమనించలేదు. సముద్ర మట్టానికి దాదాపు వెయ్యి అడుగుల ఎత్తులో ఉన్న కన్నడిపర కొండపైకి ఇద్దరూ ఎక్కారు. భద్రతా కంచె దాటడం సమీపంలో ఉన్నస్థానిక నివాసి విష్ణుదత్ చూశాడు. అనుమానం వచ్చిన అతడు వారిద్దరి చర్యను రికార్డ్ చేసి, పూయప్పల్లి పోలీసులకు సమాచారం అందించాడు. అయితే వారిని రక్షించడానికి ప్రయత్నించేలోపు, అమ్మాయిలు కొండపై నుంచి దూకేశారు. ఈ సంఘటన సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో జరిగింది. సమీపంలోని నివాసితులు, పోలీసులు పైకి పరుగెత్తినప్పటికీ శివర్ణను మాత్రమే వారు రక్షించగలిగారు. మీను అక్కడికక్కడే మరణించింది. అక్కడ దొరికిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు బాలికలు ఇలా ప్రవర్తించడానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని, పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తమకు భరించలేని దారుణం జరిగినట్లు అందులో పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. బాలికలు సూసైడ్ నోట్‌లో తాము భరించలేనిది ఒక విషయం జరిగిందని రాసినట్లు అడూర్ స్టేషన్ SHO శామ్ మురళి తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




