దారుణాలు.. ఇద్దరు బాలికలపై 8 మంది అత్యాచారం.. మరో చోటు భర్త ముందే భార్యపై అత్యాచారం.. నిందితుల అరెస్టు
మహిళలు, బాలికలపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. దారుణాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా మానవ మృగాళ్లలో తీరు మారడం లేదు...
మహిళలు, బాలికలపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. దారుణాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా మానవ మృగాళ్లలో తీరు మారడం లేదు. తాజాగా త్రిపురలో జరిగిన ఘటన కలకలం రేపుతోంది. ఖౌవాయి జిల్లాలో అమానుషం జరిగింది. ఇద్దరు బాలికలపై ఎనిమిది మంది యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఖటియాబరి ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలికలు.. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లారు. కొంతదూరం వెళ్లక మరో ఆరుగురు వేరే వాహనాలపై వచ్చిన వారిని కలిశారు. అంతా కలిసి రాత్రి ఏడున్నర సమయంలో బాలికలను దట్టమైన అడవిలోకి తీసుకెళ్లారు. ఇక్కడ సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితులు అపస్మారక స్థితిలోకి వెళ్లగా, భయపడిన నిందితులు పరారయ్యారు. విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు పోలీసులతో ఘటన స్థలానికి వెళ్లారు. అనంతరం వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అందులో ఒక బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటన సోమవారం జరిగింది. అయితే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 24 గంటల్లోనే నిందితులను అరెస్టు చేశారు. మంగళవార అరెస్టు చేసిన పోలీసులు.. వీరిపై బుధవారం ప్రత్యేక పోలీసు బృందాలు విచారణ జరిపాయి.
యూపీలో మరో దారుణం
కాగా, ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలో మరో దారుణం చోటు చేసుకుంది. ఒక వివాహితపై ఆమె భర్త ఎదుటే ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై పుట్టింటికి వెళ్తుండగా ఫ్మాడ్‌పుర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు అటకాయించి భర్త ఎదుటే భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారు. నగలు, నగదు దోచుకుని పరారయ్యారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి
కాగా, ఇద్దరు బాలికలపై ఎనిమిది మంది అత్యంత దారుణానికి పాల్పడటంతో రాష్ట్ర ప్రజలు భగ్గుమంటున్నారు. నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి దారుణాలు దేశంలో చాలానే జరుగుతున్నాయి. అయినా ఇలాంటి కామాంధుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా.. ఇలాంటి మానవమృగాళ్లకు బుద్ది రావడం లేదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.