Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mamata Banerjee: బెంగాల్ టూ గోవా.. మమతా బెనర్జీ నయా ప్లాన్.. వర్కౌట్ అవుతుందా?

తృణమూల్ కాంగ్రెస్.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాజకీయ పార్టీ.. ఇప్పుడు జాతీయ రాజకీయాలపై కన్నేసింది. రాష్ట్రం వెలుపల పార్టీని విస్తరిస్తూ.. 2024 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా బలమైన ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటుచేసే లక్ష్యంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

Mamata Banerjee:  బెంగాల్ టూ గోవా.. మమతా బెనర్జీ నయా ప్లాన్.. వర్కౌట్ అవుతుందా?
Mamata Banerjee
Follow us
Janardhan Veluru

| Edited By: Anil kumar poka

Updated on: Dec 23, 2021 | 6:29 PM

తృణమూల్ కాంగ్రెస్.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాజకీయ పార్టీ.. మమతా బెనర్జీ సారథ్యంలోని ఆ పార్టీ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై కన్నేసింది. రాష్ట్రం వెలుపల పార్టీని విస్తరిస్తూ.. 2024 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా బలమైన ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటుచేసే లక్ష్యంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కేవలం ఒక రాష్ట్రానికే పరిమితమైన పార్టీకి జాతీయస్థాయిలో చక్రం తిప్పుతూ మిగతా ప్రాంతీయపార్టీలను కలుపుకుపోయే పరిస్థితి ఉండదు. అందుకే టీఎంసీని బెంగాల్ రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేయకుండా, దేశమంతటా విస్తరించేందుకు అధినేత్రి మమత బెనర్జీ అడుగులు వేస్తున్నారు. బీజేపీ జైత్రయాత్రకు అడ్డుకట్ట వేస్తూ బెంగాల్‌లో వరుసగా మూడోసారి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మమత, ఆ మరుక్షణం నుంచే బీజేపీకి వ్యతిరేక కూటమి ప్రయత్నాలు ప్రారంభించారు. అనేక ప్రాంతీయ పార్టీల నేతలతో మంతనాలు సాగించారు. ప్రజల్లో బలమైన ఇమేజ్ సాధించుకున్న మోదీకి దీదీ (మమత బెనర్జీ)యే ధీటైన ప్రత్యర్థి అన్న భావన కల్గించేందుకు ప్రయత్నించారు. తన సారథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియాతోనూ భేటీ అయ్యారు. అయితే అర్థ శతాబ్దానికి పైగా యావద్దేశాన్ని పరిపాలించి, దేశ రాజకీయాలను శాసించిన పార్టీ.. ప్రస్తుతం ఎంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పటికీ.. తమ స్థాయి తగ్గించుకుని దీదీ నేతృత్వంలోని జట్టులో చేరేందుకు ససేమిరా అంగీకరించలేదు. అంతేకాదు, బెంగాల్ దాటి బయట ఉనికే లేని పార్టీ మిగతా రాష్ట్రాల్లో ఏం ప్రభావం చూపుతుందనే ప్రశ్నను సైతం మమత ఎదుర్కొన్నట్టు తెలిసింది. ప్రాంతీయ పార్టీలను ఒక దండలో పేర్చగలిగే ‘దారం’లా కాంగ్రెస్ తప్ప మరే పార్టీ ఉండలేదని చెప్పినట్టు తెలిసింది. అంతే.. ఒకింత అవమానభారం మమతను వెంటాడింది. సీన్ కట్ చేస్తే…

ఆపరేషన్ ఆకర్ష్.. జాతీయపార్టీగా అన్ని రాష్ట్రాల్లోనూ ఉనికి కల్గిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతూ.. అదే సమయంలో తానూ ఎదగాలని మమత బెనర్జీ భావించారు. ఆ క్రమంలో ఆలిండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సుస్మితా దేవ్‌పై ఆకర్ష్ అస్త్రాన్ని ప్రయోగించారు. అంతే.. అంత పెద్ద పార్టీకి జాతీయస్థాయిలో మహిళా విభాగం అధ్యక్ష పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, వెంటనే తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిపోయారు. చేరిన నెల లోపే సుస్మితను రాజ్యసభకు మమత నామినేట్ చేశారు. బీజేపీ పోటీగా ఎవరినీ దింపకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అస్సాంలోని సిల్చార్ ప్రాంతం నుంచి గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభకు ఎన్నికైన సుస్మితకు ఆ పక్కనే ఉన్న త్రిపుర రాష్ట్ర బాధ్యతలు అప్పగించారు. బెంగాల్ తర్వాత బెంగాలీ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం త్రిపుర. ఆ మాటకొస్తే ఈశాన్య రాష్ట్రాల్లో బెంగాలీల ప్రాబల్యం ఎక్కువగానే ఉంటుంది. సుస్మిత చేరికతో అటు అస్సాం, ఇటు త్రిపుర రాష్ట్రాల్లో తృణమూల్ కాంగ్రెస్ విస్తరణకు బలమైన ఆయుధం దొరికినట్టయింది.

ఈస్ట్ టూ వెస్ట్.. మమత ఈజ్ బెస్ట్.. అవిభాజ్య బెంగాల్‌‌కు ఆనుకున్న అస్సాం, త్రిపుర రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో తృణమూల్ కాంగ్రెస్ విస్తరణకు సహజంగానే అవకాశాలున్నాయి. కానీ ఇప్పుడు ఏకంగా తూర్పు నుంచి పశ్చిమాన ఉన్న గోవా తీరం మమత లాంగ్ జంప్ చేస్తున్నారు. గోవా మాజీ సీఎం, ప్రస్తుత ఎమ్మెల్యే (కాంగ్రెస్) లూజినో ఫెలిరోపైనే గురిపెట్టారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, త్వరలో టీఎంసీలో చేరేందుకు అంతా సిద్ధం చేసుకున్న ఫెలిరో.. బీజేపీని ఎదుర్కోవాలంటే కావాల్సింది మమత బెనర్జీలాంటి స్ట్రీట్ ఫైటర్సేనని వ్యాఖ్యానించారు. ఫెలిరో ద్వారా త్వరలో జరగబోయే గోవా ఎన్నికల్లో తృణమూల్ అడుగుపెడుతోంది. ‘ఈస్ట్ ఆర్ వెస్ట్, మమత ఈజ్ బెస్ట్’ అనే భావనను విస్తరించే ప్రయత్నం చేస్తోంది.

టార్గెట్ కాంగ్రెస్.. కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీని పెట్టుకున్న మమత బెనర్జీ.. కొన్ని దశాబ్దాల కఠోర శ్రమతో బెంగాల్ రాజకీయాలను శాసించే స్థాయికి చేరారు. వరుసగా మూడుసార్లు గెలిచి రాష్ట్రాన్ని పాలిస్తున్న ఆమె, ఇక బెంగాల్ దాటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని విస్తరించే క్రమంలో కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు నిర్వహించిన సుస్మిత దేవ్, లూజినో ఫెలిరో ఇప్పటికే ఆ పార్టీకి గుడ్ బై చెప్పగా.. మిగతా రాష్ట్రాల్లోనూ బలమైన కాంగ్రెస్ నేతలనే మమత టార్గెట్ చేసి, ఆకర్ష్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ను వీడి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరడానికి నేతలకు సిద్ధాంతం, భావజాలం పరంగా ఇబ్బందులు ఉండవు. పైగా, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఎన్నికలు ఎదుర్కొని ఘోర పరాజయం పాలవడంతో, ఆయనపై సొంత పార్టీలోనే చాలా మంది నేతలకు గురి కుదరడం లేదు. బెంగాల్‌లో బీజేపీని నిలువరించిన మమతపై బీజేపీని వ్యతిరేకించేవారిలో క్రమక్రమంగా గురి కుదురుతోంది. ఇదే తృణమూల్‌కు కలిసొచ్చే అంశంగా మారింది.

– మహాత్మ కొడియార్, టీవీ9 తెలుగు, ఢిల్లీ బ్యూరో

Also Read..

Bathukamma in UK: అక్టోబర్ 10న లండన్‌లో మెగా బతుకమ్మ వేడుకలు.. పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ  కవిత

Chinmayi Sripaada: పెళ్లయ్యాక మగాడు నటించవచ్చు.. కానీ అమ్మాయి నటించకూడదా ?.. సంచలన వ్యాఖ్యలు చేసిన సింగర్..