AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా భయాలు – వివిధ రాష్ట్రాల్లో ఆంక్షలు, కర్ఫ్యూ, లాక్‌డౌన్‌.. ఏయే రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు ఉన్నాయంటే..!

Night Curfew: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో రోజుకు రెండున్నర లక్షలకుపైగా కొత్త కేసులు....

కరోనా భయాలు - వివిధ రాష్ట్రాల్లో ఆంక్షలు, కర్ఫ్యూ, లాక్‌డౌన్‌.. ఏయే రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు ఉన్నాయంటే..!
Night Curfew
Subhash Goud
|

Updated on: Apr 20, 2021 | 3:07 PM

Share

Night Curfew: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో రోజుకు రెండున్నర లక్షలకుపైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించే ఆలోచన లేదని కేంద్రం చెబుతోంది. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే బాధ్యతలను రాష్ట్రాలకే అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు. దాదాపు 18 రాష్ట్రాలలో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నాయి. తెలంగాణలో ఏప్రిల్‌ 20 నుంచి ఏప్రిల్‌ 30వ తేదీ వరకు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే కర్ఫ్యూ నుంచి పెట్రోల్‌ బంక్‌లు, మీడియా, అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఇచ్చారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్‌ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సంస్థలు, దుకాణాలు, కంపెనీలు షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్లు రాత్రి 8 గంటలకే మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఢిల్లీలో కూడా నైట్‌ కర్ఫ్యూ విధించారు. ముందుగా ఏప్రిల్‌ 6 నుంచి 30వ తేదీ వరకు రాత్రి పూట కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం కేసులు పెరిగిపోవడంతో నిన్నటి నుంచే వారం రోజుల లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

ఢిల్లీలో…

ఏప్రిల్‌ 19 రాత్రి నుంచి 25వ తేదీ వరకూ ఢిల్లీలో లాక్‌డౌన్‌, అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఇచ్చారు. రంజాన్‌ మాసం సందర్భంగా మర్కజ్‌లో నమాజుకు 50 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు.

మహారాష్ట్రలో…

ఇక మహారాష్ట్రలో కేసుల తీవ్రత ఎక్కువవుతోంది. కరోనా జాబితాలో దేశంలో మహరాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఏప్రిల్‌ 5 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తోంది మహారాష్ట్ర ప్రభుత్వం. అలాగే శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకూ వీకెండ్‌ లాక్‌డౌన్‌ అమలు చేస్తోంది. పరిస్థితులు మారకపోతే త్వరలో లాక్‌డౌన్‌ విధించే అవకాశం కూడా ఉందన్న ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి స్పష్టం చేశారు.

కేరళ, మణిపూర్‌, తమిళనాడులలో..

ఇక కేరళ, మణిపూర్‌, తమిళనాడు రాష్ట్రాల్లో ఏప్రిల్‌ 20 నుంచి రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. అలాగే పర్యాటక ప్రదేశాలను సైతం మూసివేస్తున్నట్లు ప్రకటించాయి.

బీహార్‌లో..

బీహార్‌ రాష్ట్రంలో నిన్నటి నుంచే రాత్రి కర్ఫ్యూ అమలులోకి తెచ్చిన నితీష్‌ సర్కార్‌.. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్‌ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రకటించింది. మే 15 వరకూ విద్యాసంస్థల మూసివేస్తున్నట్లు నిర్ణయించింది.

రాజస్థాన్‌..

రాజస్థాన్‌లో ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తోంది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. అలాగే 1 నుంచి 9వ తరగతి వరకు స్కూళ్లను మూసివేశారు. మే 3వ తేదీ నుంచి 15 రోజుల పాటు లాక్‌డౌన్‌ తరహా స్వీయ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు స్వచ్చంధంగా పాటించాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.

పంజాబ్‌లో…

ఈనెల 30 వరకు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది పంజాబ్‌ ప్రభుత్వం. రాత్రి 8 నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. అలాగే బార్లు, మాల్స్‌, సినిమా థియేటర్లు, కోచింగ్‌ సెంటర్లు, వ్యాయామ కేంద్రాలు, క్రీడా ప్రాంగణాలను మూతపడ్డాయి. మే 4 వరకూ స్కూళ్లకు సెలవు ప్రకటించింది పంజాబ్‌ ప్రభుత్వం.

హర్యానాలో..

ఏప్రిల్‌ 12 నుంచి రాత్రి పూట కర్ఫ్యూను అమల్లోకి తెచ్చిన హర్యానా ప్రభుత్వం… రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.

ఒడిశా..

రాష్ట్రంలో 10 జిల్లాల్లో ఏప్రిల్‌ 10 నుంచే రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తోంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ విధిస్తోంది.

కర్ణాటకలో..

బెంగళూరుతో పాటు మరో ఆరు నగరాల్లో ఏప్రిల్‌ 10 నుంచి రాత్రి కర్ఫ్యూ విధిస్తోంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ అమలు చేస్తోంది.

ఉత్తరప్రదేశ్‌లో…

ఇప్పటికే 10 జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్న యూపీ సర్కార్‌..యాక్టివ్‌ కేసులు 2 వేలకంటే ఎక్కువ ఉన్న 10 జిల్లాల్లో కర్ఫ్యూ అమలు చేస్తోంది. మే 15 వరకూ పాఠశాలలకు సెలవు ప్రకటించింది. కరోనా ఎక్కువగా ఉన్న ఐదు నగరాల్లో లాక్‌డౌన్‌ అమలు చేయాలని సోమవారం హైకోర్టు ఆదేశించింది. లఖ్‌నవూ, అలహాబాద్‌, వారణాసి, కాన్పూర్‌, గోరఖ్‌పూర్‌ పట్టణాలలో లాక్‌డౌన్‌కు హైకోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ దాఖలు చేసింది.

మధ్యప్రదేశ్‌లో..

ఏప్రిల్‌ 12 నుంచే రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగుతోంది. మూడు జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధిస్తున్నారు. కేసులు తీవ్ర స్థాయిలో ఉండటంతో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ సహా కొవిడ్‌పై పోరుకు అవసరమైన అన్ని వనరులను సమకూర్చుతామన్న సీఎం.. అర్హులైన లబ్దిదారులకు మూడు నెలల పాటు ఉచితంగా రేషన్‌ సరకులు ఇస్తామని వెల్లడించారు.

పశ్చిమబెంగాల్‌లో

రాత్రిపూట కర్ఫ్యూ విధించడానికి ఇష్టపడని మమతా బెనర్జీ.. అసుపత్రుల్లో పడకల సంఖ్యను పెంచడం, ఔషధాల సరఫరా, ఆక్సిజన్‌ అందుబాటులో ఉంచడం, టీకాల సక్రమ నిర్వహణకు అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశారు. ఏప్రిల్‌ 20 నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించింది బెంగాల్‌ ప్రభుత్వం.

గుజరాత్‌లో..

రాష్ట్రంలోని 26 నగరాల్లో ఏప్రిల్‌ 30 వరకూ రాత్రి కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం.. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ ఆంక్షల అమలు ఉంటాయని తెలిపింది.

జమ్మూకశ్మీర్‌లో…

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లోని 8 జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ అమలు కొనసాగుతోంది. రాత్రి 10 నుంచి ఉదయం 8 గంటల వరకు కర్ఫ్యూ ఉండనుంది.

ఉత్తరాఖండ్‌లో…

బీజేపీ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో లక్షలాది మందితో కుంభమేళా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. కుంభమేళా లో కరోనా వ్యాప్తి ప్రమాదంపై దృష్టి సారించని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు.. రోజూ లక్షలాదిమంది పాల్గొన్నారు. ఇప్పటికే వేలాది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మాస్కులు ధరించని వారికి జరిమానా విధిస్తామని తెలిపినా.. ఆ నిబంధనను కూడా భక్తులు పాటించలేదు. కుంభమేళాకు వచ్చిన వారిలో ఇప్పటికే దాదాపు 3వేల మందికి పైగా కరోనా కేసులను గుర్తించారు.

ఇవీ చదవండి: Covid19: కరోనా సెకండ్ వేవ్‌కు ఈ వైరస్సే కారణమా..?.. ప్రభుత్వం చెబుతున్నదేంటి..? పరిశోధకులు చెబుతున్నదేంటి..?

Corona Virus: మహారాష్ట్రలో ఆగని కరోనా ఉధృతి.. లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్న సీఎం థాకరే..