Bird Flu: కేరళలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం.. వేల సంఖ్యలో కోళ్లు, బాతులను చంపేయాలని ఆదేశాలు..
బర్డ్ ఫ్లూ ధాటికి కేరళ వణికిపోతోంది. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ ప్రభావిత ప్రాంతాలతో పాటు కిలోమీటర్ దూరం వరకు పరిధిలో ఉన్న కోళ్లు, బాతులు, పెట్ బర్డ్స్...
బర్డ్ ఫ్లూ ధాటికి కేరళ వణికిపోతోంది. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ ప్రభావిత ప్రాంతాలతో పాటు కిలోమీటర్ దూరం వరకు పరిధిలో ఉన్న కోళ్లు, బాతులు, పెట్ బర్డ్స్ ను చంపేయాలని ఆదేశించింది. కొట్టాయంలోని అర్పూకర, తలయజమ్ పంచాయతీల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. దాదాపు 8 వేల వరకు పక్షులను అధికారులు చంపేయనున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని, క్రిమిసంహారక మందులను చల్లాలని స్థానిక సంస్థలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు పరస్పరం సహకారంతో సహాయక చర్యల్లో పాల్గొనాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల నుంచి కోళ్లు, బాతులు, మాంసం అమ్మకాలు, ఎగుమతులు, దిగుమతులపై నిషేధం విధించారు. చనిపోయిన పక్షుల నమూనాలను భోపాల్ లోని నేషనల్ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్ కు పరీక్షల కోసం పంపించారు.
బర్డ్ ఫ్లూ ఎఫెక్టెడ్ ఏరియాల్లో పది కిలోమీటర్ల పరిధిలో కోళ్లు, బాతులు,పక్షులు, ఇతర పెంపుడు పక్షుల, కోడి, బాతు గుడ్లు, మాంసం సహా సేంద్రీయ ఎరువుల క్రయ విక్రయాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు ఉన్నతాధికారులు. ఎట్టుమనూర్, కొట్టాయం, వైకోమ్, మున్సిపాలిటీల స్థానిక స్వపరిపాలన సంస్థలు.. వేచూర్, తలయోలపరంబు, కల్లార, కురుప్పంతర, తలయాజ్జం, కడుతురుత్తి, ఉదయనపురం, నందూర్, టీవీ పురం, కుమరకొం, అర్పుక్కర, తిరువార్పు, ఐమానం, అతిరంపూజ పంచాయతీలు 10 కిలోమీటర్ల మేర నిఘా జోన్ పరిధిలోకి వస్తాయి.
కొట్టాయంలో పక్షుల్లో వ్యాపించే బర్డ్ ఫ్లూ అనేది ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా (H5N1) వైరస్. వ్యాధి సోకిన కోళ్లు లేదా ఇతర పక్షులతో ప్రజలు సన్నిహితంగా ఉన్నప్పుడు ఈ వైరస్ సోకవచ్చు. బర్డ్ ఫ్లూ సోకిన పక్షుల మాంసాన్ని (పచ్చి మాంసం) ప్రజలు తిన్నప్పుడు గానీ, కోడి లేదా పక్షి బతికి ఉన్నా లేదా చనిపోయినా..ఈ వైరస్ కళ్ళు, ముక్కు లేదా నోటి ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. జ్వరం రావడం, తలనొప్పి, కండరాల నొప్పి, నిరంతరం ముక్కు కారడం, దగ్గు, పొత్తి కడుపులో నొప్పి, కంటి ఎరుపు, అతిసారం, వికారం లేదా వాంతులు, గొంతులో వాపు వంటివి బర్డ్ ఫ్లూ లక్షణాలు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..