Navy Upgrade Plan: మరింత పటిష్టంగా నావికాదళం.. ఇకపై చైనా దుష్టపన్నాగాలకు చెక్!

భారత నావికా దళం మరింత బలపడుతోంది. వివిధ ప్రాంతాల్లో 63 యుద్ధ నౌకల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. మరో 31 యుద్ధ నౌకల నిర్మాణానికి అనుమతులు రావాల్సి ఉంది.

Navy Upgrade Plan: మరింత పటిష్టంగా నావికాదళం.. ఇకపై చైనా దుష్టపన్నాగాలకు చెక్!
Indian Navy
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Balaraju Goud

Updated on: Dec 03, 2024 | 11:53 AM

వృద్ధి రేటులో అగ్రరాజ్యాలను మించి దూసుకెళ్తున్న భారతదేశం తన రక్షణ వ్యవస్థను రోజురోజుకీ పటిష్టం చేసుకుంటోంది. త్రివిధ దళాలను ప్రపంచంలోని అత్యుత్తమ డిఫెన్స్ ఫోర్సెస్‌కు ధీటుగా తయారు చేయాలని ప్రయత్నిస్తోంది. భారత భౌగోళిక సరిహద్దుల్లో ఇప్పటికే కవ్వింపు చర్యలతో దూకుడు ప్రదర్శిస్తున్న చైనా, మరోవైపు సముద్ర జలాల్లోనూ ఇదే వైఖరిని ప్రదర్శిస్తోంది. సముద్ర పరిశోధనల కోసం అంటూ రీసెర్చ్ వెస్సెల్స్ ద్వారా హిందూ మహాసముద్రంలో చైనా నౌకలు భారత్‌పై కన్నేసిన విషయం తెలిసిందే. చైనాను ఎదుర్కోవాలంటే మన శక్తిసామర్థ్యాలను వీలైనంత త్వరగా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో తాజాగా రూ. 90,000 కోట్లతో నావికాదళాన్ని మరింత బలోపేతం చేసేందుకు నడుం బిగించింది.

ఇందులో భాగంగా ఫ్రాన్స్ నుంచి 26 ‘రఫేల్ మెరైన్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌’లతో పాటు 3 స్కార్పీన్ సబ్‌మెరీన్స్‌ను కొనుగోలు చేయాలని భావిస్తోంది. నెల రోజుల్లో ఈ ప్రతిపాదనలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కే. త్రిపాఠీ వెల్లడించారు. ఈ మేరకు ఫ్రాన్స్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన తెలిపారు. రఫేల్ మెరైన్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పాటు స్కార్పీన్ రకం సబ్‌మేరీన్లను భారత్‌లోని మజగాం డాక్‌యార్డ్‌లో తయారుచేసే అంశంపై కూడా చర్చిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఇప్పటికే 6 స్కార్పీన్ సబ్‌మెరీన్లను డాక్‌యార్డ్ తయారు చేసివ్వగా, వాటి సంఖ్యను పెంచేందుకు మరో 3 సబ్‌మెరీన్లను తయారు చేసే అంశంపై మంతనాలు కొనసాగుతున్నాయి. ఈ రకం సబ్‌మెరీన్లు ఫ్రెంచ్ కంపెనీకి చెందినవే అయినప్పటికీ, ప్రాజెక్ట్ 75లో భాగంగా వీటిని భారత్‌లోనే తయారు చేస్తున్న విషయం తెలిసిందే.

మరో 12 ఏళ్లలో సొంతంగా అణు జలాంతర్గామి

రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని సాధించేందుకు ప్రయత్నిస్తున్న భారత్, అప్పటి వరకు రక్షణ అవసరాలు తీర్చేందుకు మిత్రదేశాలతో ఒప్పందాలు చేసుకుని, అధునాతన ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటోంది. కొన్నింటిని నేరుగా ఆయా దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నప్పటికీ, మిగతావాటిని భారత్‌లోనే తయారు చేసేలా ఒప్పందాలు చేసుకుంటోంది. అదే సమయంలో అగ్రరాజ్యాలతో పోటీపడే స్థాయిలో స్వదేశీ పరిజ్ఞానాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటోంది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో న్యూక్లియర్ సామర్థ్యం కల్గిన సబ్‌మెరీన్లను తయారుచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2036-37 నాటికి తొలి స్వదేశీ అణు జలాంతర్గామి సిద్ధమవుతుందని, ఆ తర్వాత మరో రెండేళ్లకు 2వ జలాంతర్గామిని సిద్ధం చేస్తామని నావికాదళ అధిపతి వెల్లడించారు. అనేక దశాబ్దాల జాప్యం అనంతరం వీటిని విశాఖపట్నంలోని రహస్య షిప్ బిల్డింగ్ సెంటర్‌లో తయారు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది. మొత్తం 6 అణు జలాంతర్గాములను సిద్ధం చేసుకోవాలన్నది లక్ష్యం. అలాగే రానున్న పదేళ్లలో మొత్తం 95-100 యుద్ధ నౌకలను సిద్ధం చేసి సముద్రంపై ఆధిపత్యాన్ని చాటాలని చూస్తోంది.

1999లో నాటి ఎన్డీఏ ప్రభుత్వం 30 ఏళ్లలో 24 సబ్‌మెరీన్లు (P-75I మోడల్ డీజిల్-ఎలక్ట్రిక్ రకం) తయారు చేయాలని నిర్ణయించింది. అయితే ఇందులో భాగంగా ఇప్పటి వరకు కల్వరీ క్లాస్‌కి చెందిన 5 సబ్‌మెరీన్లు నావికాదళానికి అందాయి. ఆరవది ప్రస్తుతం ట్రయల్స్ నిర్వహిస్తోంది. సెకండ్ బ్యాచ్ సబ్‌మెరీన్ల నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు.

అమ్ములపొదిలోకి నెలకొక ఆయుధం..!

నావికాదళపతి అడ్మిరల్ త్రిపాఠీ వెల్లడించిన వివరాల ప్రకారం భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో 63 యుద్ధ నౌకల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. మరో 31 యుద్ధ నౌకలకు అనుమతులు ముంజూరు కావాల్సి ఉంది. వీటికి తోడుగా కాలం చెల్లిన 60 చేతక్ హెలీకాప్టర్లను తొలగించి, వాటి స్థానంలో అధునాతన హెలీకాప్టర్లను సమకూర్చేందుకు నడుం బిగించింది. అలాగే శత్రువుల కన్నుగప్పు దూసుకెళ్లే రెండు యుద్ధ నౌకలు (Stealth Frigates)లను రష్యన్ షిప్‌యార్డులో నిర్మించగా, వాటిలో మొదటిది ‘తుశీల్’ వచ్చేవారం నావికాదళంలో చేరనుంది. 2025 మొదటి త్రైమాసికంలో 2వ స్టెల్త్ ఫ్రిగేట్ ‘తమాల్’ కూడా అందుబాటులోకి రానుంది. మొత్తంగా రానున్న ఏడాది కాలంలో నెలకొక యుద్ధ నౌక నావికాదళం అమ్ముల పొదిలో చేరనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..