One Nation One Election: వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై కేంద్రం కీలక నిర్ణయం.. ఆ అజెండా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికలు బీజేపీ కల. 2014, 2019లో సంపూర్ణ మెజారిటీ వచ్చినా, ఈ దఫా సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్నా.. జమిలిపై మాత్రం వెనకడుగు వేయడం లేదు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం, దాని సాధ్యాసాధ్యాలు, కష్టనష్టాలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఓ కమిటీ వేసింది కేంద్రం. రామ్‌నాథ్ కమిటీ అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని, కొన్ని సిఫార్సులు చేస్తూ కేంద్రానికి నివేదిక సమర్పించింది. ఆ కమిటీ ఇచ్చిన సిఫార్సులకు కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది.
One Nation One Election: వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి లోక్‌సభ అజెండా నుంచి ఈ బిల్లును తొలగించారు. శుక్రవారంనాడు విడుదలైన అజెండా ప్రకారం సోమవారం బిల్లును ప్రవేశపెడతామంటూ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, తాజా మార్పుల ప్రకారం మంగళవారం లేదా బుధవారం వన్ నేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ క్రమంలో రాజ్యసభలో రేపు, ఎల్లుండి రాజ్యాంగంపై చర్చకు అవకాశం ఉండనున్నట్లు భావిస్తున్నారు. మరోవైపు రేపు మధ్యాహ్నం మూడు గంటల వరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా- ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోనే పర్యటిస్తుండటంతో, ఈ బిల్లు- రేపటి లోక్‌సభ అజెండా నుంచి పక్కకు వెళ్లిందని తెలుస్తోంది.
అయితే, ఒకే దేశం.. ఒకే ఎన్నిక అనే కాన్సెప్ట్ ప్రపంచంలో చాలా తక్కువ దేశాల్లో అమలవుతోంది. మరి.. ఇండియాలో ఎందుకీ కాన్సెప్ట్? జనాభా తక్కువగా ఉన్న బెల్జియం, స్వీడన్, దక్షిణాఫ్రికా లాంటి చాలా చిన్న దేశాల్లో జమిలి ఎన్నిలు జరపడం తేలికగా ఉంటుంది. మరి.. మనది దాదాపు 100 కోట్ల ఓటర్లు ఉన్న దేశం. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు ఎలా సాధ్యం? జనాభా లెక్కలు, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్.. ఇవన్నీ పూర్తయ్యాకే జమిలికి వెళ్లాల్సి ఉంటుందనేది ఓ లెక్క. దీనికితోడు రాజ్యాంగ సవరణలు, రామ్‌నాథ్ కమిటీ సిఫార్సులు అమలు చేయాల్సి ఉంటుంది.
జమిలి అనేది తెలుగు ప్రజలకు కొత్తేం కాదు. ఒకవిధంగా ఏపీలో ఇప్పటికీ జరుగుతున్నది జమిలి ఎన్నికలే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరుండాలి, ఢిల్లీ పీఠంపై ప్రధానిగా ఎవరు కూర్చోవాలి. ఇలా ఒకేసారి అన్ని రాష్ట్రాల సీఎంలను, పీఎంను ఎన్నుకోవడమే జమిలి. కాకపోతే.. ఇవే ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికలు, మున్సిపాలిటీ-కార్పొరేషన్ ఎలక్షన్లు, వివిధ స్థానిక సంస్థల ఎన్నిలను కూడా ఒకేసారి జరుపుతారు. ఇవన్నీ దేశవ్యాప్తంగా ఒకేసారి జరుగుతాయి. లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికలు జరిగిన 100 రోజుల లోపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని లోకల్‌బాడీ ఎలక్షన్స్‌ను పూర్తి చేస్తారు. జమిలి అంటే అర్థం ఇదే.
సో, జమిలి ఎన్నికలను అర్థం చేసుకోడానికి రాకెట్ సైన్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదనుకుంటా. ఆల్రడీ జమిలి బిల్లుపై కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టి పాస్ చేయాలనే సంకల్పంతో ఉంది. ఇక పోతే అసలు ప్రశ్న..! ఆల్రడీ ఎన్నికలు సజావుగానే సాగుతున్నాయి కదా..! మరెందుకని జమిలిని తీసుకురావాలనుకుంటోంది బీజేపీ? అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..