Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. 20 ఏళ్ల తర్వాత ఏకమవుతున్న ఠాక్రే బ్రదర్స్
హిందీకి వ్యతిరేకంగా , మరాఠీ భాష పరిరక్షణకు ఏకం కావాలని ఉద్దవ్ ఠాక్రే , రాజ్ ఠాక్రే నిర్ణయించారు. 20 ఏళ్ల తరువాత ఠాక్రే బ్రదర్స్ ఏకం కావడం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. జులై 5వ తేదీన మరాఠీ భాషకు మద్దతుగా జరిగే ఆందోళనలో ఇద్దరు నేతలు కలిసి పాల్గొంటున్నారు. రాజకీయ అవసరాల కోసమే ఠాక్రే బ్రదర్స్ ఈ నినాదాన్ని ఎత్తుకున్నారని బీజేపీ విమర్శించింది.

20 ఏళ్ల తరువాత ఠాక్రే బ్రదర్స్ ఏకమవుతున్నారు. మహారాష్ట్రలో హిందీకి వ్యతిరేకంగా ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఏకమయ్యారు. జులై 5వ తేదీన హిందీకి వ్యతిరేకంగా మహారాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. శివసేన ఉద్దవ్ వర్గం, MNS పార్టీలు ఉమ్మడిగా ఈ ఆందోళనను చేపట్టబోతున్నాయి. రాజకీయ ప్రయోజనాల కంటే మహారాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఉద్దవ్ ఠాక్రే , రాజ్ ఠాక్రే ప్రకటించారు. మహాయుతి కూటమిపై ఠాక్రే బ్రదర్స్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు హిందీని కంపల్సరీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మరాఠీ భాషను కాపాడుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్దమని ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు. జాతీయ విద్యా విధానం NEPలో హిందీ తప్పనిసరి అని ఎక్కడ లేదన్నారు. ప్రతి రాష్ట్రానికి ఒక అధికారిక భాష ఉంటుందని , మహారాష్ట్రకు మరాఠీ అధికారిక భాష అన్నారు ఉద్దవ్ ఠాక్రే.
తమకు మహారాష్ట్ర ప్రయోజనాలనే ముఖ్యమన్నారు ఉద్దవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్. అందుకే మరాఠీ భాష కోసం ఇద్దరు ఏకమవుతున్నారని చెప్పారు. వాస్తవానికి జులై 7వ తేదీన ఉద్దవ్ ఠాక్రే ఆందోళనలకు పిలుపునిచ్చారని , కాని రాజ్ ఠాక్రే ఫోన్ చేసి ఐదో తేదీన ఆందోళనలు నిర్వహించాలని కోరారని చెప్పారు. మరాఠీ భాష కోసం రెండు పార్టీలు పోరాటం చేస్తున్నందున వేర్వేరుగా ఆందోళనలు చేయడం మంచిది కాదని చెప్పారన్నారు. రాజ్ ఠాక్రే విజ్ఞప్తికి ఉద్దవ్ ఠాక్రే అంగీకరించారని సంజయ్ రౌత్ వెల్లడించారు. అయితే రాజకీయ అవసరాల కోసమే ఠాక్రే బ్రదర్స్ ఏకమవుతున్నారని మహాయుతి కూటమి నేతలు విమర్శించారు. ఉద్దవ్ ఠాక్రే సీఎంగా ఉన్నప్పుడే మహారాష్ట్రలో త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారని అన్నారు సీఎం ఫడ్నవీస్.




