AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జమ్మూ కాశ్మీర్‌లో మళ్ళీ ఉగ్ర కలకలం.. తూటాలకు ఛిద్రమైన ఇద్దరు పోలీసుల మృతదేహాలు..!

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల కదలికలు మరోసారి కలకలం రేపాయి. కిష్త్వార్ జిల్లాలో ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు (SPOలు) దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం (నవంబర్ 11) నుంచి అదృశ్యమైన ఇద్దరు పోలీసు సిబ్బంది మృతదేహాలు గురువారం ఉదయం దచన్ అటవీ ప్రాంతంలో లభ్యమయ్యాయి.

జమ్మూ కాశ్మీర్‌లో మళ్ళీ ఉగ్ర కలకలం.. తూటాలకు ఛిద్రమైన ఇద్దరు పోలీసుల మృతదేహాలు..!
Spos Found Shot Dead
Balaraju Goud
|

Updated on: Nov 12, 2026 | 11:11 AM

Share

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల కదలికలు మరోసారి కలకలం రేపాయి. కిష్త్వార్ జిల్లాలో ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు (SPOలు) దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం (నవంబర్ 11) నుంచి అదృశ్యమైన ఇద్దరు పోలీసు సిబ్బంది మృతదేహాలు గురువారం ఉదయం దచన్ అటవీ ప్రాంతంలో లభ్యమయ్యాయి. మృతులను బాబీ చంద్ (57), రష్‌పాల్ కుమార్ (45)గా అధికారులు గుర్తించారు. వారి మృతదేహాలపై బుల్లెట్ గాయాలు ఉండటంతో కాల్పులు జరిపి హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

కిష్త్వార్ జిల్లాలోని దచన్ ప్రాంతంలోని కియార్ గ్రామంలో ఈ ఇద్దరు SPOలు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG)లో విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం క్యాంపు నుంచి బస్నాన్‌లోని ఆర్మీ 17వ రాష్ట్రీయ రైఫిల్స్ పోస్టుకు బాధ్యతలు స్వీకరించేందుకు బయలుదేరారు. అయితే మార్గమధ్యలోని దేహర్నా అటవీ ప్రాంతం వద్ద మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో కాల్పుల శబ్దాలు వినిపించాయి. అదే సమయంలో మార్వా ప్రాంతంలో మొబైల్ నెట్‌వర్క్ సేవలకు అంతరాయం ఏర్పడింది.

అనంతరం ఇద్దరు పోలీసుల ఆచూకీ తెలియకపోవడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. గురువారం ఉదయం అదృశ్యమైన ప్రాంతానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో వారి మృతదేహాలను గుర్తించారు. ఇద్దరిపై పలుమార్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా వారి సర్వీస్ ఆయుధాలు కూడా కనిపించకుండా పోవడం అనుమానాలకు తావిస్తోంది.

ఈ ఘటన వెనుక ఉగ్రవాదుల ప్రమేయం ఉండవచ్చని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. ప్రాథమిక విచారణలో ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొని ఉండవచ్చని, వారిలో ఇద్దరు విదేశీయులై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. లష్కర్-ఎ-తైబా నెట్‌వర్క్‌తో సంబంధాలున్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. అనుమానిత ఓవర్‌గ్రౌండ్ వర్కర్లను విచారిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు కిష్త్వార్ బీజేపీ ఎమ్మెల్యే షగున్ పరిహార్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం భద్రతా బలగాలు అటవీ ప్రాంతాన్ని దిగ్బంధించి విస్తృతంగా గాలింపు చేపట్టాయి. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇద్దరు పోలీసుల హత్యతో కిష్త్వార్ జిల్లాలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us