నర్మదా నది ఒడ్డున అద్భుతం.. లక్షల ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన వింత శిల!
భూమి పొరల్లో దాగి ఉన్న ఎన్నో రహస్యాలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలో నర్మదా నది ఒడ్డున బయటపడిన ఓ వింత ఆకారం స్థానికంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారీ జంతువు దవడను పోలిన ఈ నిర్మాణంలో దంతాల్లాంటి ఆకారాలు కనిపించడంతో ఇది ఏదైనా ప్రాచీన జంతువు శిలాజమా? అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా ఇది లక్షల సంవత్సరాల క్రితం జీవించిన భారీ ఏనుగు జాతికి చెందిన అవశేషం కావచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

భోపాల్: భూమి పొరల్లో దాగి ఉన్న ఎన్నో రహస్యాలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలో నర్మదా నది ఒడ్డున బయటపడిన ఓ వింత ఆకారం స్థానికంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారీ జంతువు దవడను పోలిన ఈ నిర్మాణంలో దంతాల్లాంటి ఆకారాలు కనిపించడంతో ఇది ఏదైనా ప్రాచీన జంతువు శిలాజమా? అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా ఇది లక్షల సంవత్సరాల క్రితం జీవించిన భారీ ఏనుగు జాతికి చెందిన అవశేషం కావచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
అసలు ఎక్కడ బయటపడింది?
రైసెన్ జిల్లాలోని దేవరీ ప్రాంతం పరిధిలో ఉన్న పతై గ్రామం సమీపంలోని పతై ఘాట్ వద్ద ఈ వింత నిర్మాణం బయటపడింది. నవంబర్ 10న మంగళవారం సాయంత్రం కొందరు పిల్లలు నర్మదా నది ఒడ్డున మట్టి తవ్వుతుండగా సుమారు అడుగున్నర లోతులో ఈ ఆకారం కనిపించింది. దీనికి ఒకవైపు 11, మరోవైపు 7 చొప్పున మొత్తం 18 దంతాల్లాంటి నిర్మాణాలు ఉన్నాయి. ఇందులో ఎక్కువ భాగం ఇంకా మట్టిలో, నీటిలోనే ఉండిపోయింది.
65 లక్షల ఏళ్ల నాటి ఏనుగు శిలాజమా?
ఈ వింత నిర్మాణాన్ని పరిశీలించిన జీవాశ్మ నిపుణుడు వీకే ఖన్నా, ఇది ప్రాచీన ఏనుగు దవడకు చెందిన శిలాజం కావచ్చని, సుమారు 65 లక్షల సంవత్సరాల నాటిదని ప్రాథమికంగా అంచనా వేశారు. మరో నిపుణురాలు డాక్టర్ ప్రియాంక ఘోష్, ఇది అంతరించిపోయిన స్టెగోడాన్ నమాడికస్ (Stegodon namadicus) జాతికి చెందిన దిగువ దవడ భాగం అయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే పూర్తి నిర్మాణాన్ని వెలికితీసి పరిశీలించే వరకు ఖచ్చితమైన గుర్తింపు సాధ్యం కాదని స్పష్టం చేశారు.
దేవుడిగా భావించి పూజలు!
ఈ వింత ఆకారాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివస్తున్నారు. కొందరు దీనిని దైవ స్వరూపంగా భావించి పూజలు చేస్తూ పూలు సమర్పిస్తున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్ రోహిత్ సిసోనియా ఆదేశాలతో అధికారులు ఆ ప్రాంతాన్ని భద్రపరిచారు. శిలాజానికి నష్టం జరగకుండా 24 గంటల భద్రత ఏర్పాటు చేశారు. నర్మదా లోయ గతంలోనూ డైనోసార్ గుడ్లు, ప్రాచీన జంతువుల శిలాజాల కారణంగా వార్తల్లో నిలిచింది. ఇప్పుడు బయటపడిన ఈ భారీ దవడ పూర్తి స్థాయిలో పరిశీలిస్తే చరిత్రకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
వీడియో ఇక్కడ చూడండి..
A mysterious stone found by children digging near Narmada River in Patai village, Raisen district, Madhya Pradesh https://t.co/wHaf46r3aB
— Ankit (@Extreo_) November 11, 2026
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
