AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే స్నోఫాల్ కింగ్.. ఈ నగరం గురించి తెలుసా?

ప్రపంచంలో అత్యంత చల్లని ప్రాంతాల గురించి మాట్లాడితే రష్యాలోని యాకుట్స్క్ నగరం గుర్తుకొస్తుంది. కానీ అత్యధికంగా మంచు కురిసే నగరం మాత్రం అది కాదు. జపాన్‌లోని ఓ నగరం ఈ విషయంలో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. అక్కడ ఏడాదికి ఏకంగా 6 నుంచి 7 మీటర్ల వరకు మంచు కురుస్తుంది. శీతాకాలం వచ్చిందంటే చాలు.. నగరంలోని రోడ్లు, భవనాలు, ఇళ్లు అన్నీ మంచుతో కప్పుకుపోతాయి. అయినప్పటికీ అక్కడి ప్రజలు తమ రోజువారీ పనులను కొనసాగిస్తుంటారు.

ప్రపంచంలోనే స్నోఫాల్ కింగ్.. ఈ నగరం గురించి తెలుసా?
Aomori City In Japan Receives Highest Snowfall In The World (1)
Sharada V
|

Updated on: Nov 04, 2026 | 9:58 AM

Share

ప్రపంచంలో అత్యధికంగా మంచు కురిసే నగరాల్లో అగ్రస్థానంలో నిలిచింది జపాన్‌లోని అయోమోరి (Aomori). జపాన్‌లోని హోన్షు ద్వీపం ఉత్తర భాగంలో ఉన్న ఈ నగరం అయోమోరి ప్రిఫెక్చర్‌కు రాజధాని. ఇక్కడ ప్రతి ఏడాది శీతాకాలంలో భారీగా మంచు కురుస్తుంది. ఏడాదికి 6 నుంచి 7 మీటర్ల వరకు మంచు పేరుకుపోతుంది. చలికాలంలో కొన్ని నెలల పాటు నగరం మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా కనిపిస్తుంది. ఇంతటి విపరీతమైన మంచులోనూ అక్కడి ప్రజలు తమ పనులు, ప్రయాణాలు, వ్యాపారాలను కొనసాగించడం విశేషం.

ఇక్కడే ఇంత మంచు ఎందుకు కురుస్తుంది?

అయోమోరి నగరంలో భారీగా మంచు కురవడానికి ప్రధాన కారణం దాని భౌగోళిక స్థానం, సముద్రం నుంచి వీచే చల్లని గాలులు.సైబీరియా ప్రాంతం నుంచి వచ్చే అత్యంత చల్లని గాలులు జపాన్ సముద్రం మీదుగా ప్రయాణిస్తాయి. ఆ సమయంలో సముద్రంలోని వెచ్చని నీటి నుంచి ఆ గాలులు తేమను గ్రహిస్తాయి. ఆ తేమతో నిండిన గాలులు మంచును మోసుకొచ్చే మేఘాలుగా మారతాయి. అవి అయోమోరి చుట్టుపక్కల పర్వత ప్రాంతాలకు చేరుకున్నప్పుడు పైకి ఎగసి చల్లబడతాయి. దీంతో భారీగా మంచు కురుస్తుంది. ఈ ప్రక్రియను ‘ఓరోగ్రాఫిక్ స్నోఫాల్’ (Orographic Snowfall) లేదా సముద్ర ప్రభావంతో ఏర్పడే మంచు (Sea-effect Snow) ప్రక్రియతో వివరిస్తారు.

చలి ఎక్కువగా ఉంటే మంచు ఎక్కువగా కురుస్తుందా?

చాలామందికి అత్యంత చల్లని ప్రాంతాల్లోనే ఎక్కువగా మంచు కురుస్తుందని అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. మంచు కురవడానికి తక్కువ ఉష్ణోగ్రతలతో పాటు వాతావరణంలో తగినంత తేమ కూడా ఉండాలి. భూమిపై అత్యంత చల్లని ధ్రువ ప్రాంతాల్లో వాతావరణంలో తేమ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల అక్కడ ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోయినా మంచు కురిసే పరిమాణం తక్కువగా ఉండవచ్చు. కానీ అయోమోరి ప్రాంతానికి సముద్రం నుంచి నిరంతరం తేమతో కూడిన చల్లని గాలులు రావడం వల్ల భారీగా మంచు కురుస్తుంది.

మంచును తొలగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు!

ఏడాదికి మీటర్ల కొద్దీ మంచు కురిసే ప్రాంతంలో సాధారణ జీవితం కొనసాగించడం అంత సులభం కాదు. ముఖ్యంగా రోడ్లు, ఫుట్‌పాత్‌లు మంచుతో నిండిపోతే వాహనాల రాకపోకలు, ప్రజల నడక కష్టమవుతుంది. అందుకే అయోమోరి నగరంలో మంచును తొలగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ప్రత్యేక మంచు తొలగింపు యంత్రాలు, స్నో ప్లౌస్‌ను ఉపయోగించి రోడ్లపై పేరుకుపోయిన మంచును తొలగిస్తారు. ప్రతి ఏడాది శీతాకాలం ప్రారంభానికి ముందే స్థానిక అధికారులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తారు. 200 కిలోమీటర్ల మేర పాదచారుల మార్గాల్లో మంచును తొలగించే పనులు చేపడతారు.

మొత్తానికి.. ప్రపంచంలో అత్యంత చల్లని నగరం కావడం వేరు.. అత్యధికంగా మంచు కురిసే నగరంగా నిలవడం వేరు. ఈ రెండింటి మధ్య తేడాను జపాన్‌లోని అయోమోరి స్పష్టంగా చూపిస్తోంది. ప్రకృతి సృష్టించే విపరీత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనుషులు ఎలా జీవించగలరో ఈ నగరం అద్భుత ఉదాహరణగా నిలుస్తోంది.

Follow Us