మూడేళ్లు దాటితే ప్రామిసరీ నోట్ చెల్లుతుందా..? ఈ రూల్ తెలియకపోతే మీ డబ్బులు పోయినట్లే..
Promissory Note Rule: ప్రామిసరీ నోట్ చెల్లుబాటు కాలపరిమితి మూడు సంవత్సరాలుగా ఉంది. ఈ గడువు తర్వాత కోర్టులో అది పనిచేయదు. కానీ గడువు ముగియకముందే నోట్‌ను పునరుద్ధరించుకోవడం లేదా డబ్బు వసూలు కోసం లీగల్ నోటీసు పంపడం వల్ల రుణదాతకు ఇబ్బంది ఉండదు. ఇది రుణదాతకు చట్టబద్ధమైన హక్కులను కాపాడుతుంది.

అప్పు పుచ్చుకున్నవారి నుంచి అప్పు ఇచ్చినవారు ప్రామిసరీ నోటు రాయించుకుంటారు. గ్యారంటీ సంతకాలు, స్టాంపు వంటివి ప్రామిసరీ నోటులో ఉంటాయి. డబ్బులు అప్పుగా తీసుకున్నప్పుడు లేదా ఇచ్చినప్పుడు ప్రామిసరీ నోట్ అనేది అత్యంత ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది ఒక చట్టబద్ధమైన ఆర్థిక పత్రంగా ఇరువురికి ఉపయోగపడుతుంది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం ఈ డాక్యుమెంట్‌ను చట్టబద్దమైన ఆర్ధిక ఒప్పందంగా పరిగణిస్తారు. ప్రామిసరీ నోట్ అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తికి నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించేందుకు చేసుకున్న వ్రాతపూర్వక వాగ్దానంగా చెప్పవచ్చు. ఇది చట్టబద్ధంగా చెక్కుతో సమానమైన విలువను కలిగి ఉంటుంది. ప్రామిసరీ నోట్, చెక్కు రెండూ చట్టం ముందు సమానమైన ఆర్ధిక పత్రాలుగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చినప్పుడు.. అందులో పేర్కొన్న మొత్తాన్ని ఖచ్చితంగా చెల్లించాల్సిన బాధ్యత రుణగ్రహీతకు ఉంటుంది. ప్రామిసరీ నోటు రుణగ్రహీత నుంచి తీసుకునేటప్పుడు ఈ నోట్‌లో నిర్దిష్ట చెల్లింపు తేదీలను స్పష్టంగా రాయాలి. చెల్లింపు తేదీలు పేర్కొనబడినప్పుడు.. ఆ తేదీల్లోగా చెల్లింపు జరగడం తప్పనిసరి. చట్టం ప్రకారం ఒక ప్రామిసరీ నోట్ చెల్లుబాటు కాలపరిమితి దానిపై సంతకం చేసిన తేదీ నుండి మూడు సంవత్సరాల వరకు ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత, ఆ నోట్‌ను చెల్లుబాటు కానిదిగా పరిగణిస్తారు. అటువంటి సందర్భంలో రుణదాత ఆ నోట్ ఆధారంగా కోర్టు ద్వారా డబ్బును తిరిగి వసూలు చేయలేడు. దీని అర్థం రుణం తిరిగి చెల్లించాల్సిన బాధ్యత పూర్తిగా తొలగిపోదు. అయితే చట్టపరంగా బలవంతంగా వసూలు చేసే హక్కును రుణదాత కోల్పోతాడని అర్ధం.
ప్రామిసరీ నోట్ 3 సంవత్సరాలు దాటిన తర్వాత అది కోర్టులో పనిచేయదు. అయితే కొన్ని సందర్భాల్లో గడువు ముగియకముందే దానిని పునరుద్ధరించుకునే అవకాశం ఉంది. దీన్నే వసూలు, లేదా రుణాన్ని తిరిగి అంగీకరించడం అంటారు. రుణం తీసుకున్న వ్యక్తి ప్రామిసరీ నోట్ గడువు ముగియకముందే.. తాను అప్పు తీసుకున్నట్లు లేదా కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించినట్లు రాతపూర్వకంగా అంగీకరించాలి. ఆ అంగీకారం చేసిన తేదీ నుండి మళ్లీ మూడేళ్ల వరకు కొత్త కాలపరిమితి ప్రారంభమవుతుంది. ఈ విధంగా ప్రామిసరీ నోట్ చట్టపరమైన చెల్లుబాటును పొడిగించుకోవచ్చు. అలాంటి పునరుద్ధరించబడిన ప్రామిసరీ నోట్లు కోర్టులో చెల్లుబాటు అవుతాయని నిపుణులు చెబుతున్నారు. గడువు ముగిసేలోపు చెల్లించకపోతే.. రుణదాత ఒక లీగల్ నోటీసును రుణగ్రహీతకు పంపాలి. ఈ నోటీసులో రుణగ్రహీత ఎంత అప్పు తీసుకున్నారు..? వడ్డీతో కలిసి ఎంత అవుతుంది అనే వివరాలను స్పష్టంగా పేర్కొనాలి. 15 రోజులలోగా అప్పును తిరిగి చెల్లించమని ఈ నోటీసులో కోరాలి. రుణగ్రహీత నోటీసుకు స్పందించకపోయినా లేదా డబ్బు చెల్లించడానికి నిరాకరించినా రుణదాత కోర్టు ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు
