Bhogi Movie Review : భోగి సినిమా రివ్యూ.. శర్వానంద్, సంపత్ నంది రక్తపాతం వర్కవుట్ అయిందా..?
ఈ ఏడాది 'నారీ నారీ నడుమ మురారి', 'బైకర్' లాంటి రెండు డీసెంట్ చిత్రాలతో ఆకట్టుకున్న శర్వానంద్, ఈసారి మాస్ డైరెక్టర్ సంపత్ నందితో కలిసి 'భోగి' అనే పీరియడ్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమాతో శర్వానంద్ వరుసగా మూడోసారి మంచి ఫలితాన్ని అందుకున్నారా..? సంపత్ నంది మినిమమ్ గ్యారంటీ మార్క్ చూపించారా అనేది చూద్దాం..

మూవీ రివ్యూ: భోగి
నటీనటులు: శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి, శరత్ లోహితాశ్య, అవినాష్, లాల్, శివకుమార్ తదితరులు
ఎడిటింగ్: తమ్మిరాజు
సంగీతం: భీమ్స్
సినిమాటోగ్రఫీ: కిషోర్ కుమార్ అరోకియా
నిర్మాత: కేకే రాధామోహన్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: సంపత్ నంది
ఈ ఏడాది ‘నారీ నారీ నడుమ మురారి’, ‘బైకర్’ లాంటి రెండు డీసెంట్ చిత్రాలతో ఆకట్టుకున్న శర్వానంద్, ఈసారి మాస్ డైరెక్టర్ సంపత్ నందితో కలిసి ‘భోగి’ అనే పీరియడ్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమాతో శర్వానంద్ వరుసగా మూడోసారి మంచి ఫలితాన్ని అందుకున్నారా..? సంపత్ నంది మినిమమ్ గ్యారంటీ మార్క్ చూపించారా అనేది చూద్దాం..
కథ:
1960స్లో తెలంగాణలోని బొగ్గులగుట్ట అనే మారుమూల గ్రామంలో గంగ (శర్వానంద్) తన ఐదుగురు చెల్లెళ్లు, పెళ్లైన అన్నయ్యతో కలిసి జీవిస్తుంటాడు. ఒకరోజు గంగ అన్నయ్యకు అమ్మవారు పోసి మంచాన పడటంతో, ఆ ఊరి పెద్ద (శరత్ లోహితశ్వ) గంగను, ఆ గ్రామంలోని మరికొందరు పాలెగాళ్ళను పిలిచి ఒక ముఖ్యమైన పనిని అప్పగిస్తాడు. ఇంతకీ ఆ ఊరి పెద్ద వీళ్లకు చెప్పిన ఆ పని ఏంటి? ఆ బాధ్యతను పూర్తి చేసే క్రమంలో గంగకు తెలిసిన అసలు నిజాలేంటి? ఆ ఊరి పెద్ద, అక్కడి పూజారి (అవినాష్) కలిసి చాటుగా చేస్తున్న రహస్య కార్యకలాపాలు ఏంటి? వాటి ప్రభావం గంగపైనా, అతని చెల్లెళ్లపైనా ఎలా పడింది? అసలు కందుల సులోచన రాణి (అనుపమ పరమేశ్వరన్) ఎవరు, గంగతో ఆమెకున్న సంబంధం ఏంటి? మధ్యలో మందారం (డింపుల్ హయాతీ) ఎక్కడ్నుంచి వచ్చింది..? అనే అంశాల చుట్టూ మిగిలిన కథ తిరుగుతుంది.
కథనం:
ఒక ఊరు, కళ్లలోకి చూసి మాట్లాడటానికి కూడా జనం భయపడే ఒక ఊరి పెద్ద, హీరో అన్నయ్యకు ఆ పెద్ద మనిషి వల్ల జరిగే భారీ నష్టం, దానికి ప్రతీకారం, చివర్లో ఒక ట్విస్ట్.. ఇదంతా వింటుంటే ఏ సినిమా గుర్తుకొస్తోంది? అచ్చం ‘రంగస్థలం’ కథలాగే ఉంది కదూ! దర్శకుడు సంపత్ నంది సరిగ్గా అదే కథను తీసుకుని తెలంగాణ నేపథ్యం, అన్న సెంటిమెంట్ బదులు చెల్లెళ్ల సెంటిమెంట్ లాంటి చిన్నచిన్న మార్పులతో ‘భోగి’ని రూపొందించాడు. క్లైమాక్స్ ట్విస్ట్ విషయంలోనూ అదే తరహా మలుపును వాడుకోవడానికి వెనుకాడలేదు. కానీ రంగస్థలం సృష్టించిన మ్యాజిక్‌లో సగం కూడా ఇందులో పండించలేకపోయాడు. సినిమా చూస్తున్నంత సేపు ఒక రంగస్థలంకు మరో వర్షన్ చూస్తున్న భావనే కలుగుతుంది. సినిమా ఆరంభంలో టైటిల్ కార్డ్స్ మధ్యలో నాలుగు సంబంధం లేని దృశ్యాలను చూపిస్తారు. తీవ్రంగా గాయపడి కోపంతో ఉన్న హీరో, వరదల్లో చిక్కుకున్న గ్రామాన్ని కాపాడమని ఊరి పెద్ద ఇంటి ముందు వేడుకునే జనం, మహిళలను భయపెట్టే కొందరు వ్యక్తులు, ప్రార్థన లేదా ధ్యానం చేస్తున్న ఒక యువకుడు.. ఇలా ఆ నాలుగు సీన్లు మొదట్లో అర్థం కాకపోయినా, కాసేపటికే సినిమా కథ మొత్తాన్ని ఆ నాలుగు షాట్స్‌లోనే బయటపెట్టి, ఆ తర్వాత కథను వివరంగా చెప్పడం మొదలుపెట్టారని అర్థమవుతుంది.
ఈ కాస్త కొత్త ఆలోచన, అక్కడక్కడా వినిపించే కొన్ని బలమైన సంభాషణలు తప్ప సినిమాలో చెప్పుకోవడానికి ఇంకేమీ లేదు. “ఆడదానికి అందం వరం కాదు శాపం.. అనుభవం లేని వాడు కూడా అనుభవించాలని చూస్తాడు”, “అడవి జాతి సాబ్.. ఆడ జాతి రా”, “మనం గొడ్డలి లాంటోళ్లం.. చెట్లు నరకాలి, అవసరమైతే తలలు కూడా నరకాలి”, “సస్తే శవం అయితా.. ఒకవేళ చావుల్ని ఆపితే చరిత్ర అవుతా” లాంటి డైలాగులు మాత్రం బాగా కుదిరాయి. పాతకాలపు మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాల గురించి జనాలకు అవగాహన కల్పించాలనే ఆలోచన మంచిదే అయినా, దానిని చెప్పడానికి ఎంచుకున్న స్క్రీన్‌ప్లే మాత్రం నీరసంగా ఉంది. హీరో పరిచయం, కుటుంబ నేపథ్యం, ప్రధాన సంఘర్షణ, ప్రతీకారం, చివరి మలుపు.. ఇలా ఏ ఒక్కటీ ప్రేక్షకుడిలో పెద్దగా ఉత్సాహాన్ని నింపవు. ముఖ్యంగా సినిమాకు ‘భోగి’ అని పేరు ఎందుకు పెట్టారో ప్రీ-క్లైమాక్స్ వరకు అర్థం కాదు. భోగి అంటే రంగురంగుల ఆనందమైన పండుగ, కానీ ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు చీకటి, నిరాశ, మితిమీరిన రక్తపాతం, హింసతో నిండిపోయి ఉంటుంది. ప్రీ-క్లైమాక్స్‌లో టైటిల్‌కు సరైన అర్థం చెప్పే ప్రయత్నం చేసినా అప్పటికే ఆలస్యం అయిపోతుంది. కేవలం టైటిల్ కార్డు మాత్రమే కాదు, సినిమాలో దాదాపు ప్రతీ అంశాన్ని ఎందుకో సాగదీస్తూనే వచ్చారు దర్శకుడు సంపత్ నంది. ప్రతినాయకుడి ముఖాన్ని ప్రీ-ఇంటర్వెల్ వరకు చూపించకుండా కేవలం చేతులు, కాళ్లు, వెనుక భాగం మాత్రమే చూపిస్తూ నడిపిన తీరు వెనక సస్పెన్స్ అర్థం కాదు. దీనిని ఒక ఆసక్తికరమైన టెక్నిక్ అని దర్శకుడు భావించి ఉండొచ్చు కానీ, తెరపై వర్కవుట్ కాలేదు. నిజానికి ఇంటర్వెల్ దగ్గరే సినిమా ముగియాల్సింది, కానీ అక్కడ్నుంచి సెకండాఫ్ రెగ్యులర్ కథ రాసుకున్నారు. ఫస్టాఫ్ వరకు ఓకే అనిపించినా.. సెకండాఫ్ మాత్రం ఆసక్తికరంగా అనిపించలేదు. సుదీర్ఘమైన యాక్షన్ ఎపిసోడ్స్, మితిమీరిన హింస ఈ సినిమాకు మరో మైనస్.
నటీనటులు:
గంగ పాత్రలో శర్వానంద్ మంచి నటనను కనబరిచాడు. ముఖ్యంగా కొన్ని భావోద్వేగభరితమైన సన్నివేశాల్లో అతని అభినయం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు ఉన్న కొద్దిపాటి సానుకూల అంశాల్లో శర్వా నటన ప్రధానమైనది. సులోచన రాణిగా అనుపమ పరమేశ్వరన్ తన పరిధి మేరకు బాగానే నటించింది. అయితే గతంలోనూ ఇలాంటి పాత్రలు చేసిన అనుభవం ఉండటంతో ఆమె ప్రతిభకు పరీక్ష పెట్టే అంశాలేవీ ఇందులో లేవు. కీలక పాత్రలో కనిపించిన డింపుల్ హయాతి పర్వాలేదనిపించింది, సినిమాలోని కొన్ని మంచి డైలాగులు ఆమెకే దక్కగా, వాటిని ఆమె చక్కగా పలికింది. ఇక ప్రతినాయకుడిగా శరత్ లోహితశ్వ ఎంపిక సరైనది కాదు. ఆ పాత్రకు కావాల్సిన కఠినత్వం, క్రూరత్వం ఆయనలో కొరవడింది. ఆ పాత్రకు పేరున్న నటుడిని తీసుకోవాల్సింది. లాల్ తదితర నటులు తమ వంతు న్యాయం చేసినప్పటికీ వీక్ రైటింగ్ ఈ క్యారెక్టర్స్‌ను నిలబడనీయలేదు. మిగిలిన వాళ్లంతా ఓకే..
టెక్నికల్ టీం:
ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. కిషోర్ కుమార్ అరోకియా కెమెరా పనితనం అత్యుత్తమ స్థాయిలో ఉంది. సినిమాలో ఎక్కువ భాగం మారుమూల ప్రాంతాల్లో, రాత్రి వేళల్లో చిత్రీకరించినప్పటికీ, ఆ నైట్ విజువల్స్‌ను ఆయన చాలా చక్కగా తెరకెక్కించాడు. భీమ్స్ సిసిరోలియో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే రెండు మంచి పాటలు అందించాడు. కానీ నేపథ్య సంగీతం విషయంలో మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు, చాలా చోట్ల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లౌడ్‌గా ఉంది. ఎడిటింగ్ మొదటి భాగంలో ఫర్వాలేదనిపించినా, రెండో భాగంలో తేలిపోయింది. నిర్మాత కె.కె. రాధామోహన్ అందించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. రచయితగా, దర్శకుడిగా సంపత్ నంది మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా భోగి.. మితిమీరిన హింసతో ఇబ్బంది పెట్టిన భోగి..!
