ఏడాదికి జస్ట్ రూ.12వేల వడ్డీతో 3లక్షల లోన్.. రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్!
దేశంలోని రైతన్నలకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాలను ప్రవేశపెడుతూనే ఉంది. అలాంటి ఓ పథకమే సాన్ క్రెడిట్ కార్డ్.. దీని గురించి ఇప్పటికీ చాలా మంది రైతులకు తెలియదు. ఈ పథకం కింద రైతులు చాలా తక్కువ వడ్డీకే ఆర్థిక సహాయం పొందవచ్చు. మరీ దీనికి అర్హులు ఎవరూ.. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో ఇక్కడ చూద్దాం.

రైతులకు వ్యవసాయ పెట్టుబడి ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించేందు లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) కూడా ఒకటి. రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు, నీటిపారుదల వంటి అవసరాల కోసం ఈ పథకం ద్వారా లోన్స్ పొందవచ్చు. అంతేకాకుండా పశుపోషణ, పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం వంటి అనుబంధ కార్యకలాపాలకు కూడా ఈ పథకం ద్వారా మీరు లోన్స్ తీసుకోవచ్చు.
చాలామంది KCCని ఏటీఎం కార్డ్ లాంటిది అనుకుంటారు. కానీ ఇది రివాల్వింగ్ క్రెడిట్ ఫెసిలిటీ. అంటే, బ్యాంకు ముందుగా ఒక క్రెడిట్ లిమిట్ మంజూరు చేస్తుంది. రైతుకు అవసరమైనప్పుడు ఆ లిమిట్ నుంచి డబ్బు తీసుకోవచ్చు, పంట అమ్మాక తిరిగి చెల్లించవచ్చు. ప్రతి పంట సీజన్‌కు కొత్తగా లోన్ కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ క్రెడిట్ సౌకర్యం ఐదు సంవత్సరాల వరకు కొనసాగుతుంది, మరియు బ్యాంకు ప్రతి సంవత్సరం రుణ చెల్లింపులు, సాగు వివరాలు పరిశీలించి, అవసరమైతే లిమిట్‌ను పెంచవచ్చు.
ఏ ఏ అవసరాలకు లోన్ లభిస్తుంది?
KCC ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు, ట్రాక్టర్ అద్దె, నీటిపారుదల ఖర్చులు మాత్రమే కాకుండా, పంట కోసిన తర్వాత నిల్వ, రవాణా, మార్కెటింగ్‌కు సంబంధించిన ఖర్చులు కూడా పొందవచ్చు. అంతేకాకుండా, పాడి పరిశ్రమ, పశుపోషణ, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం, చేపల పెంపకం వంటి అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలకు కూడా KCC ద్వారా వర్కింగ్ క్యాపిటల్ రుణం పొందే అవకాశం ఉంటుంది.
లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారు?
KCCలో ఒకే మొత్తం లోన్ ఉండదు. రైతుకున్న భూమి విస్తీర్ణం, వేసే పంటలు, ఆ పంట సాగుకు అయ్యే అంచనా ఖర్చు, పశుపోషణ లేదా ఇతర వ్యవసాయ కార్యకలాపాలు, గతంలో రుణ చెల్లింపుల వంటి అంశాల ఆధారంగా బ్యాంకు క్రెడిట్ లిమిట్‌ను నిర్ణయిస్తుంది. కాబట్టి, ఒకరికి రూ. 80,000 వస్తే, మరొకరికి రూ. 2 లక్షలు లేదా రూ. 3 లక్షల వరకు కూడా రావచ్చు.
4శాతం వడ్డీ అసలు నిజం
ప్రస్తుతం రూ. 3 లక్షల వరకు ఉన్న స్వల్పకాలిక పంట రుణాలకు సాధారణంగా 7శాతం వార్షిక వడ్డీ ఉంటుంది. అయితే, కేంద్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ అందిస్తుంది. అంతేకాకుండా, రైతు రుణాన్ని గడువులోపు పూర్తిగా చెల్లిస్తే ప్రాంప్ట్ రీపేమెంట్ ఇన్సెంటివ్ కూడా లభిస్తుంది. ఈ రెండు ప్రయోజనాలు వర్తిస్తే, రైతు చెల్లించే ప్రభావిత వడ్డీ సుమారు 4% వరకు తగ్గుతుంది. కాబట్టి, మొదటి రోజు నుంచే అందరికీ 4% వడ్డీ వర్తిస్తుందని అనుకోవద్దు; సకాలంలో రుణం చెల్లించడం చాలా ముఖ్యం.
రీపేమెంట్ నియమాలు:
KCC పంట సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించబడినందున, రీపేమెంట్ కూడా పంట కోత, అమ్మకాల కాలానికి అనుగుణంగా ఉంటుంది. ప్రతి నెలా ఈఎంఐ కట్టాల్సిన అవసరం సాధారణంగా ఉండదు. రుణం తీసుకునే సమయంలో బ్యాంకు అధికారులను అడిగి గడువు వివరాలు తెలుసుకోవాలి.
ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేయాలి
సొంత భూమి ఉన్న రైతులు, కౌలు రైతులు, షేర్ క్రాపర్లు, జాయింట్ లయబిలిటీ గ్రూపులు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు KCC కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, భూమి వివరాలు, బ్యాంకు ఖాతా, ఫోటోలు వంటి పత్రాలు అవసరం. మీకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ బ్యాంకు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు, సహకార బ్యాంకులను సంప్రదించవచ్చు. చాలా బ్యాంకులు నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌ల ద్వారా కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి. జన్ సమర్థ్ పోర్టల్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
