Murali Mohan : ఆ పెద్ద హీరో నా చిన్నప్పటి ఫ్రెండ్.. ఏరా అని పిలిస్తే దగ్గరకి పిలిచి ఏమన్నాడంటే..
టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్ ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, ఇండస్ట్రీలోని పరిస్థితులు, స్టార్ హీరోలతో బాండింగ్ గురించి వెల్లడించారు. అలాగే ఓ హీరో తనకు చిన్నప్పుడే స్నేహితుడని.. ఇద్దరి మధ్య మంచి చనువు ఉండేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

టాలీవుడ్ సినీయర్ నటుడు మురళీ మోహన్, సూపర్ స్టార్ కృష్ణతో తమ సుదీర్ఘ అనుబంధం, కృష్ణ సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, ఆయనలోని గొప్ప వ్యక్తిత్వం గురించి అనేక తెలియని విషయాలను వెల్లడించారు. వీరిద్దరూ ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్, ఒకే బెంచ్‌లో కూర్చునే స్నేహితులు. బుద్ధిమంతుల్లా ముందు బెంచ్‌లో కూర్చునేవారని, అల్లరి పనులు చేసినవారు కాదని మురళీ మోహన్ గుర్తుచేసుకున్నారు. కృష్ణ తండ్రికి ఏలూరు దగ్గర తోటలు ఉండటం వల్ల ఆయన ఏలూరులో చదువుకున్నారని తెలిపారు. ఇద్దరూ ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యారని, అయితే కృష్ణ డిగ్రీ పూర్తి చేయగా, తాను వ్యాపారంపై దృష్టి పెట్టానని మురళీ మోహన్ వివరించారు.
దర్శకుడు కె.బి. తిలక్ గారు ఒక ఫంక్షన్ కోసం ఏలూరు కాలేజీకి వచ్చినప్పుడు కృష్ణను చూశారని, సినిమాలపై ఆసక్తి ఉందా అని అడిగి, అవకాశం ఇస్తానని చెప్పి తన అడ్రస్ ఇచ్చారని మురళీ మోహన్ తెలిపారు. అయితే, తిలక్ గారి పిలుపు కోసం వేచి చూడకుండా కృష్ణ మద్రాసు (చెన్నై)కు వెళ్లి, ఆయన్ను కలిశారు. మొదట్లో సినిమా తీయట్లేదని చెప్పినా, కృష్ణ పట్టుదలతో మద్రాసులో ఉండి సుమారు మూడేళ్లపాటు అవకాశాల కోసం ప్రయత్నించారు. ఈ సమయంలో ఎన్నో వైఫల్యాలను చవిచూసి, సినిమా రంగం వద్దు అనుకుని తన స్వగ్రామం బుర్రిపాలెం (తెనాలి దగ్గర) తిరిగి వెళ్ళిపోయారు.
అయితే, అదృష్టం కలిసొచ్చి, ఆయన పెళ్లి జరిగిన కొద్ది కాలానికే దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారి సినిమా తేనె మనసులు కోసం ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది. అందులో సెలెక్ట్ అవ్వడంతో కృష్ణ సినీ ప్రయాణం మొదలైంది. ఇక అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. కృష్ణ పెద్ద హీరో అయిన తర్వాత కూడా మురళీ మోహన్ మద్రాసులోని తన వ్యాపార పనుల మీద వెళ్ళినప్పుడు కృష్ణను కలిసేవారట. అప్పట్లో కృష్ణ, శోభన్ బాబు గారు కలిసి నాటకాలకు రిహార్సల్స్ చేస్తుండేవారని గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడు “ఏరా” అని పిలుచుకున్నప్పటికీ, కృష్ణ పెద్ద హీరో అయిన తర్వాత తాను “ఏవండీ” అని పిలవడం అలవాటు చేసుకున్నానని, అయితే కృష్ణ మాత్రం “హేయ్” అని పలకరించేవారని మురళీ మోహన్ తన అనుబంధాన్ని తెలియజేశారు.
కృష్ణను హీరోగా పెట్టి సినిమా తీసిన తర్వాత అది ప్లాఫ్ అయితే, సిగ్గుపడి నిర్మాత కనపడకుండా పోతే, కృష్ణ ఆయన్ను పిలిపించేవారట. “ఏమయ్యా, సినిమా పోతే కనపడవా? రావా?” అని అడిగి, మరో సినిమా చేసుకోవాల్సిందిగా ప్రోత్సహించేవారట. నిర్మాత దగ్గర డబ్బులు లేకపోతే, తానే స్వయంగా డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్లతో మాట్లాడి వారికి డబ్బులు ఇప్పించి, సబ్జెక్టును ఫైనలైజ్ చేసి, టెక్నీషియన్లను ఎంపిక చేసి, చివరకు సినిమా రిలీజ్‌కు అవసరమైన ఫైనాన్స్ కోసం తన సంతకం పెట్టి గ్యారంటీ ఇచ్చేవారట. కృష్ణ చేసినంత సహాయం ఇంకెవరూ చేయలేదని, ఆయని మంచి గుణమే ఆయన్ను కాపాడిందని మురళీ మోహన్ అన్నారు.
పద్మాలయా స్టూడియోస్ ఏర్పాటు వెనుక కృష్ణ పెద్ద మనసు కూడా ఉందని మురళీ మోహన్ తెలిపారు. కేవలం తన బ్రదర్స్ కోసమే కాకుండా, మేనల్లుళ్లు, ఇతర బంధువులు, స్నేహితులు ఇలా చాలామందికి ఉపాధి కల్పించే ఉద్దేశంతోనే పద్మాలయ బ్యాచ్‌ను (పద్మాలయా స్టూడియోస్‌ను) ఏర్పాటు చేశారని చెప్పారు. కృష్ణను “భోళా శంకరుడు” అని అన్నారు. ఆయనకు కోపం చాలా తక్కువగా వచ్చేదని కూడా పేర్కొన్నారు. సినిమా విడుదలైన తర్వాత అది అద్భుతంగా ఉందని చెప్పేవారని, కానీ మూడో రోజు ప్లాఫ్ అయితే, “పడిపోయింది అయ్యా” అని నిర్మొహమాటంగా చెప్పేవారని గుర్తు చేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..




