AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG: ఫైనల్‌పై కన్నేసిన భారత్.. ఓటమెరుగని టీంతో సెమీస్ పోరుకు సిద్ధం.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?

India vs Afghanistan U19 Asia Cup 2026 Semifinal: యూఏఈపై ఆర్యవీర్ సెహ్వాగ్ విధ్వంసక 160 పరుగుల ఇన్నింగ్స్‌తో దూసుకొచ్చిన టీమిండియా.. అండర్-19 ఆసియా కప్ 2026 సెమీఫైనల్లో అజేయంగా నిలిచిన ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనుంది. భారత్ పేలుడు బ్యాటింగ్‌కు, ఆఫ్ఘన్ ప్రాణాంతక బౌలింగ్‌కు మధ్య జరిగే ఈ సమరం ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

IND vs AFG: ఫైనల్‌పై కన్నేసిన భారత్.. ఓటమెరుగని టీంతో సెమీస్ పోరుకు సిద్ధం.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?
Afghanistan U19 Vs India U19
Venkata Chari
|

Updated on: Nov 12, 2026 | 8:14 AM

Share

India vs Afghanistan U19 Asia Cup 2026 Semifinal: యువ భారత్‌కు అసలైన పరీక్ష ఎదురైంది. లీగ్ దశలో ఎదురైన ఎదురుదెబ్బలను అధిగమించి ఊపుమీదున్న టీమిండియా.. ఇప్పుడు టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. అడ్డుగా నిలిచింది అజేయ ఆఫ్ఘనిస్థాన్. యూఏఈతో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో భారత్ 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయానికి సూత్రధారి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్. కేవలం 160 పరుగులతో ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడాడు. తండ్రిని తలపించే దూకుడు, కవర్ల మీదుగా అలవోక షాట్లు.. ఒక్క ఇన్నింగ్స్‌తో టోర్నీ దిశనే మార్చేశాడు.

ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏలో రెండో స్థానంతో సెమీస్‌కు దూసుకెళ్లింది. అగ్రస్థానంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ నిలిచింది. అంటే లీగ్ దశలో జరిగిన పొరపాట్లకు ఇక చోటు లేదు. నాకౌట్ అంటే గెలిస్తే ఫైనల్, ఓడితే ఇంటిదారే.

అవతలి వైపు ఆఫ్ఘనిస్థాన్ కథ పూర్తి భిన్నం. గ్రూప్-బీలో బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియాలను చిత్తుచేసి అజేయంగా అగ్రస్థానంతో సెమీస్‌లో అడుగుపెట్టింది. ముఖ్యంగా వారి స్పిన్ దాడి ఈ టోర్నీలో అత్యంత ప్రమాదకరంగా మారింది. పొట్టి ఫార్మాట్‌లో ఆఫ్ఘన్ యువ బౌలర్ల వైవిధ్యాన్ని ఎదుర్కోవడం ఏ జట్టుకైనా సవాలే.

అందుకే నేటి పోరు ఉత్కంఠభరితంగా మారనుంది. ఒకవైపు సెహ్వాగ్, వైభవ్ సూర్యవంశీలాంటి విధ్వంసక బ్యాటర్లతో భారత్ బ్యాటింగ్ పటిష్ఠంగా కనిపిస్తోంది. మరోవైపు క్రమశిక్షణతో కూడిన బౌలింగ్, ఫీల్డింగ్‌తో ఆఫ్ఘనిస్థాన్ పదునుగా ఉంది. గెలిచిన జట్టు ఫైనల్లో పాకిస్థాన్ – శ్రీలంక / బంగ్లాదేశ్ విజేతతో తలపడుతుంది.

టీమిండియా యువ కెరటాలకు ఇది కేవలం మ్యాచ్ కాదు… మనోధైర్యానికి పరీక్ష. ఒత్తిడిని జయిస్తేనే భవిష్యత్ స్టార్లుగా ఎదుగుతారు. ఆఫ్ఘన్లను తక్కువ అంచనా వేస్తే మూల్యం తప్పదని మాజీలు హెచ్చరి స్తున్నారు.

ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

మ్యాచ్: ఇండియా U19 vs ఆఫ్ఘనిస్థాన్ U19, 2వ సెమీఫైనల్

తేదీ: గురువారం, నవంబర్ 12, 2026 (ఇవాళ)

వేదిక: అల్ అమెరట్ క్రికెట్ గ్రౌండ్, ఒమన్

టాస్: ఉదయం 10:00 గంటలకు (IST)

మ్యాచ్ ప్రారంభం: ఉదయం 10:30 గంటలకు (IST)

టీవీ ప్రత్యక్ష ప్రసారం: సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్

లైవ్ స్ట్రీమింగ్: సోనీ లివ్ (Sony LIV) యాప్, వెబ్‌సైట్‌లో

కాబట్టి క్రికెట్ అభిమానులు సిద్ధం కండి. యువ భారత్ ఫైనల్‌కు దూసుకెళ్తుందా? లేక ఆఫ్ఘన్ సంచలనం కొనసాగుతుందా? తేలేందుకు కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us