సోనియా గాంధీ ఆత్మకథతో సినిమా.. జగ్గారెడ్డి సంచలన ప్రకటన.. నిర్మాతలు ఎవరంటే?
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి సినిమా ప్రకటనతో వార్తల్లో నిలిచారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఆత్మకథ 'బిలాంగింగ్ - ఎ జర్నీ ఆఫ్ లవ్' ఆధారంగా సినిమా నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రానికి సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే నిర్మాతలుగా వ్యవహరిస్తారని తెలిపారు. ఇందుకోసం 50 మందితో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

ఉమ్మడి ఏపీ నుంచి.. నేటి తెలంగాణ వరకు.. జగ్గారెడ్డి అంటే ఓ సెన్సేషన్.. మాట్లాడినా సంచలనమే, మాట్లాడకున్నా సంచలనమే. అలాంటి నాయకుడు.. ఇప్పుడు సినిమా ప్రకటన చేయడం.. పొలిటికల్ కారిడార్‌లో సంచలనంగా మారింది. ఆయన నుంచి ఇలాంటి ప్రకటనలు కొత్తేం కాకపోయినా.. మరోసారి అలాంటి స్టేట్మెంటే ఇవ్వడం ఆసక్తిరేపుతోంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి… మరోసారి సినిమా బాంబు పేల్చారు. తానో సినిమా తీయబోతున్నట్టు ప్రకటించి.. ఈ పొలిటికల్ ఫైర్ బ్రాండ్ కొత్త చర్చకు తెరలేపారు. సంగారెడ్డిలో బుధవారం జరిగిన కార్యకర్తల మీటింగ్‌లో.. ఈ సినిమా ప్రకటన చేసిన జగ్గారెడ్డి.. అదెలా ఉండబోతోందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు.
సోనియా ఆత్మకథ పుస్తకం ఆధారంగా సినిమా..
కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ జీవిత కథకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన బిలాంగింగ్-ఎ జర్నీ ఆఫ్ లవ్.. ఆధారంగా తన సినిమా ఉంటుందన్నారు జగ్గారెడ్డి. ఇందిరా గాంధీ కోడలిగా, రాజీవ్ గాంధీ భార్యగా, రాహుల్, ప్రియాంకల తల్లిగా సోనియా గాంధీ పాత్ర… దేశం కోసం ఆమె చేసిన త్యాగాలతో పాటు రాజకీయ ప్రయాణాన్ని క్షేత్రస్థాయి ప్రజలకు చేరువ చేయడమే తమ ఉద్దేశ్యమన్నారు.
కార్యకర్తలు, నేతలే… సినిమాకు నిర్మాతలు..
అయితే, ఈ సినిమాకు నిర్మాతలెవరనే విషయంలోనూ ఓ క్లారిటీ ఇచ్చారు జగ్గారెడ్డి. బయటి వ్యక్తుల నుంచి కాకుండా… సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే నిర్మాతలుగా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. సినిమా నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు.. 50మందితో ఓ కమిటీ కూడా వేస్తానన్నారు జగ్గారెడ్డి. అలా జగ్గారెడ్డి ప్రకటన చేశారో లేదో.. అదే మీటింగ్‌లో ఓ స్థానికనేత.. తన వంతుగా ఈ సినిమాకోసం 2 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు.
గతంలోనూ ఓ సినిమాను ప్రకటించిన జగ్గారెడ్డి!
జగ్గారెడ్డి సినిమా ప్రకటన చేయడం ఇది మొదటిసారేం కాదు. తన నిజ జీవిత రాజకీయం, ప్రేమ కథాంశంతో ‘జగ్గారెడ్డి ఎ వార్ ఆఫ్ లవ్’ అనే సినిమాను నిర్మిస్తున్నట్టు 2025లో ప్రకటించారు. అందులో తాను ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు చెప్పిన జగ్గారెడ్డి… టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఆ సినిమా ఏమైందో తెలియదుగాని.. మరోసారి కొత్త సినిమా ప్రకటనతో తెరమీదకొచ్చారు జగ్గారెడ్డి. మరి, ఇదేమవుతుందో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
