Sekhar Master: శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం.. వెనుక నుంచి ఢీకొట్టిన లారీ!
శంషాబాద్ వద్ద ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వెనుక నుంచి వచ్చిన పండ్ల లోడ్ లారీ కారును ఢీకొట్టడంతో వాహనం దెబ్బతింది. ఈ ఘటనలో శేఖర్ మాస్టర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వివరాలు కథనంలో ..

ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ వద్ద నవంబర్ 12 తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. కాకా సినిమాలోని స్పెషల్ సాంగ్ షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా ఆయన కారు ప్రమాదానికి గురైంది.
వివరాల్లోకి వెళ్తే.. సాంగ్ షూటింగ్ పూర్తి చేసుకున్న అనంతరం శేఖర్ మాస్టర్ కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో శంషాబాద్ ముచ్చింతల్ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన పండ్ల లోడ్ లారీ ఆయన కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. శేఖర్ మాస్టర్‌కు కూడా స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది.
అనుకోని ఈ ఘటనతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. తమ అభిమాన కొరియోగ్రాఫర్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. శేఖర్ మాస్టర్‌కు అయిన గాయాల తీవ్రతకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
