Viral Video: మొబైల్ ఫోన్ లాక్కున్నాడనీ.. టీచర్‌ను కత్తితో పొడిచిన స్టూడెంట్!
క్లాస్ రూంలోకి మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని టీచర్లు ఎన్ని సార్లు చెప్పినా కొందరు విద్యార్ధులు తరచూ వాటిని తీసుకురావడం ఆ కాలేజీలో షరా మామూలైంది. దీంతో ఓ టీచర్ విద్యార్ధులందరినీ వెతికి వారి వద్ద నుంచి ఫోన్లను స్వాధీనం చేసుకున్నాడు. అయితే ఫోన్లు లాక్కున్న టీచర్ పై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని కొందరు విద్యార్ధులు పన్నాగం పన్నారు. ఈ క్రమంలో ..
లక్నో, డిసెంబర్ 13: కాలేజీకి మొబైల్ ఫోన్లు తెచ్చిన విద్యార్థుల నుంచి ఓ టీచర్ వాటిని స్వాధీనం చేసుకున్నాడు. అయితే ఆగ్రహంలో ఊగిపోయిన ఇంటర్ విద్యార్థి టీచర్‌పై పగబట్టాడు. అప్పటినుంచి జేబులో కత్తి పెట్టుకుని అదును కోసం వేచిచూశాడు. సరిగ్గా మూడు రోజుల తర్వాత కత్తితో ఆ టీచర్‌ను పొడిచి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకెళ్తే..
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలోని మిహిన్‌పూర్వా వద్ద ఉన్న నవయుగ్ ఇంటర్ కాలేజీలోకి మొబైల్ ఫోన్లు నిషేధం. అయితే మూడు రోజుల క్రితం ఇంగ్లీష్ టీచర్ రాజేంద్రప్రసాద్ క్లాస్‌లో విద్యార్థులను చెక్ చేశాడు. మొబైల్ ఫోన్లు తెచ్చిన వారి నుంచి వాటిని లాక్కున్నాడు. ఆ తర్వాత కాలేజీ సమయం ముగిశాక ఆ మొబైల్ ఫోన్లను ఆ విద్యార్థులకు తిరిగి ఇచ్చేశాడు. కానీ ఓ విద్యార్ధి మాత్రం ఈ ఘటనను అంతటితో మర్చిపోకుండా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.
View this post on Instagram
ఈ క్రమంలో గురువారం ఒక విద్యార్ధి క్లాస్‌లో పాఠాలు చెబుతుండగా ఉపాధ్యాయుడిపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం జిల్లా మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఉపాధ్యాయుడు రాజేంద్రప్రసాద్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు వెంటనే విద్యార్ధిని అదుపులోకి తీసుకుని, నేరానికి పాల్పడిన కత్తిన స్వాధీనం చేసుకున్నారు. కత్తితో పొడిచిన విద్యార్థికి మరో ఇద్దరు సహకరించారని ఉపాధ్యాయుడు రాజేంద్రప్రసాద్ పోలీసులకు తెలిపారు. ఈ మేరకు కేసు వివరాలను అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (నగరం) రామానంద్ ప్రసాద్ కుష్వాహా మీడియాకు తెలిపారు.