AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెలుగులోకి దారుణం.. తల్లిని చంపి.. అన్నకు ఫోటో పంపిన తమ్ముడు..!

తమిళనాడులోని తూత్తుకుడిలో దారుణం జరిగింది. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఓ కొడుకు తన తల్లిని రోలుతో కొట్టి చంపాడు. అనంతరం తల్లి మృతదేహం ఫోటోను తన అన్నకు పంపాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల అసలు కారణాలు, నిందితుడి మానసిక పరిస్థితిపై దృష్టి సారించారు.

వెలుగులోకి దారుణం.. తల్లిని చంపి.. అన్నకు ఫోటో పంపిన తమ్ముడు..!
Son Kills Mother
Balaraju Goud
|

Updated on: Aug 23, 2026 | 10:45 AM

Share

తమిళనాడులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువకుడు తన తల్లిని రోలుతో తలపై కొట్టి హతమార్చాడు. ఈ దారుణ ఘటన తూత్తుకుడి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. తిరుచెందూర్ సమీపంలోని కుమారపురం జయనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలిని రిటైర్డ్ కళాశాల ప్రొఫెసర్ రేణుకాదేవి (62)గా గుర్తించారు. నిందితుడైన ఆమె కుమారుడు తంగపాలన్ (27)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రేణుకాదేవి, అంబుమణి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు చెన్నైలో పోలీసు శాఖలో పనిచేస్తుండగా.. చిన్న కుమారుడు తంగపాలన్ గత మూడేళ్లుగా మానసిక అనారోగ్యానికి చికిత్స పొందుతున్నాడు. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో రేణుకాదేవి, తంగపాలన్ మాత్రమే ఉన్నారు. అంబుమణి కుటుంబ దేవత ఆలయానికి వెళ్లారు.

ఇంట్లో ఉన్న సమయంలో తంగపాలన్ అకస్మాత్తుగా రోలును తీసుకుని తల్లి తలపై బలంగా కొట్టినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలతో రేణుకాదేవి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం తంగపాలన్ తన తల్లి మృతదేహం ఫొటో తీసి వాట్సాప్ ద్వారా తన అన్నకు పంపినట్లు తెలుస్తోంది. ఫొటో చూసి షాక్‌కు గురైన పెద్ద కుమారుడు వెంటనే తండ్రికి సమాచారం అందించాడు. అంబుమణి ఇంటికి చేరుకునేసరికి భార్య మృతి చెంది ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న తిరుచెందూర్ తాలూకా పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం తిరుచెందూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంబుమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తంగపాలన్‌ను అరెస్టు చేశారు.

హత్యకు అసలు కారణమేంటన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి మానసిక పరిస్థితి, గతంలో అతడికి అందిన చికిత్స, ఘటనకు ముందు ఏమైనా గొడవ జరిగిందా అనే అంశాలను పరిశీలిస్తున్నారు. కుటుంబ సభ్యులతో పాటు పరిసర ప్రాంతాల్లోని వ్యక్తులను కూడా విచారిస్తున్నారు. నిందితుడిని వైద్యుల పర్యవేక్షణలో ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక చికిత్సకు చేర్పించినట్లు పోలీసులు తెలిపారు. మెడికల్ నివేదికలు, పోస్టుమార్టం వివరాలు, దర్యాప్తులో వెలువడే ఆధారాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని, కలకలం సృష్టిస్తోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us