AIDMK: అన్నాడీఎంకేలో మరో ముసలం.. ఆ ఇద్దరు నేతల మధ్య మొదలైన వార్..!
AIDMK: తమిళనాడులో అన్నాడీఎంకేలో మరో ముసలం మొదలయ్యింది. పార్టీ చీఫ్ పదవీ కోసం, మాజీ ముఖ్యమంత్రులు ఈపీఎస్, ఓపీఎస్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది.
AIDMK: తమిళనాడులో అన్నాడీఎంకేలో మరో ముసలం మొదలయ్యింది. పార్టీ చీఫ్ పదవీ కోసం, మాజీ ముఖ్యమంత్రులు ఈపీఎస్, ఓపీఎస్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. పార్టీ కేడర్ కూడా రెండు వర్గాలుగా విడిపోయారు. తమతమ వర్గాల నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు పలనీ స్వామి, పన్నీర్ సెల్వం. అటు, రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ కొత్త చీఫ్ మా నాయకుడే అంటూ ఇద్దరి అనుచరులు పోస్టర్లు వేస్తున్నారు. అక్కడితో ఆగకుండా, ఓపీఎస్ పోస్టర్లను చించేశారు ఈపీఎస్ వర్గం కార్యకర్తలు. దీంతో వివాదం మరింత ముదిరింది.
ఈనెల 23న జరిగే సర్వసభ్య సమావేశంలో కొత్త నాయకుడి ఎన్నిక ఉంటుందని, ఆ రోజు ఏం జరిగినా అందరూ సంయమనం పాటించాలని ట్వీట్ చేశారు పన్నీర్ సెల్వం. పార్టీ అధినేత పదవీపై కీలక కామెంట్స్ చేశారు. తనను పార్టీ నుంచి, కార్యకర్తల నుంచి ఎవరు దూరం చేయలేరని అన్నారు. అన్నాడీఎంకే పార్టీ జనరల్ సెక్రెటరీని సర్వసభ్య సమావేశంలోనే ఎన్నుకోవాలని, కానీ పార్టీ అధినేతకి సంబంధించిన ఎన్నిక జరగాలని తాను చెప్పలేదన్నారు పన్నీర్ సెల్వం. అన్నాడీఎంకే నేతల మధ్య, పార్టీ అధినేతగా ఎవరు ఉండాలనే విషయంలో విభేదాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధినేతగా ఎప్పటికి దివంగత నేత జయలలిత పేరు ఉంటుందని స్పష్టం చేశారు. ఆ పదవిని ఇప్పుడు ఎవరు ఆశించినా, అది జయలలితకి ద్రోహం చేయడమే అవుతుందని అన్నారు పన్నీర్ సెల్వం.