MK Stalin Cabinet: స్టాలిన్, గాంధీ, నెహ్రూ..తమిళనాట కొత్త మంత్రివర్గం..ఆసక్తికరంగా మంత్రుల పేర్లు..శాఖలు..ఎందుకంటె..

Tamil Nadu Cabinet: తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం కొలువుతీరింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యంతో డీఎంకే పార్టీకి పట్టం కట్టారు ప్రజలు. 

  • Publish Date - 11:43 am, Fri, 7 May 21
MK Stalin Cabinet: స్టాలిన్, గాంధీ, నెహ్రూ..తమిళనాట కొత్త మంత్రివర్గం..ఆసక్తికరంగా మంత్రుల పేర్లు..శాఖలు..ఎందుకంటె..
Tamil Nadu Cabinet

MK Stalin Cabinet: తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం కొలువుతీరింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యంతో డీఎంకే పార్టీకి పట్టం కట్టారు ప్రజలు. దీంతో తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ ప్రమాణస్వీకారం చేశారు. స్టాలిన్‌తో గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. కరోనా తీవ్రత దృష్ట్యా నిరాడంబరంగా ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. మరో 34 మంత్రులు కూడా స్టాలిన్ తో పాటు ప్రమాణం చేశారు. కరుణానిధి మంత్రివర్గంలో పని చేసిన వారికి స్టాలిన్ మరోసారి అవకాశమిచ్చారు. ఆయన మంత్రివర్గంలో ఇద్దరు మహిళలు, ఇద్దరు మైనారిటీలకు స్థానం దక్కింది.

తమిళనాడులో ప్రమాణస్వీకారం చేసిన మంత్రులలో జాతీయ నాయకుల పేర్లున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి పేరే జాతీయ నాయకుడి పేరు.. ఇక ఆయన సహచరులలో గాంధీ.. నెహ్రూ కూడా వచ్చి చేరారు. ఆసక్తికరంగా అనిపిస్తుంది కదూ. అంతేకాదు.. వారికి కేటాయించిన శాఖలు చూస్తే మరింత ఆసక్తికరంగా అనిపిస్తుంది. చేనేత వస్త్రాలు, ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల బోర్డు శాఖలు ఆర్ గాంధీకి ఇచ్చారు. ఇక కెఎన్ నెహ్రూకు పట్టణ మరియు నీటి సరఫరా బాధ్యత కలిగిన మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పారు. కాకతాళీయం అయినా గాంధీ పేరుకు, నెహ్రూ పేరుకు తగ్గ శాఖలు కేటాయించడం కొంత ఆశ్చర్యంగానే అనిపిస్తోంది.

ఇక స్టాలిన్.. గాంధీ..నెహ్రూ ఈ ముగ్గురి రాజకీయ జీవితం గురించి సంక్షిప్తంగా చూస్తే..

  • 1967లో 14 ఏళ్ళ వయసులోనే పార్టీ ప్రచారంలో పాల్లొంటూ రాజకీయ ప్రవేశం చేశారు. 1973లో డీఎంకే పార్టీ జనరల్‌ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1996 నుంచి2002 వరకు చెన్నై మేయర్‌గా పనిచేశారు. 1989 నుంచి ధౌసెండ్‌ లైట్స్ నియోజక వర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఎంకే స్టాలిన్‌. 2009 నుండి 2011 వరకు తమిళనాడు మొదటి ఉప ముఖ్యమంత్రిగా స్టాలిన్‌ పనిచేశారు. జనవరి 3, 2013లో కరుణా నిధి తన రాజకీయ వారసుడిగా స్టాలిన్‌ ను ప్రకటించారు. జనవరి 4,2017 న డిఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా స్టాలిన్ నియామకంజరిగింది. 2021లో అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి గా స్టాలిన్ కొళత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్రంలో పది సంవత్సరాల తరువాత అధికారంలోకి వచ్చిన డీఎంకే పార్టీ అధినేతగా ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
  • ఆర్ గాంధీ రాణిపేట నియోజకవర్గం నుండి తమిళనాడు అసెంబ్లీకి 1996 లో మొదట డీఎంకే అభ్యర్థిగా ఎన్నికయ్యారు. గాంధీ, అతని భార్య, కొడుకుతో పాటు, అనేక మంది డీఎంకే మంత్రులతొ పాటు అసమాన ఆస్తులను కలిగి ఉన్నారని అప్పట్లో అభియోగాలు నమోదు అయ్యాయి. సాక్ష్యాలు లేనందున ఈ ఆరోపణలను కోర్టులు రద్దు చేశాయి.
  • కెఎన్ నెహ్రూ – డీఎంకే ప్రధాన కార్యదర్శి, పార్టీ లో సీనియర్ నాయకుడు. తిరుచి పశ్చిమ నియోజకవర్గం నుండి వరుసగా ఐదవసారి ఎన్నికలలో పోటీ చేశారు. ఆయన తండ్రి కాంగ్రెస్ సభ్యుడు. దీంతో ఆయనకు జవహర్‌లాల్ నెహ్రూ పేరు పెట్టారు, ఏదేమైనా, ఈ కుటుంబం 1960 ల చివరలో డీఎంకేకు దగ్గరైంది. తర్వాత నెహ్రూ 1989 లో తన మొదటి ఎన్నికలలో గెలిచినప్పటి నుండి పార్టీకి బలమైన వ్యక్తిగా ఉంటూ వస్తున్నారు.

ఇక స్టాలిన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు హాజరు అయ్యారు. మక్కల్ నీథి మయ్యం అధినేత కమల్ హాసన్, డీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలు, పలువురు కీలక నాయకులు హాజరయ్యారు. అయితే,
ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు..ఆ పార్టీ ఎమ్మెల్యే, నటుడు ఉదయనిధి స్టాలిన్ నిలిచారు. ఇక స్టాలిన్ తో పాటు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన 34 మంది మంత్రులలో 15 మంది కొత్తవారు కాగా, ఇద్దరు మహిళలు ఉన్నారు. తన తండ్రి కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడు మంత్రులుగా పనిచేసిన వారికే స్టాలిన్‌ ఎక్కువగా కేబినేట్‌లో ఛాన్స్ కల్పించారు. కీలకమైన హోంశాఖసహా పలు ఇతర శాఖలను తన వద్దే ఉంచుకున్నారు సిఎం స్టాలిన్.

Also Read: Durai Murugan: స్టాలిన్‌తో పాటు ప్రమాణం చేసిన దురైమురుగన్‌కు ఘనమైన చరిత్రే ఉంది!

Great Escape: 21 అడుగుల గోడ దూకి ఐదుగురు ఖైదీల పరారీ.. అచ్చు సినిమాలో చూపించినట్టే.. జైలు అధికారులు షాక్!